Nalgonda News : భలే దొంగలు..! భక్తుల వేషంలో రెక్కీ, రాత్రివేళ ఆలయాల్లో చోరీలు - చివరికి ఇలా దొరికిపోయారు..!
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాల్లో చోరీకి పాల్పడిన దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి బంగారం, వెండి ఆభరణాలతో పాటు హుండీలను కూడా స్వాధీనం చేశారు. 14 దేవాలయాల్లో వీరు దొంగతనాలకు పాల్పడ్డినట్లు పోలీసులు వెల్లడించారు.
ఆ ఇద్దరు దొంగల తెలివే తెలివి.. ఉదయం పూట భక్తుల వేషం. రాత్రిపూట దేవాలయాల్లో చోరీలు. గడిచిన కొద్ది నెలలుగా ఉమ్మడి నల్గొండ జిల్లా పోలీసులకు పనిపెట్టిన ఆ ఇద్దరు గ్రామీణ ప్రాంతాల్లోని ఆలయాలను టార్గెట్ చేసుకున్నారు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కి తమ ఘన కార్యాల గురించి పూసగుచ్చినట్టు చెప్పారు. నల్గొండ డీఎస్పీ కె.శివరాం రెడ్డి వీరి చేతివాటం గురించి వివరించారు.
పగటిపూట భక్తుల వేషం
పగటి పూట భక్తుల వేషం గట్టి టార్గెట్ పెట్టుకున్న దేవాలయానికి వెళ్లి రెక్నీ చేయడం, రాత్రి పూట హుండీలను కొల్లగొట్టం పనిగా పెట్టుకున్న కత్తుల యాదయ్య, కత్తుల శివ అనే దొంగలు 14 దేవాలయాల్లో చోరీలు చేశాక పట్టుబడ్డారు. నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 3, కనగల్ మండలంలో3, నార్కెట్ పల్లి మండలంలో 2 దేవాలయాల్లో హుండీలను బద్దలు కొట్టారు. ఇంకా.. మునుగోడు, తిప్పర్తి, వేములపల్లి, చండూర్, కట్టంగూర్, హాలియా పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ ఒక్కో దేవాలయంలో చోరీలు చేశారు.
ఇలా నల్గొండ జిల్లాలో మొత్తంగా 14 దేవాలయాల్లో వీరు దొంగతనాలకు పాల్పడ్డారు. వీరి చోరకళకు దేవాలయాల్లో బంగారు వస్తువులు, వెండి వస్తువులు దేవుడి విగ్రాల కన్నులు, మీసాలు, మెట్టెలు, నగలు, నగదు మాయం అయ్యాయి.
ఇనుప హుండీలనూ ఎత్తుకొచ్చారు!
హుండీల తాళాలు పగల గొట్టలేని చోట ఏకంగా రాత్రికి రాత్రి ఇపుప హుండీలను కూడా ఎత్తుకొచ్చారు. అంతే కాకుండా ఆలయాల్లోని సీలింగ్, టేబుల్ ఫ్యాన్లు, మైక్ సెట్ సామగ్రిని సైతం దొంగిలించారు.
గడిచిన కొద్ది నెలలుగా ఆయా మండలాల పరిధిలోని గ్రామ దేవాలయాల్లో దొంగతనాలు జరుగుతుండడంతో పోలీసులు ప్రత్యేక టీమును ఏర్పాటు చేసి గాలించడం మొదలు పెట్టారు. పోలీసులకు పట్టుబడిన కత్తులయాదయ్య అనే నిందింతుడు తిప్పర్తి మండలం కేశరాజుపల్లి అంబేద్కర్ కాలనీకి చెందిన పాత నేరగాడు. పశువుల దొంగతనం కేసులో అరెస్టై జైలు శిక్ష కూడా అనుభవించాడు.
మరో నిందితుడు కత్తుల శివది కూడా ఇదే గ్రామం. వీరిద్దరూ కలిసి పగటిపూట భక్తుల వేషంలో గుళ్లూ గోపురాలు తిరిగి రెక్కీ చేసుకుని వచ్చి పక్కా ప్లాన్ తో రాత్రిపూట దొంగతనాలకు పాల్పడ్డారు. జిల్లా వ్యాప్తంగా 14 దేవాలయాల్లో చోరికి గురైన సొత్తు బంగారు, వెండి ఆభరణాలు, నగదు , ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.