Allu Arjun Remand : అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు
Allu Arjun Remand : అల్లు అర్జున్‌కు బిగ్ షాక్ తగిలింది. నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో బన్నీని జైలుకు తరలించనున్నారు. మరోవైపు మృతురాలి భర్త ఈ కేసులో ట్విస్ట్ ఇచ్చారు. అవసరం అయితే.. తాను ఈ కేసును విత్ డ్రా చేసుకుంటానని స్పష్టం చేశారు.
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో అరెస్టైన అల్లు అర్జున్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆయన్ను 14 రోజుల రిమాండ్‌కు తరలించాలని నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. బన్నీ రావడం వల్లే తొక్కిసలాట ఘటన జరిగిందని, అందుకే ఆయన్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు కోర్టుకు నివేదించారు. పోలీసుల వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి బన్నీకి రిమాండ్ విధించారు.
అంతకు ముందు అల్లు అర్జున్‌కు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నాంపల్లి కోర్టుకు తరలించారు. అక్కడ ప్రభుత్వ తరఫు న్యాయవాది జరిగిన విషయాన్ని వివరించారు. అల్లు అర్జున్ వల్లే ఓ మహిళ మృతిచెందారని కోర్టుకు వివరించారు. న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి.. 14 రోజులు రిమాండ్ విధించారు.
కేసు ఏంటీ..
పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంథ్య థియేటర్‌లో ప్రీమియర్ షో వేశారు. అక్కడికి అల్లు అర్జున్, అతని భార్య, పుష్ప 2 మూవీ టీమ్ వెళ్లారు. బన్నీ వస్తున్న విషయాన్ని తెలుసుకున్న అభిమానులు భారీ సంఖ్యలో సినిమా టాకీస్‌కు వెళ్లారు. అతన్ని చూసేందుకు ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఓ మహిళ మృతిచెందింది. ఆమె కుమారుడు ఆస్పత్రి పాలయ్యాడు.
అయితే.. అల్లు అర్జున్ వస్తున్న విషయాన్ని సంథ్య థియేటర్ యాజమాన్యం తమకు చెప్పలేదని, చెబితే.. బందోబస్తు ఏర్పాటు చేసేవాళ్లమని పోలీసులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే సంథ్య థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్, అతని భద్రతా సిబ్బందిపై రెండు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఇప్పటికే కొందరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ నేపథ్యంలోనే.. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో అల్లు అర్జున్‌ను అదుపులోకి తీసుకున్నారు. తొలుత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి, ఆ తర్వాత నాంపల్లి కోర్డుకు తీసుకెళ్లారు. అటు హైకోర్టులో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు క్వాష్ చేయాలని బన్నీ పిటిషన్ వేశారు. తొక్కిసలాట కేసులో ఏ11గా అల్లు అర్జున్ ఉన్నారు. ఇప్పటి వరకు ఏడుగురిని అరెస్ట్ చేశామని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు.
అల్లు అర్జున్‌కు బెయిల్ ఇవ్వొద్దని జీపీ వాదనలు వినిపించారు. ప్రీమియర్‌షోకు అనుమతి తీసుకోలేదని పోలీసులు స్పష్టం చేశారు. డిసెంబర్ 2న పోలీసులకు లేఖ రాశామని సంథ్య థియేటర్ తరఫు లాయర్ చెప్పారు. అకనాలెడ్జ్‌మెంట్ తీసుకున్నారా అని కోర్టు ప్రశ్నించింది. చిక్కడపల్లి ఏసీపీ సంతకం చేసిన కాపీని.. కోర్టుకు సమర్పించారు అల్లు అర్జున్ తరపు లాయర్. అల్లు అర్జున్‌పై ఉన్న ఆరోపణ ఏంటని హైకోర్టు ప్రశ్నించింది.