BRS Narsapur Ticket :ఈసారి కూడా పోటీలో ఉంటా, మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తా - మదన్ రెడ్డి
Narsapur Madan Reddy: నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మరోసారి కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా తానే బీఆర్ఎస్ తరపున అభ్యర్థిగా ఉంటానని స్పష్టం చేశారు.
Narsapur MLA Madan Reddy: వచ్చే ఎన్నికల్లో కూడా పోటీలో ఉంటానని, మూడోసారి కూడా ఎమ్మెల్యేగా గెలుస్తానని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. పార్టీ కోసం నియోజకవర్గంలో ఎంతో కష్టపడ్డామని,వేరేవాళ్లకు అవకాశం ఇచ్చే ప్రశ్న లేదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా 10 సంవత్సరాలు ఎమ్మెల్యే గా పనిచేశానని చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష పార్టీ నాయకులకు కూడా హాని చేయకుండా నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకున్నానని అన్నారు.
ట్రెండింగ్ వార్తలు
గురువారం నర్సాపూర్లో బిసీ బంధు స్కీమ్ గురించి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా టికెట్ అంశంతో పాటు కేటీఆర్ ను కలవటంపై కూడా స్పందించారు. కేటీ రామరావు ని కలిశానని, తాను చాలా మంచిగా స్పందించారని చెప్పారు. అధినాయకత్వం తప్పకుండా తనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని దీమా వ్యక్తం చేశారు. తన అభ్యర్థిత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇద్దరు కలిసి మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
శనివారం రోజున జరిగే బీసీబందు కార్యక్రమం విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మదన్ రెడ్డి పిలుపునిచ్చారు.ఈ నెల 16న నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లో ఉన్న కుల వృత్తిదారులకు బీసీ బందు పథకం కింద మంజూరైన లక్ష రూపాయల చెక్కులను పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ఈ పంపిణీ కార్యక్రమం నర్సాపూర్ పట్టణంలోని సాయి కృష్ణ గార్డెన్లో నిర్వహిస్తున్నందున నాయకులు కార్యకర్తలు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని నియోజక వర్గాల్లో అధికార పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించడంతో వారంతా ప్రచారం చేసు కోవడంలో మునిగి తేలుతున్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి అభ్యర్థితత్వాన్ని ప్రకటించకపోవడంతో అనుచరులు ఆందోళనకు గురవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
మాజీ మంత్రి , కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ లో జాయిన్ అయిన సునీత లక్ష్మారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందనే ఊహాగానాల నేపధ్యంలో, పార్టీలో గందరగోళం నెలకొని ఉంది. మదన్ రెడ్డి చేతిలో వరుసగా రెండు సార్లు 2014, 2018 ఎన్నికల్లో ఓడిపోయిన సునీత లక్ష్మా రెడ్డికి 2023 లో సీట్ ఇస్తానని హామీ ఇవ్వటం తోనే పార్టీ లో జాయిన్ అయ్యానని చెప్తున్నారు. మదన్ రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టికెట్ తనకే ఇవ్వాలని పట్టుపడుతున్నారు. నియోజకవర్గంలోని పార్టీ నాయకులూ, క్యాడర్ కూడా మదన్ రెడ్డికి టికెట్ ఇస్తే మేము తప్పకుండా గెలిపించుకుంటామని, సునీత లక్ష్మా రెడ్డికి టికెట్ ఇస్తే.. ఆమెకు మద్దతు ఇవ్వబోమని చెబుతున్నారు. రాష్ట్రం మొత్తం టిక్కెట్లు ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్ నర్సాపూర్ తో పాటు నాలుగు నియోజకవర్గాల అభ్యర్థులు ఎవరనేది ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టారు. త్వరలోనే నర్సాపూర్ టికెట్ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.