Nampally Numaish : నాంపల్లి నుమాయిష్ లో షాకింగ్ ఘటన- ప్రాణాలు అరచేతిలో, 25 నిమిషాలు తలకిందులుగా!
Nampally Numaish : నాంపల్లి నుమాయిష్ లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఎగ్జిబిషన్ లో అమ్యూజ్మెంట్ రైడ్ బ్యాటరీ సమస్య కారణంగా 25 నిమిషాల పాటు నిలిచిపోయింది. దీంతో పర్యాటకులు 25 నిమిషాల పాటు తలకిందులగా ఉండిపోయారు.
Nampally Numaish : హైదరాబాద్ నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో గురువారం సాయంత్రం ఓ అమ్యూజ్‌మెంట్ రైడ్‌లో టూరిస్టులు తలకిందులుగా ఇరుక్కుపోయారు. 25 నిమిషాలకు పైగా తలక్రిందులుగా నిలిచిపోవడంతో ప్రజలు భయందోళనకు గురయ్యారు. బ్యాటరీ సమస్య కారణంగా ఇలా జరిగిందని నిర్వాహకులు తెలిపారు.
జెయింట్ వీల్ తరహాలో ఉండే అమ్యూజ్మెంట్ రైడ్ పైకి వెళ్లిన తర్వాత బ్యాటరీ సమస్యలో ఆగిపోయింది. దీంతో ఇందులో ఉన్నవారంతా సుమారు 25 నిమిషాల పాటు తలకిందులుగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నారు. నిర్వాహకులు సమస్యను పరిష్కరించడంతో ప్రజలు కిందకు దిగి వచ్చారు. దీంతో తృటిలో ప్రమాదం తప్పిందని ప్రజలు, నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటనపై ఎగ్జిబిషన్ సొసైటీకి చెందిన ఒక అధికారి స్పందిస్తూ... బ్యాటరీ సమస్యల కారణంగా ట్రయల్ రన్ సమయంలో అమ్యూజ్ మెంట్ ఇలా తలక్రిందులుగా నిలిచిపోయిందన్నారు. సాంకేతిక నిపుణులు త్వరగా బ్యాటరీని భర్తీ చేసి రైడ్ ను పునరుద్ధరించారన్నారు. అయితే, ఈ సంఘటనకు సంబంధించిన ఫుటేజీలో రైడ్ లో ప్రయాణికులు కనిపిస్తున్నారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో...కొద్దిసేపటి తర్వాత నుమాయిష్‌లో అమ్యూజ్ మెంట్ రైడ్ పునఃప్రారంభించారు.
నుమాయిష్ టిక్కెట్ ధర రూ. 40 నుంచి రూ. 50కి పెంచనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. చివరిసారిగా జనవరి 2023లో నుమాయిష్ టిక్కెట్ల ధరలు పెంచారు. గత ఏడాది నుమాయిష్ వారాంతపు రోజులలో సాయంత్రం 4:00 నుంచి రాత్రి 10:30 వరకు, వీకెండ్, సెలవు రోజుల్లో సాయంత్రం 4:00 నుంచి రాత్రి 11:00 వరకు తెరిచి ఉంచేవారు. అవసరమైతే ఈ సమయాన్ని సర్దుబాటు చేసే అధికారం మేనేజింగ్ కమిటీకి ఉంటుంది. నుమాయిష్ సందర్శకుల కోసం తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో నుమాయిష్ మొబైల్ యాప్‌ను రూపొందించారు. ఈ యాప్ ద్వారా స్టాల్స్ అన్వేషించడానికి, షాపింగ్ చేయడానికి, ఫన్ జోన్‌లను యాక్సెస్ చేయడానికి, హైదరాబాద్‌లోని వివిధ ఈవెంట్‌ల గురించి అప్‌డేట్‌గా ఉండవచ్చు.
సందర్శకుల కోసం నావిగేషన్‌ను సులభతరం చేయడంతో పాటు, పిల్లలను ట్రాక్ చేయడంలో ఈ యాప్ సహాయపడుతుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ జనవరి 9న 'లేడీస్ డే'ని నిర్వహించింది. జనవరి 31న 'చిల్డ్రన్ స్పెషల్' ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది ఎగ్జిబిషన్‌కు స్టాల్స్ కోసం దాదాపు 2,500 దరఖాస్తులు వచ్చాయని నిర్వహకులు తెలిపారు. సుమారు 2,200 స్టాల్స్, రెడీమేడ్ దుస్తులు, శాలువాలు, హస్తకళలు, పరుపుల...వ్యాపారులకు అనుమతించినట్లు సమాచారం. షాపింగ్‌తో పాటు, ఎగ్జిబిషన్, వ్యాపారం, వినోదంతో లక్షలాది మంది సందర్శకులను నాంపల్లి నుమాయిష్ ఆకర్షిస్తుంది.
సంబంధిత కథనం