రూ.5కే హైదరాబాద్‌లో బ్రేక్‌ఫాస్ట్.. ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభం!-new indiramma canteens offering breakfast at 5 rupees inaugurated in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  రూ.5కే హైదరాబాద్‌లో బ్రేక్‌ఫాస్ట్.. ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభం!

రూ.5కే హైదరాబాద్‌లో బ్రేక్‌ఫాస్ట్.. ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభం!

Anand Sai HT Telugu

హైదరాబాద్‌లో అతితక్కువ ధరకే అల్పాహారం అందించే క్యాంటిన్లు ప్రారంభమయ్యాయి. మంచి క్వాలిటీతో బ్రేక్‌ఫాస్ట్‌లు అందించనున్నట్టుగా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.

ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభం

హైదరాబాద్‌లో రూ.5కే అల్పాహారం అందించే ఇందిరమ్మ క్యాంటీన్లను సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) విడుదల చేసిన ఒక ప్రకటనలో, అధిక సబ్సిడీ ధరలకు పోషకమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించడం, వేలాది మంది నిరుపేద పౌరులపై ఆర్థిక భారాన్ని తగ్గించడం ఈ క్యాంటిన్ల లక్ష్యం అని తెలిపింది.

ఈ క్యాంటీన్లలో ప్రతి అల్పాహారం, భోజనం ధర రూ.5గా మాత్రమే ఉంటుంది. అల్పాహారానికి రూ.14 రూపాయలు ప్రభుత్వమే భరిస్తుంది. లబ్ధిదారులు నెలకు రూ.3,000 వరకు ఆదా చేసుకోవచ్చని జీహెచ్‌ఎంసీ ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్‌లోని మోతినగర్, ఖైరాతాబాద్ మింట్ కంపౌండ్ దగ్గరలో క్యాంటీన్లను ప్రారంభించారు.

'నేటి నుండి, రూ. 5 కి అల్పాహారం కూడా అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వం ఆర్థిక భారాన్ని మోస్తున్నప్పటికీ, పేదలకు నామమాత్రపు ధరలకు నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి మేం కట్టుబడి ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో అందరికీ తక్కువ ధరకే భోజనం అందించేలా ఇందిరమ్మ క్యాంటీన్లను ప్రారంభించాం.' అని మంత్రి ప్రభాకర్ అన్నారు.

రూ.5కే బ్రేక్ ఫాస్ట్ స్కీమ్.. మెుత్తం 150 కేంద్రాలకుగానూ 60 కేంద్రాల్లో ప్రారంభమైంది. దశలవారీగా 150 కేంద్రాల్లో ప్రారంభిస్తారు. మెనూలో ఇడ్లీ, ఉప్మా, మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ ఉప్మా, పూరితోపాటుగా పొంగల్ అందిస్తారు.

ఎక్స్‌లో GHMC పోస్ట్‌లో హరే కృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ సహకారంతో, క్యాంటీన్లు రూ.5కే పోషకమైన అల్పాహారం, మధ్యాహ్నం వేడి భోజనాన్ని అందిస్తున్నాయని తెలిపింది. 'రోజువారీ వేతన జీవులు, విద్యార్థులు, డ్రైవర్లు, వలస కార్మికులు, తక్కువ ధరకు ఆహారంపై ఆధారపడే నిరుపేద పౌరులకు ఉపశమనం దొరుకుతుంది.' అని పేర్కొన్నారు.

అన్నపూర్ణ రూ.5 భోజన కేంద్రాలను ఇటీవల ఇందిరమ్మ క్యాంటీన్లుగా పేరు మార్చారు. ప్రస్తుతం నగరం అంతటా 150 క్యాంటీన్లు పనిచేస్తున్నాయి, రోజుకు 30,000 మందికి పైగా లబ్ధిదారులకు సేవలు అందిస్తున్నాయి. ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు 12.3 కోట్లకు పైగా మందికి భోజనం అందించారు. అల్పాహారం ఏర్పాటు చేయడానికి ఏడాదికి రూ.10 కోట్లు ఖర్చు అవుతుందని, క్యాంటీన్లకు ఆదివారం సెలవు ఉండనుందని అధికారులు చెబుతున్నారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.