Nizamabad Kalotsav : కళతప్పిన నిజామాబాద్ కళోత్సవ్, కొరవడిన సమన్వయం-nizamabad news in telugu kalotsav 2023 failed to attract students due to miscommunication ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Nizamabad News In Telugu Kalotsav 2023 Failed To Attract Students Due To Miscommunication

Nizamabad Kalotsav : కళతప్పిన నిజామాబాద్ కళోత్సవ్, కొరవడిన సమన్వయం

HT Telugu Desk HT Telugu
Nov 14, 2023 02:13 PM IST

Nizamabad Kalotsav : పాఠశాల విద్యార్థుల నైపుణ్యతకు పదును పెట్టే కళోత్సవ్ ఈ ఏడాది కళ తప్పింది. జిల్లా, మండల స్థాయి అధికారుల్లో సమన్వయం కొరవడి కింద స్థాయికి కనీసం సమాచారం కూడా అందలేదు. ఈ ఏడాది కేవలం 30 మంది విద్యార్థులు మాత్రమే కళోత్సవ్ లో పాల్గొన్నారని సమాచారం.

కళోత్సవ్(File Photo)
కళోత్సవ్(File Photo)

Nizamabad Kalotsav : స్కూల్ విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యత‌ను, ప్రతిభాపాఠ‌వాల‌ను వెలికితీసేందుకు నిర్వహించే క‌ళోత్సవ్ ఈ ఏడాది క‌ళత‌ప్పింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల్లో టాలెంట్‌ను బ‌య‌ట తీసేందుకు ఈ ఉత్సవాలు ఓ వార‌ధిగా ప‌నిచేస్తాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న విద్యార్థులు రాష్ట్ర, జాతీయ‌ స్థాయిలో త‌మ ప్రద‌ర్శనల ద్వారా నైపుణ్యత‌ను చూపే అవ‌కాశ‌ముంటుంది. కానీ ఈ ఏడాది జిల్లా, మండ‌ల స్థాయి అధికారుల్లో స‌మ‌న్వయం కొర‌వ‌డి విద్యార్థుల‌కు శాపంగా మారింది. వైభ‌వంగా జ‌ర‌గాల్సిన క‌ళోత్సవాలు క‌ళాహీనంగా మారాయి. మండ‌ల‌స్థాయిలోని పాఠ‌శాల‌ల‌కు ఈ స‌మాచారం కూడా చేరలేదు. ఈ కార్యక్రమానికి కోఆర్డినేట‌ర్‌గా వ్యవ‌హ‌రిస్తున్న జిల్లాస్థాయి అధికారిని వివ‌ర‌ణ కోర‌గా ఎంఈఓల‌కు స‌మాచారం అందించామ‌ని తెలిపారు. కానీ వారు ఇత‌ర ప‌నుల్లో బిజీగా ఉండ‌టం వ‌ల్ల విద్యార్థుల‌కు స‌మాచారం చేర‌లేద‌ని పేర్కొన్నారు. పైగా త‌న‌కు ఈ మ‌ధ్యనే కో-ఆర్డినేట‌ర్‌గా అద‌న‌పు బాధ్యత‌లు అప్పగించార‌ని, మూడు రోజుల పాటు హైద‌రాబాద్‌లో స‌మావేశానికి వెళ్లానన్నారు.

ట్రెండింగ్ వార్తలు

30 మంది విద్యార్థులతో మాత్రమే

సాధార‌ణంగా క‌ళోత్సవ్‌లో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్లకు చెందిన విద్యార్థులు పాల్గొనే అవ‌కాశ‌ముంది. కానీ ఈసారి ప్రైవేటు, ఎయిడెడ్ విద్యార్థులు సైతం దూర‌మ‌య్యారు. ఈ నెల 9, 10వ తేదీల్లో రెండు రోజుల పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాల్‌భ‌వ‌న్‌లో క‌ళా ఉత్సవాలు జ‌రిగాయి. కానీ కేవ‌లం 30 మంది విద్యార్థులు మాత్రమే పాల్గొన్నారు. మీడియాకు సైతం ఎలాంటి స‌మాచారం లేదు. దీంతో నిర్వహ‌ణ‌పై పెద్దఎత్తున విమ‌ర్శలు వ‌చ్చాయి. దీంతో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా మ‌ళ్లీ 13వ తేదీన రెండోసారి ఉత్సవాలు నిర్వహించారు. ఏదైనా పోటీ ఒక్కసారి నిర్వహించి అందులో సెల‌క్ట్ అయిన వారి పేర్లను ఖ‌రారు చేస్తారు. కానీ మొద‌ట రెండు రోజుల పాటు నిర్వహించి .. మ‌ళ్లీ నిన్న నిర్వహించ‌డం గ‌మ‌నార్హం.

ఒకే అధికారికి పలు బాధ్యతలు ఇవ్వడమే కారణం

ఎంఈఓల నుంచి ఆశించిన స‌హ‌కారం లేక‌పోవ‌డంతోనే కళోత్సవ్ స‌క్సెస్ కాలేద‌ని జిల్లా అధికారి తెలిపారు. జిల్లా స్థాయిలో జ‌రిగిన పోటీల్లోనూ 99 శాతం మంది కేజీబీవీల నుంచి పాల్గొన‌డం గ‌మ‌నార్హం. ఈ కార్యక్రమం గ‌త సంవ‌త్సరం అంగ‌రంగ వైభ‌వంగా నిర్వహించారు. గ‌తేడాది 150 విద్యార్థులతో ఘనంగా జెడ్‌పీహెచ్ఎస్‌(బొర్గాం) పాఠశాలలో జరిగింది. నిజామాబాద్ జిల్లా నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి కి విద్యార్ధులు ఎంపికయ్యారు. అయితే ఒకే అధికారికి ప‌లు బాధ్యత‌లు అప్పగించ‌డం వ‌ల్ల కార్యక్రమ నిర్వహ‌ణ సాధ్యం కాలేద‌ని, అందువ‌ల్లే విఫ‌ల‌మ‌య్యింద‌ని ఆ శాఖ‌లోని అధికారులు, సిబ్బంది తెలిపారు.

రిపోర్టింగ్ : ఎం.భాస్కర్, నిజామాబాద్

IPL_Entry_Point