Four Marriages: నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తిపై పీడీ యాక్ట్ పెట్టిన నల్గొండ పోలీసులు..
Four Marriages: ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటూ, నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న నిందితుడిపై నల్గొండ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. నిందితుడు తాజాగా మైనర్ బాలికను మోసం చేసి పెళ్లి చేసుకోవడంతో అరెస్ట్ చేసిన పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Four Marriages: ఒకరికి తెలియకుండా మరొకరిని నలుగురిని పెళ్లి చేసుకున్న వ్యక్తిపై నల్గొండ పోలీసులు పీడీ యాక్ట్ కింద కేసు నమోదుచేసి మంగళవారం చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ప్రేమ పేరుతో పదహారేళ్ల బాలికను బలవంతంగా నాలుగో పెళ్లి చేసుకుని ఆమెను వేధిస్తుండటంతో కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో నిందితుడి గత చరిత్రను వెలికి తీశారు. నల్గొండ వన్‌టౌన్ సీఐ గోపి తెలిపిన వివరాల ప్రకారం... నల్గొండ పట్టణంలోని పాతబస్తీ లైన్‌వాడ ప్రాంతానికి చెందిన గారాల శంకర్, పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ఫ్లవర్ డెకేషన్ వ్యాపారం చేస్తున్నాడు. మొదటి భార్య చనిపోయాక మరో మహిళను వివాహం చేసుకున్నాడు.
అతను పెట్టే బాధలు భరించలేక ఆమె దూరంగా ఉంటోంది. కొద్దిరోజుల తర్వాత నచ్చజెప్పి ఇంటికి తీసుకొచ్చాడు. తర్వాత ఆమెకు తెలియకుండా నల్గొండ జిల్లా నకిరేకల్ ప్రాంతానికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని మభ్యపెట్టి ముగ్గులోకి దించాడు. గతంలో జరిగిన రెండు వివాహాలను దాచి ఆమెను పెళ్లి చేసుకున్నాడు.
కొద్ది రోజులకే తాను మోసపోయిన విషయాన్ని గ్రహించిన ఉపాధ్యాయురాలు భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టి అతడికి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో నల్గొండ పట్టణానికి చెందిన పదహారేళ్ల బాలికపై కన్నేసిన శంకర్ ఆమెకు మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. గతంలో జరిగిన పెళ్లిళ్ల విషయాన్ని దాచిపెట్టి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఓ అద్దె ఇల్లు తీసుకుని కాపురం పెట్టాడు.
వారం రోజులుగా బాలికను ఇంట్లో బంధించి లైంగికంగా వేధిస్తున్నాడు. అతను పెట్టే బాధలు భరించలేని బాధితురాలు తన స్నేహితురాలి ద్వారా బయటపడి పోలీసులకు ఫిర్యాదుచేశారు. మైనర్‌ను వివాహం చేసుకుని వేధిస్తున్నట్లు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు.
నిందితుడిని అరెస్టు చేసి విచారించడంతో ఈ వివాహాల విషయం వెలుగుచూసింది. నాలుగు రోజుల క్రితం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. శంకర్ మోసాల వివరాలు జిల్లా కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డికి పోలీసులు వివరించడంతో, నిందితుడిపై మంగళవారం పీడీ యాక్టు నమోదుకు ఆదేశించారు. శంకర్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు.