Nampally Court Judge Dies : భార్యతో మనస్పర్థలు, నాంపల్లి ఎక్సైజ్ కోర్టు జడ్జి ఆత్మహత్య
Nampally Court Judge Dies : ఎన్నో క్లిష్టమైన కేసులకు తీర్పు చెప్పిన న్యాయమూర్తి... తన జీవిత సమస్యను పరిష్కరించుకోవడంలో విఫలమై తీవ్ర తీర్పు ఇచ్చుకున్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలతో నాంపల్లి ఎక్సైజ్ కోర్టు జడ్జి ఆత్మహత్య చేసుకున్నారు.
Nampally Court Judge Dies : ఆ యువకుడు అతి పిన్న వయసులో న్యాయమూర్తి స్థాయికి చేరుకున్నారు. తన తీర్పులతో ఎన్నో సమస్యలను పరిష్కరించారు. కానీ తన జీవితానికి మాత్రం తప్పుడు తీర్పు ఇచ్చుకున్నారు. కుటుంబ సమస్యలతో తనకు తాను ఉరి శిక్ష విధించుకున్నారు. హైదరాబాద్ లోని అంబర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో న్యాయమూర్తి ఆత్మహత్య(Nampally Court Judge Suicide) చేసుకున్నారు. నాంపల్లి కోర్టులో జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్(ఎక్సైజ్) విధులు నిర్వహిస్తున్న ఎ.మణికంఠ(36) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. మణికంఠ తన కుటుంబంతో కలిసి బాగ్ అంబర్ పేట పోచమ్మ శ్రీనిధి రెసిడెన్సీలో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు.
భార్యాభర్తల మధ్య మనస్పర్థలు
అందె మణికంఠకు ఏడేండ్ల క్రితం మహబూబ్ నగర్‌కు చెందిన లావణ్యతో వివాహం జరిగింది. వీరికి ఐదేండ్ల కొడుకు ఉన్నాడు. నాలుగేళ్ల పాటు ఆలేరు కోర్టులో జూనియర్ జడ్జిగా మణికంఠ(Nampally Court Judge Manikanta) పనిచేశారు. మూడేళ్లుగా నాంపల్లి ఎక్సైజ్ స్పెషల్ కోర్టు జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. శ్రీనిధి రెసిడెన్సీలో ఫ్లాట్ తీసుకున్న మణికంఠ భార్య, కుమారుడితో నివాసం ఉంటున్నారు. అయితే గతకొంత కాలంగా భార్యాభర్తల (Family Issues)మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో మణికంఠ భార్య కుమారుడిని తీసుకుని తన పుట్టింటికి వెళ్లింది. మణికంఠ తల్లి అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆదివారం మణికంఠ లావణ్యకు ఫోన్ చేశారు. వీరి మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. అయితే తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి మణికంఠ ఫోన్ పెట్టేశారు. అనంతరం తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నారు. మణికంఠ తండ్రి శ్రీశైలం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ న్యాయమూర్తుల సంఘం నివాళులు
నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టు ఎక్సైజ్ మేజస్ట్రేట్ మణికంఠ(Nampally Court Judge Dies)కు తెలంగాణ న్యాయమూర్తుల సంఘం, పలువురు న్యాయమూర్తులు నివాళులర్పించారు. 2016లో అతి పిన్న వయసులో న్యాయమూర్తిగా ఎంపికైన మణికంఠ గతంలో ఆలేరు, ప్రస్తుతం హైదరాబాద్ న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. సౌమ్యుడిగా, వివాద రహితుడిగా పేరు పొందిన మణికంఠ సహచర న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయ శాఖ ఉద్యోగుల మన్ననలను పొందారు. మంచి భవిష్యత్తు కలిగిన యువ న్యాయమూర్తి మణికంఠ మానసిక వత్తిడికి గురై నిన్న ఆత్మహత్యకు పాల్పడటం చాలా బాధాకరమని తెలంగాణ న్యాయమూర్తుల సంఘం ప్రతినిధులు నివాళులర్పించారు. సోమవారం అంబర్ పేటలోని మణికంఠ ఇంటికి వెళ్లిన పలువురు న్యాయమూర్తులు, న్యాయమూర్తి సంఘం ప్రతినిధులు మణికంఠ చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర న్యాయమూర్తుల సంఘం ప్రతినిధులు మణికంఠ తల్లిదండ్రులను పరామర్శించి వారి కుటుంబానికి అండగా ఉంటుందని తెలియజేశారు.