Nirmal Crime : ప్రభుత్వ పాఠశాలలో వేడి రాగిజావలో పడి విద్యార్థిని మృతి-nirmal crime news in telugu toddler student died after falling into hot ragi java in govt school ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nirmal Crime : ప్రభుత్వ పాఠశాలలో వేడి రాగిజావలో పడి విద్యార్థిని మృతి

Nirmal Crime : ప్రభుత్వ పాఠశాలలో వేడి రాగిజావలో పడి విద్యార్థిని మృతి

HT Telugu Desk HT Telugu

Nirmal Crime : నిర్మల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రాథమిక పాఠశాలలో వేడి రాగిజావ పాత్రలో ప్రమాదవశాత్తు పడి విద్యార్థిని మృతి చెందింది.

రాగి జావలో పడి చిన్నారి మృతి

Nirmal Crime : అభం శుభం తెలియని చిన్నారి... అప్పటి వరకు తల్లితో ఆడుకుని పాఠశాలకు వెళ్లిన 5 ఏళ్ల చిన్నారికి నిండు నూరేళ్లు నిండాయి. నిర్మల్ జిల్లా మామడ మండలం కొరటికల్ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల కోసం చేసిన వేడి వేడి రాగిజావ పాత్రలో ప్రమాదవశాత్తు పడి తీవ్ర గాయాలపాలైన విద్యార్థిని ఆదివారం మృతి చెందింది. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం విద్యార్థుల కోసం రాగిజావ వండారు. ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థిని కోండ్ర ప్రజ్ఞ ప్రమాదవశాత్తు వేడి రాగిజావ పాత్రలో పడిపోయింది. విద్యార్థినికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

విచారణకు కలెక్టర్ ఆదేశం

ఈ సంఘటన తెలిసిన విద్యార్థిని తల్లిదండ్రులు పాఠశాల చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. ఈ సంఘటన పట్ల జిల్లా కలెక్టర్ స్పందిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డికి సంబంధిత ఉపాధ్యాయులపైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డీఈవో రవీందర్ రెడ్డి విచారణ జరిపి ప్రాథమిక అంచనాల ప్రకారం బాధ్యులైన ఉద్యోగిని సస్పెన్షన్ వేటు వేశారు. అంతేకాకుండా మిగతా నలుగురు ఉపాధ్యాయులకు షోకాస్ నోటీసులు జారీచేశారు. ఇదిలా ఉంటే కోరిటికల్ పాఠశాల ప్రవేట్ పాఠశాలలకు దీటుగా అధిక సంఖ్య విద్యార్థులు కలిగిఉన్న పేరుంది. స్థానిక ప్రజలు పాఠశాల నిర్వహణ పట్ల సంతృప్తితో ఉండగా చిన్నారి మృతి చెందడంపై తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.

రిపోర్టర్: కామోజీ వేణుగోపాల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా