New Osmania Hospital : గోషామహల్‌లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి - 32 ఎకరాల్లో నిర్మాణం-new osmania hospital to be constructed in goshamahal hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  New Osmania Hospital : గోషామహల్‌లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి - 32 ఎకరాల్లో నిర్మాణం

New Osmania Hospital : గోషామహల్‌లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి - 32 ఎకరాల్లో నిర్మాణం

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 28, 2024 09:40 AM IST

ఉస్మానియా ఆసుపత్రిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలను జారీ చేశారు. గోషామహల్‌లో కొత్త భవనం ఏర్పాటు చేయాలన్నారు. 32 ఎకరాల్లో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మాణం చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ఇప్పుడున్న ఉస్మానియా ఆస్పత్రి చారిత్రక కట్టడాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు.

ఉస్మానియా హాస్పిటల్ కు కొత్త భవనం
ఉస్మానియా హాస్పిటల్ కు కొత్త భవనం

హైదరాబాద్​ లోని గోషామహల్‌లో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కొత్త భవనాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకోసం గోషా మహల్‌ పోలీస్ స్టేడియం, పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ కలిపి దాదాపు 32 ఎకరాల స్థలాన్ని వెంటనే వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేయాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా ఎంచుకున్న స్పీడ్‌ (స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫీషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ) ప్రణాళికలో ఉన్న వివిధ అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి మంగళవారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో వైద్యారోగ్య శాఖ మంత్రి ఇతర అధికారులు పాల్గొన్నారు. స్పీడ్ జాబితాలో ఉన్న 19 పనుల్లో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణం, 15 కొత్త నర్సింగ్ కాలేజీలు, 28 కొత్త పారా మెడికల్ కాలేజీలు, జిల్లాల్లో సమాఖ్య భవనాల నిర్మాణాలకు సంబంధించిన ప్రణాళికలను ముఖ్యమంత్రి చర్చించారు.

డిజైన్లు రూపొందించండి - సీఎం రేవంత్ రెడ్డి

రాబోయే 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ఆసుపత్రి నిర్మాణానికి అనుభజ్ఞులైన ఆర్కిటెక్టులతో డిజైన్లు రూపొందించాలని సీఎం ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అక్కడికి చేరుకునే కనెక్టింగ్ రోడ్లను అభివృద్ధి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఆసుపత్రి చుట్టూ నలు దిశలా రోడ్డు ఉండేలా డిజైన్ చేయాలని చెప్పారు.

ఆసుపత్రికి అవసరమైన అన్ని విభాగాలతో పాటు అకడమిక్ బ్లాక్, నర్సింగ్ ఉద్యోగులకు హాస్టళ్లు కూడా నిర్మించేలా ప్రణాళికలు ఉండాలని చెప్పారు. కార్పొరేట్ తరహాలో వైద్య విభాగాలు, సేవలన్నీ అక్కడే అందుబాటులో ఉండాలని సూచించారు.

ఇప్పుడున్న ఉస్మానియా హాస్పిటల్ భవనాలను చారిత్రక కట్టడాలుగా పరిరక్షించే బాధ్యతను చేపడుతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మూసీ రివర్ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో భాగంగా అక్కడున్న భవనాలను పర్యాటకులను ఆకట్టుకునే చారిత్రక భవనాలుగా తీర్చిదిద్దుతామని అన్నారు.

గోషామహల్ స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖకు అప్పగించినందుకు పోలీసు విభాగానికి ప్రత్నామ్నాయ స్థలం కేటాయించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పేట్లబుర్జులో ఉన్న పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్, సిటీ పోలీస్ అకాడమీ, చుట్టూ ఉన్న స్థలాన్ని క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.