TSRTC On Jeevan Reddy : జీవన్ రెడ్డి ఆరోపణల్లో నిజం లేదు, ఇంకా రూ.2.5 కోట్లు బకాయిలు చెల్లించాలి- టీఎస్ఆర్టీసీ-nizamabad armoor jeevan reddy mall issue tsrtc alleged ex mla jeevan reddy need to pay 2 5 crore ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tsrtc On Jeevan Reddy : జీవన్ రెడ్డి ఆరోపణల్లో నిజం లేదు, ఇంకా రూ.2.5 కోట్లు బకాయిలు చెల్లించాలి- టీఎస్ఆర్టీసీ

TSRTC On Jeevan Reddy : జీవన్ రెడ్డి ఆరోపణల్లో నిజం లేదు, ఇంకా రూ.2.5 కోట్లు బకాయిలు చెల్లించాలి- టీఎస్ఆర్టీసీ

HT Telugu Desk HT Telugu
May 11, 2024 07:54 PM IST

TSRTC On Jeevan Reddy : ఆర్మూర్ బస్ స్టాండ్ సమీపంలోని జీవన్ రెడ్డి మాల్ అద్దె బకాయిల చెల్లింపు విషయంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన ఆరోపణలను టీఎస్ఆర్టీసీ ఖండించింది. నోటీసులు ఇచ్చినా ఇవ్వలేదని చెప్పడం, జీఎస్టీ కేంద్రానికి కట్టడంలేదని, సంస్థ అధికారులపై ఆరోపణలు సరికాదని తెలిపింది.

జీవన్ రెడ్డి ఆరోపణల్లో నిజం లేదు-టీఎస్ఆర్టీసీ
జీవన్ రెడ్డి ఆరోపణల్లో నిజం లేదు-టీఎస్ఆర్టీసీ

TSRTC On Jeevan Reddy : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బస్ స్టాండ్ సమీపంలోని 7059 చదరపు గజాల భూమిని విష్ణుజిత్‌ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీకి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) అద్దెకు ఇస్తూ ఒక ఒప్పందం చేసుకుంది. ప్రత్యామ్నాయ రెవెన్యూ పెంచుకునేందుకు గాను 33 సంవత్సరాలకు బిల్ట్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌(బీవోటీ) కింద జూన్ 1, 2013న ఆ భూమిని ఆర్టీసీ లీజ్‌కు ఇచ్చింది. ఆ స్థలంలో ఒక షాపింగ్‌ మాల్‌ను సదరు కంపెనీ డెవలప్‌ చేసింది. కాగా 2017లో విష్ణుజిత్ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి సతీమణి రజితా రెడ్డి స్వాధీనం చేసుకొని ఆ షాపింగ్ మాల్ కు జీవన్‌ రెడ్డి మాల్‌ అండ్‌ మల్టీపెక్స్‌ గా పేరుపెట్టారు. థర్డ్‌ పార్టీలకు అందులోని స్టాళ్లను జీవన్ రెడ్డి లీజ్‌కు ఇచ్చారు. ఒప్పందం ప్రకారం ఆ కంపెనీ సకాలంలో ఆర్టీసీ సంస్థకు అద్దె చెల్లించలేదు. 2015 అక్టోబర్‌ వరకు రూ.4.30 కోట్ల బకాయిను సంస్థకు పడింది. దీంతో అప్పుడే టెర్మినేషన్‌ ఆర్డర్‌ను సంస్థ జారీ చేసింది. దీంతో రెండు పర్యాయాలు రూ.69 లక్షలను చెల్లించిన జీవన్ రెడ్డి.......... మిగతా బకాయిలను చెల్లించాలని పలుసార్లు నోటీసులు పంపించినా స్పందించలేదని ఆర్టీసీ స్పష్టం చేసింది. గత ఏడాది అక్టోబర్‌ వరకు రూ.8.65 కోట్ల బకాయిలు ఉన్నాయని, అప్పుడు మళ్లీ నోటీసులు జారీ చేయడంతో... గతేడాది అక్టోబర్ నెలలో రూ.1.5 కోట్లను మాత్రమే చెల్లించారని ఆర్టీసీ వివరించింది.

ఆర్టీసీకి రూ 2.5 కోట్ల బకాయిలు జీవన్ రెడ్డి చెల్లించాలి

ఆ తర్వాత షోకాజ్‌ నోటీసులు పంపించడంతో గత ఏడాది డిసెంబర్‌ లో విడతల వారీగా మొత్తం రూ.2.40 కోట్లను జీవన్ రెడ్డి చెల్లించారు. షోకాజ్‌ నోటీసును సవాల్‌ చేస్తూ మాజీ ఎమ్మెల్యే హైకోర్టును ఆశ్రయించగా..... టీఎస్‌ఆర్టీసీకి బకాయిలు చెల్లించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో విడతల వారీగా రెండు కోట్లను చెల్లించారు. అయితే ఈ కేసుపై బకాయిలన్నీ నెల రోజుల్లో చెల్లించాలని, అది ప్రజల డబ్బుని ఈ సంవత్సరం మార్చి 27న హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బకాయిలు చెల్లించకుంటే నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని సంస్థ ఆదేశించింది. నెల రోజుల గడువు పూర్తైన మొత్తం బకాయిను ఆ కంపెనీ చెల్లించలేదని ఆర్టీసీ సంస్థ పేర్కొంది. ఇప్పటివరకు రూ.2.51 కోట్ల అద్దె బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వుల 302 మేరకు ఈ నెల 9వ తేదీన నోటీసులు ఇవ్వడానికి ఆర్టీసీ అధికారులు షాపింగ్‌ మాల్‌ కు వెళ్లారు. ఆ మాల్‌ లో థర్డ్‌ పార్టీ స్టాళ్లు ఉండటంతో వారికి సమాచారం ఇచ్చేందుకు మైక్‌ లో అనౌన్స్‌ చేశారు.

ప్రెస్ మీట్ పెట్టి సంస్థపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు

వాస్తవాలు ఇలా ఉంటే.....శుక్రవారం నిజామాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించి టీఎస్ఆర్టీసీ, సంస్థ ఉన్నతాధికారులపై మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అసత్య ఆరోపణలు చేశారని, ఇష్టానుసారంగా నిరాధారమైన ఆరోపణలు చేయడాన్ని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోందని సంస్థ తేల్చి చెప్పింది. ఆయన చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే సంస్థ వదిలేస్తోందని తెలిపింది. అద్దె బకాయిల విషయంలో లీజ్‌ ఒప్పందం, హైకోర్టు ఆదేశాల ప్రకారమే సంస్థ నడుచుకుంటోందని, టీఎస్ఆర్టీసీ యాజమాన్యం మరొక్కసారి స్పష్టం చేసింది. బకాయిలు చెల్లించాలని గత 5 సంవత్సరాలుగా 20కి పైగా నోటీసులను సంస్థ జారీ చేసినా... తమకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని ఆరోపించడంలో ఏమాత్రం నిజం లేదని ఆర్టీసీ అధికారులు అన్నారు. అలాగే జీఎస్టీ కేంద్రానికి చెల్లించడం లేదనడం పూర్తిగా అర్థరహితం అని సంస్థ భావించింది. నిబంధనల ప్రకారమే క్రమం తప్పకుండా జీఎస్టీని కేంద్రానికి సంస్థ చెల్లిస్తోందని,

బకాయిల విషయంలో సంస్థ ఏమాత్రం రాజీపడటం లేదు. నిబంధనల మేరకే వాటిని వసూలు చేయడం జరుగుతోంది. ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించకుండా ఉద్దేశపూర్వకంగా సంస్థపై, ఉన్నతాధికారులపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం సరికాదని సంస్థ పేర్కొంది.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

సంబంధిత కథనం