Narsapur Police : 7 ఏళ్ల క్రితం మరణించిన వ్యక్తిపై నర్సాపూర్ పోలీసులు కేసు నమోదు-narsapur police policed case on elderly man who died 7 yeasrs bank ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Narsapur Police : 7 ఏళ్ల క్రితం మరణించిన వ్యక్తిపై నర్సాపూర్ పోలీసులు కేసు నమోదు

Narsapur Police : 7 ఏళ్ల క్రితం మరణించిన వ్యక్తిపై నర్సాపూర్ పోలీసులు కేసు నమోదు

HT Telugu Desk HT Telugu
Nov 19, 2024 10:08 PM IST

Narsapur Police : భూవిదాదంలో ఎలాంటి విచారణ చేపట్టకుండా ఏడేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తిపై పోలీసులు నమోదు చేశారు. నర్సాపూర్ పోలీసులు ఓ వర్గానికి కొమ్ముకాస్తూ నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని మరో వర్గం విమర్శిస్తుంది.

 7 ఏళ్ల క్రితం మరణించిన వ్యక్తిపై నర్సాపూర్ పోలీసులు కేసు నమోదు
7 ఏళ్ల క్రితం మరణించిన వ్యక్తిపై నర్సాపూర్ పోలీసులు కేసు నమోదు

భూవివాదంలో ఒక వర్గం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎలాంటి విచారణ చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన నర్సాపూర్ పోలీసులు ఏడు సంవత్సరాల క్రితం చనిపోయిన మరో వర్గానికి చెందిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఇది ఒక వర్గానికి పోలీసులు కొమ్ముకాయడమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన మెదక్ జిల్లాలోని నర్సాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

ఇరువర్గాల మధ్య గత కొంతకాలంగా భూ వివాదం

నర్సాపూర్ మండలం నారాయణపూర్ శివారులోని లచ్చిరాంతండాకు చెందిన రెండు వర్గాలకు మధ్య కొన్ని సంవత్సరాలుగా భూవివాదం నడుస్తుంది. ఈ క్రమంలో రెండు నెలల క్రితం మరల ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో తండాకు చెందిన దేవీసింగ్, విఠల్, ఆంజనేయులు, సూర్య అనే వ్యక్తులపై మరో వర్గం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదుతో పోలీసులు నలుగురిపై కేసు

విఠల్ ఏడు సంవత్సరాల క్రితమే మృతి చెందాడు. పోలీసులు ఎలాంటి విచారణ చేపట్టకుండా మృతి చెందిన వ్యక్తిని A4 ముద్దయిగా చేర్చారు. విచారణలో భాగంగా, పోలీసులు ఈ రోజు గ్రామానికి రాగ చనిపోయిన విట్టల్ పైన కూడా కేసు నమోదైనట్టు తన కుటుంబసభ్యులకు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు మృతుడి ఫోటో, డెత్ సర్టిఫికెట్ చూపిస్తూ చనిపోయిన వ్యక్తిపై ఎలా కేసు నమోదు చేస్తారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ భూవివాదంలో పోలీసులు ఒక వర్గం వారికీ అనుకూలంగా వ్యవహరిస్తూ, తమపై కేసులు నమోదు చేసి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎస్సై పైన చర్యలు తీసుకోవాలి

ఈ కేసు విషయంలో మృతుడి కుటుంబసభ్యులు నర్సాపూర్ ఎస్ఐ ని వివరణ కోరగా భూవివాదంలో ఫిర్యాదీదారులు పది మంది వ్యక్తులపై ఫిర్యాదు చేశారు. అందులో విఠల్ పేరు కూడా ఉండడంతో FIR నమోదు చేశామని తెలిపాడు. అనంతరం విచారణలో భాగంగా వారి ఇంటికి వెళ్ళినప్పుడు అతని ఇంట్లో లేడని కుటుంబసభ్యులు తెలిపారన్నారు. ఎస్సై లింగం పూర్తిగా ఒక వర్గానకి కొమ్ముకాస్తున్నాడని, తాను దగ్గర ఉంది మరి వివాదంలో ఉన్న భూమిలో, తమ ప్రత్యర్థి వర్గం వారితో కట్టడాలు కట్టించాడని. ఫోటోలు తీయడానికి వెళ్లిన తమ కుటుంబానికి సంబంధించిన మైనర్ బాలున్ని కూడా పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి బెదిరించాడని వారు ఆరోపించారు. ఇట్టి విషయం పైన, తగిన విచారణ చేసి ఎస్సై లింగం పైన చర్యలు తీసుకోవాలని వారు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డిని అభ్యర్ధించారు.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో మనస్థాపం చెందిన ఓ రైతు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కల్బేమల్ గ్రామానికి చెందిన ఒగ్గు కల్లప్ప (59) తనకున్న మూడెకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన పొలంలో ఉన్న బోర్లు సరిగ్గా పోయకపోవడంతో కల్లప్ప గతేడాది అప్పు తెచ్చి ఒక బోరు వేయించాడు. అది నీరు పడకపోవడంతో, మరో బోరు వేయించాడు. బోరు వేయడం కోసం తెచ్చిన అప్పుకు వడ్డీలు కట్టలేకపోతున్నాడు. పొలంలో వేసిన పంటలు కూడా సరిగ్గా పండలేదు.

దీంతో అప్పులు ఎలా తీర్చాలో అర్ధంకాక మనస్తాపంతో పొలానికి తెచ్చిన గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ విషయాన్నీ గమనించిన కుటుంబసభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం బీదర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కల్లప్ప తుదిశ్వాస విడిచాడు. మృతుడి కుమారుడు మల్లేష్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Whats_app_banner

సంబంధిత కథనం