Nampally High Tension : నాంపల్లిలో హైటెన్షన్-తలలు పగిలేలా కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు
Nampally High Tension : నాంపల్లి బీజేపీ ఆఫీస్ వద్ద హైటెన్షన్ నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలతో దాడి చేసుకున్నారు. ప్రియాంక గాంధీపై బీజేపీ నేత వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ బీజేపీ ఆఫీసు ముట్టడికి వచ్చింది. దీంతో ఇరు పార్టీల నేతలు పరస్పరదాడికి పాల్పడ్డారు.
Nampally High Tension : నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. యూత్ కాంగ్రెస్ బీజేపీ ఆఫీసును ముట్టడికి ప్రయత్నించింది. కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీకి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో గొడవ మొదలైంది. దీంతో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. కర్రలతో కొట్టుకోవడంతో పాటు ఇరు పార్టీల కార్యకర్తలు రాళ్లు,కోడిగుడ్లు విసురుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్త తలకు గాయమైంది. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంక గాంధీపై దిల్లీకి చెందిన బీజేపీ నేత రమేష్ బిదూరీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దిల్లీ రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గల్లా మారుస్తామని బీజేపీ నేత రమేశ్ బిదూరీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నాంపల్లిలోని బీజేపీ ఆఫీసు ముట్టడికి ప్రయత్నించారు.
కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంపైకి రాళ్లు విసరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీజేపీ శ్రేణులు కర్రలతో కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు.
యూత్ కాంగ్రెస్ ముట్టడికి నిరసనగా బీజేపీ కార్యకర్తలు నాంపల్లిలోని గాంధీ భవన్ ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాంధీ భవన్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని నిలువరించి లాఠీ ఛార్జ్ చేశారు.
దాడిని ఖండించిన బండి సంజయ్
బీజేపీ ఆఫీసుపై దాడిని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించారు. ఈ దాడిని పిరికిపంద చర్యగా పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
"కాంగ్రెస్ గూండాలారా, బీజేపీ కార్యాలయంపై చేయి వేయడానికి మీకు ఎంత ధైర్యం! బీజేపీ కార్యకర్తలు తలచుకుంటే మీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పునాదులను కూల్చివేయగలము. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన పిరికిపంద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాము. మా కార్యాలయం మహిళలు, ఇతరులు అవిశ్రాంతంగా పనిచేసే పవిత్ర స్థలం. వాళ్లు గాయపడితే ఏమి చేయాలి? కాంగ్రెస్ రౌడీయిజానికి మేము భయపడం, దాడికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాను"- బండి సంజయ్
ప్రియాంక గాంధీపై వ్యాఖ్యలను ఖండించిన మంత్రి సీతక్క
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంక గాంధీపై బీజేపీ నేత రమేష్ బిదూరీ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రియాంకా గాంధీ మీద చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్నారు. రమేష్ బిదూరీ వ్యాఖ్యలు యావత్ మహిళా లోకానికే అవమానకరం అన్నారు.
రమేష్ బిదూరీ ఏమన్నారంటే?
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతలు మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇటీవల దిల్లీ బీజేపీ సీనియర్ నేత రమేష్ బిదూరీ వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో జరిగే దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ నేత, సీఎం అతిషిపై బీజేపీ తరపున బిదూరీ పోటీ చేస్తున్నారు. ఆయనను అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. అయితే, బిదూరీ ఇటీవల మాట్లాడుతూ ప్రియాంక గాంధీపై మాట జారారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిస్తే కల్కాజీ నియోజకవర్గంలోని రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గల్లా నున్నగా తయారు చేస్తానని అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఒకప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా హీరోయిన్ హేమమాలినిపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారని గుర్తుచేశార. లాలూ చేసింది తప్పయితే తాను చేసింది తప్పేనని చెప్పుకొచ్చారు.
సంబంధిత కథనం