New Railway line: భద్రాద్రిలో ఐదేళ్లలో రైలు కూత.. మరింత సులువుగా రవాణా-new railway line from malkangiri to pandurangapuram via bhadrachalam ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  New Railway Line: భద్రాద్రిలో ఐదేళ్లలో రైలు కూత.. మరింత సులువుగా రవాణా

New Railway line: భద్రాద్రిలో ఐదేళ్లలో రైలు కూత.. మరింత సులువుగా రవాణా

Basani Shiva Kumar HT Telugu
Aug 17, 2024 12:53 PM IST

New Railway line: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాద్రిలో త్వరలోనే రైలు కూత వినిపించే ఛాన్స్ ఉంది. మల్కన్‌గిరి నుంచి భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు కొత్త రైలుమార్గం నిర్మించాలని రైల్వేశాఖ నిర్ణయించింది.

భద్రాద్రిలో ఐదేళ్లలో రైలు కూత
భద్రాద్రిలో ఐదేళ్లలో రైలు కూత (HT)

రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు రైలుమార్గాన్ని నిర్మించాలని సంకల్పించింది. ఈ రైలుమార్గాన్ని 2029-30 వరకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మొత్తం మార్గంలో ఒక్క లెవల్‌ క్రాసింగ్‌ కూడా లేకుండా నిర్మించేలా ప్లాన్ చేశారు. దాదాపు 200 కిలోమీటర్ల వరకు రైల్వేట్రాక్‌ నిర్మించనున్నారు. 200 కిలోమీటర్లు ఉన్న ఈ మార్గంలో.. 300 వరకు వంతెనలను నిర్మించనున్నారు. 3 భారీ వంతెనలు, 34 పెద్ద వంతెనలు, 254 చిన్న వంతెనలు, 41 ఆర్వోబీలు, 76 ఆర్‌యూబీలు ఈ రైల్వే లైన్‌లో నిర్మాణం కానున్నాయి.

ఈ లైన్ ఎందుకంటే..

ఈ కొత్త రైలుమార్గం నిర్మించే ఏరియాలో బాక్సైట్, అల్యూమినియం, ఐరన్‌ ఓర్, లైమ్‌స్టోన్, బొగ్గు, గ్రానైట్ ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. ఈ ఖనిజాలను రవాణా చేసేందుకు కొత్త రైల్వే మార్గం ఉపయోగపడనుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా సింగరేణి కాలరీస్‌ నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లకు అనుసంధానం పెరుగుతుందని వివరిస్తున్నారు. దేశంలో ఖనిజ సంపదలో.. 56 శాతం ఒడిశాలోనే ఉంది. దీని రవాణాకు ఈ కొత్త లైన్ ఉతమివ్వనుంది.

దేశవ్యాప్త రవాణాకు వీలుగా..

ఖనిజ సంపద దేశవ్యాప్త రవాణాకు వీలుగా.. భద్రాచలం పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాండురంగాపురం వరకు ఈ మార్గాన్ని పొడిగించారు. పాండురంగాపురం. ఈ లైన్‌ కాజీపేట- విజయవాడ ప్రధాన రైలు మార్గానికి బ్రాంచి లైన్‌‌గా ఉంది. కొత్త లైన్ పూర్తయితే.. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోని ఖనిజ సంపదను భద్రాచలం, పాండురంగాపురం నుంచి కాజీపేట మీదుగా ఉత్తరాది రాష్ట్రాలకు తరలించవచ్చు. విజయవాడ మీదుగా దక్షిణాది రాష్ట్రాలకు రవాణా చేయవచ్చు. అందుకే ఈ లైన్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.