Nizamabad Degree Student : చీటీలు రాయొద్దన్నందుకు దాడి, బోధన్ బీసీ హాస్టల్ లో డిగ్రీ విద్యార్థి మృతి!
Nizamabad Degree Student : ఇంటర్ పరీక్షలకు చీటీలు రాస్తున్న విద్యార్థులను వారించినందుకు.... డిగ్రీ విద్యార్థిపై దాడి చేశారు. ఈ ఘటనలో ఆ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన బోధన్ బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో చోటుచేసుకుంది.
Nizamabad Degree Student : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్ (Bodhan BC Welfare Hostel)లో దారుణం చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం తిప్పారం తండా గ్రామానికి చెందిన జగ్యా నాయక్ - గోరీ బాయి దంపతుల కుమారుడు వెంకట్రాం(21) బోధన్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో పట్టణంలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్నాడు. ఈ హాస్టల్ లో ఇంటర్, డిగ్రీ విద్యార్థులు(Degree Student) ఉంటారు. అయితే ఇంటర్ విద్యార్థి అనిల్ సోమవారం జరిగే పరీక్ష కోసం రాత్రి స్టడీ హావర్ లో మైక్రో జిరాక్స్ (Micro Xerox)చీటీలు రాస్తుండగా చీటీలు రాయవద్దని డిగ్రీ విద్యార్థి వెంకట్రాం చెప్పడంతో ఆగ్రహించిన అనీల్ అతని సోదుడు దిలీప్ కు సమాచారం ఇచ్చాడు. దాంతో దిలీప్, లక్ష్మణ్, శివ, అనీల్, పరమేశ్ వీరు కలిసి వెంకట్రాంపై దాడికి పాల్పడ్డారు .అలాగే గొంతు గట్టిగా పట్టి లేపడంతో వెంకట్రాం అక్కడిక్కడే స్పృహ తప్పి మృతి చెందాడు. దాడి చేసిన వారు అతని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ క్రమంలో అక్కడ ఉన్న పోలీసులు ఘటనపై ఆరాతీయగా తమ కొట్లాటలో చనిపోయాడని వారిని అదుపులో తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయం గ్రామస్తులకు తెలవడంతో వారు హుటాహుటిన బోధన్ కు తరలివచ్చారు. ఏసీపీ శ్రీనివాస్ బోధన్ రూరల్ సీఐ కార్యాలయానికి వచ్చే ఘటనపై వివరాలు సేకరించారు. సీఐ కార్యాలయానికి మృతుడి కుటుంబీకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ఏసీపీ శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ..మృతుడు వెంకట్రాం అనిల్ అనే విద్యార్థికి చీటీలు రాయవద్దని చెప్పడంతో అనిల్ ఈ విషయాన్ని అతని సోదరుడికి చెప్పాడు .దాంతో దిలీప్, అనిల్, శివ ,కృష్ణ ,లక్ష్మణ్, పరమేష్ వీరు కలిసి వెంకట్రాంపై దాడికి పాల్పడ్డారని, అలాగే గొంతు గట్టిగ పట్టి దాడి చేయడంతో మృతి చెందాడని తెలిపారు. అతన్ని వారు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని తెలిపారు. డిగ్రీ విద్యార్థి మృతికి కారుకులైన వారిని అరెస్ట్ చేశామని వారిపై మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేశామని ఏసీపీ తెలిపారు.
విద్యార్థి సంఘాల నిరసన
బీసీ హాస్టల్ లో హాస్టల్ వార్డెన్ స్వామి నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. వార్డెన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్(TS Police) ఎదురుగా రోడ్డుపై బైఠాయించారు. నిరసన వ్యక్తం చేస్తున్న వారిని పోలీసులు చెదరగొట్టి పోలీసు వాన్ లో ఎక్కించారు. దాంతో విద్యార్థి సంఘ నాయకులను వదిలివేయాలని కోరుతూ మృతుడి గ్రామస్తులు పోలీసు వ్యాన్ కు అడ్డుగా నిలిచారు. దాంతో పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులు వదిలేశారు. ఇదిలా ఉండగా ఓ విద్యార్థి సంఘ నాయకుడు అతిగా వ్యవహరించి పోలీసులకు ఇబ్బంది కలిగించడంతో అతన్ని పోలీసులు వాహనంలో ఎక్కించారు. ఈ నిరసనలో వామపక్ష విద్యార్థి సంఘ నాయకులు సంజయ్, మంగేష్, బాలరాజ్ ,ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఘటన బాధ్యతుడిగా హాస్టల్ వాచ్ మెన్ ను అధికారులు విధులలో నుంచి తొలగించారు.
సంబంధిత కథనం