Nirmal News : ఎంత కష్టమొచ్చింది తల్లి! అమ్మ అంత్యక్రియల కోసం బాలిక భిక్షాటన-nirmal mother died by suicide minor girl begging money for mother final rites ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nirmal News : ఎంత కష్టమొచ్చింది తల్లి! అమ్మ అంత్యక్రియల కోసం బాలిక భిక్షాటన

Nirmal News : ఎంత కష్టమొచ్చింది తల్లి! అమ్మ అంత్యక్రియల కోసం బాలిక భిక్షాటన

Bandaru Satyaprasad HT Telugu
Aug 18, 2024 05:23 PM IST

Nirmal News : నిర్మల్ జిల్లా హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తల్లి అంత్యక్రియల కోసం సాయం చేయాలని ఓ చిన్నారి భిక్షాటన చేసింది. ఇటీవల తండ్రి మృతి చెందగా, మనస్థాపంతో తల్లి ఆత్మహత్య చేసుకుంది. దీంతో అనాథగా మిగిలిన ఈ చిన్నారి తల్లి అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేక భిక్షాటన చేసింది.

ఎంత కష్టమొచ్చింది తల్లి! అమ్మ అంత్యక్రియల కోసం బాలిక భిక్షాటన
ఎంత కష్టమొచ్చింది తల్లి! అమ్మ అంత్యక్రియల కోసం బాలిక భిక్షాటన

Nirmal News : నిర్మల్ జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. తల్లి అంత్యక్రియల కోసం సాయం చేయాలని బాలిక భిక్షాటన చేసింది. గతంలో అనారోగ్యంతో తండ్రి మృతి చెందగా, మనస్థాపంతో తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులిద్దరూ దూరమైన ఆ బాలిక తల్లి అంత్యక్రియల కోసం భిక్షాటన చేస్తున్న ఘటన స్థానికులు కలచివేసింది.

తల్లి అంత్యక్రియల కోసం భిక్షాటన

నిర్మల్ జిల్లా తానూర్ మండలం బేల్ తరోడాలో గ్రామంలో నివాసం ఉంటున్న గంగామణి (36) భర్తతో గొడవల కారణంగా 11 ఏళ్ల కుమార్తె దుర్గతో కలిసి ఒంటరిగా జీవిస్తుంది. కూలిపనులు చేసుకుంటూ కూతురు దుర్గను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు పంపి చదివిస్తుంది. ఇటీవల గంగామణి భర్త అనారోగ్యంతో మరణించాడు. మనస్థాపంతో శనివారం రాత్రి గంగామణి ఆత్మహత్య చేసుకుంది. చిన్నతనంలోనే చిన్నారి దుర్గ తల్లిదండ్రులను కోల్పోయింది. ఇంట్లో చిల్లిగవ్వ కూడా లేకపోవడం, తల్లి అంత్యక్రియలు ఎలా చేయాలో తెలియక చిన్నారి దుర్గ...తన ఇంటి ముందు ఓ గుడ్డ వేసుకుని అంత్యక్రియలు సాయం చేయాలని వేడుకుంది. ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దాతలు స్పందించి సహాయం అందిస్తున్నారు. కొందరు ఫోన్ పే ద్వారా సాయం చేశారు.

పోలీసులు కూడా సాయం

బంధువులు ఉన్నా ఆర్థికంగా అండగా నిలవకపోవడంతో చిన్నారి దుర్గ తప్పని పరిస్థితుల్లో భిక్షాటన చేపట్టింది. తల్లి మృతదేహం దగ్గర చిన్న గుడ్డను పరిచి తోచిన సాయం చేయమంటూ స్థానికులను‌ వేడుకుంది. ఈ వీడియో వైరల్ కావడంతో చుట్టుపక్కల గ్రామాలవాళ్లు, స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి తరలి‌వచ్చి తమ‌వంతు ఆర్థికసాయం అందిస్తున్నారు. గంగామణి ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. విచారణకు కోసం పోలీసులు కూడా తమకు తోచిన సాయం అందించారు.

సంబంధిత కథనం