నెల క్రితమే పెళ్లి.. కొనసాగిన వివాహేతర సంబంధం.. భర్త హతం-newlywed wife conspires with lover to kill husband ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  నెల క్రితమే పెళ్లి.. కొనసాగిన వివాహేతర సంబంధం.. భర్త హతం

నెల క్రితమే పెళ్లి.. కొనసాగిన వివాహేతర సంబంధం.. భర్త హతం

HT Telugu Desk HT Telugu

నెల క్రితమే పెళ్లయింది. పెళ్లిక ముందే వివాహేతర సంబంధం ఉంది. ఆ వివాహేతర సంబంధం ఇంకా కొనసాగుతోంది. ఇంతలో భర్త హత్యకు గురయ్యాడు.

ఐశ్వర్య దంపతులు

జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన ప్రయివేటు సర్వేయర్ తేజేశ్వర్ (32) హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో ఆయన భార్య, భార్య ప్రియుడికి భాగస్వామ్యం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

పోలీసుల విచారణలో తేలిన వివరాల ప్రకారం.. తేజేశ్వర్‌కు ఏపీలోని కర్నూలుకు చెందిన ఐశ్వర్యతో ఈ ఏడాది ఫిబ్రవరి 13న పెళ్లి నిశ్చయమైంది. అయితే, పెళ్లికి ఐదు రోజుల ముందే ఐశ్వర్య కనిపించకుండా పోయింది.

కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకు ఉద్యోగితో ఆమెకు సంబంధం ఉందని, అతని దగ్గరికే వెళ్లిపోయిందని అంతా అనుకున్నారు. కానీ, ఫిబ్రవరి 16న ఇంటికి తిరిగి వచ్చిన ఐశ్వర్య తేజేశ్వర్‌తో ఫోన్‌లో మాట్లాడింది. తాను ఎవరితోనూ ప్రేమలో లేనని, కట్నం ఇవ్వడానికి తన తల్లి పడుతున్న కష్టాన్ని చూసి తట్టుకోలేక స్నేహితురాలి ఇంటికి వెళ్లిపోయానని చెప్పింది. "నువ్వంటే నాకు చాలా ఇష్టం" అంటూ ఏడ్చింది. దీంతో ఐశ్వర్య మాటలు నమ్మిన తేజేశ్వర్ ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు.

కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోయినా..

తేజేశ్వర్ తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా వారిని ఒప్పించి మే 18న ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లయిన రెండో రోజు నుంచే వాళ్ళిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఐశ్వర్య భర్తను అస్సలు పట్టించుకోకుండా ఎప్పుడూ ఫోన్‌లోనే మాట్లాడుతుండేది. భర్త మందలించినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో జూన్ 17న తేజేశ్వర్ కనిపించకుండా పోవడంతో, అతని సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అనుమానాలు, విస్తుపోయే నిజాలు

గాలింపు చర్యల్లో భాగంగా ఏపీలోని పాణ్యం పోలీసులకు తేజేశ్వర్ మృతదేహం దొరికింది. తేజేశ్వర్ కుటుంబసభ్యులు ఐశ్వర్యపై అనుమానం వ్యక్తం చేయడంతో... ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతను పోలీసులు విచారించారు. అప్పుడు కొన్ని విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.

ఐశ్వర్య తల్లి సుజాత కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకులో స్వీపర్‌గా పని చేస్తుంది. అదే బ్యాంకులో పనిచేసే ఓ ఉద్యోగితో ఆమెకు వివాహేతర సంబంధం ఉందని తెలిసింది. ఆ ఉద్యోగి క్రమంగా ఐశ్వర్యతో కూడా సంబంధం పెట్టుకున్నాడు. తేజేశ్వర్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత ఐశ్వర్య ఆ బ్యాంకు ఉద్యోగితో ఏకంగా 2,000 సార్లు ఫోన్ మాట్లాడినట్లు పోలీసులు కాల్ డేటాలో గుర్తించారు. తమ సంబంధానికి అడ్డుగా ఉన్న తేజేశ్వర్‌ను అడ్డు తొలగిస్తే అతని ఆస్తి తమ సొంతం అవుతుందని భావించి హత్యకు పథకం వేసినట్లు సమాచారం.

హత్యకు పక్కా ప్లాన్..

తేజేశ్వర్‌ను హత్య చేయించడానికి ఆ బ్యాంకు ఉద్యోగి కొందరికి సుపారీ ఇచ్చాడని పోలీసులు అనుమానిస్తున్నారు. తన డ్రైవర్‌ను కూడా వారితో పంపినట్లు తెలిసింది. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం... జూన్ 17న కొంతమంది వ్యక్తులు తేజేశ్వర్‌ను కలిశారు. తాము 10 ఎకరాల పొలం కొంటున్నామని, దాన్ని సర్వే చేయాలని చెప్పి గద్వాలలో కారు ఎక్కించుకుని తీసుకెళ్లారు. కారులోనే తేజేశ్వర్‌పై కత్తులతో దాడి చేసి, గొంతు కోసి చంపేశారు. తర్వాత మృతదేహాన్ని పాణ్యం సమీపంలోని సుగాలిమెట్టు వద్ద పడేశారు.

ప్రస్తుతం ఆ బ్యాంకు ఉద్యోగి పరారీలో ఉండగా... ఐశ్వర్య, సుజాతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.