Teenmar Mallanna : రాష్ట్రానికి రేవంత్ రెడ్డి చివరి ఓసీ సీఎం, సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాటల దాడి-nalgonda mlc teenmar mallanna sensational comments on cm revanth reddy congress leader in bc ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Teenmar Mallanna : రాష్ట్రానికి రేవంత్ రెడ్డి చివరి ఓసీ సీఎం, సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాటల దాడి

Teenmar Mallanna : రాష్ట్రానికి రేవంత్ రెడ్డి చివరి ఓసీ సీఎం, సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాటల దాడి

HT Telugu Desk HT Telugu
Nov 04, 2024 07:50 PM IST

Teenmar Mallanna Issue : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సొంత పార్టీ నేతలపైనే విమర్శలు ఎక్కుపెట్టారు. బీసీ నినాదంతో ముందుకు వెళ్తున్న ఆయన...కాంగ్రెస్ పార్టీలోని రెడ్డి సామాజిక వర్గం నేతల లక్ష్యంగా తరచూ విమర్శలు చేస్తున్నారు. మిర్యాలగూడ బీసీ గర్జన సభలో రేవంత్ రెడ్డి చివరి ఓసీ సీఎం కావాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ రాజకీయాల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రకంపనలు, సొంత పార్టీ నేతలపైనే మాటల దాడి
కాంగ్రెస్ రాజకీయాల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రకంపనలు, సొంత పార్టీ నేతలపైనే మాటల దాడి

అధికారంలోకి వచ్చి నిండా ఏడాది గడవక ముందే కాంగ్రెస్ ప్రభుత్వానికి సొంతింటి నాయకుల నుంచే తలనొప్పులు మొదలైనట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఆరు గ్యారంటీల హామీల సంగతి ఏమైంది..? రైతు రుణ మాఫీ అందరికీ ఎందుకు చేయలేదు..? రైతులకు పెట్టుబడి సాయం రైతు భరోసా చెల్లించడంలో ఎందుకు విఫలం అయ్యారు..? ఎవరికి దోచిపెట్టేందుకు మూసీ ప్రక్షాళనకు పూనుకుంటున్నారు..? హైడ్రాతో ఏఐసీసీకి ఎంత కప్పం కట్టారు..? అంటూ.. ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ముప్పేట దాడి చేస్తున్నాయి. ఒక వైపు గ్రూప్ వన్ అభ్యర్థుల గొడవ, ఈడబ్ల్యూఎస్ విధానం వల్ల నష్టపోతున్నామంటూ రోడ్డెక్కిన బీసీ అభ్యర్థులు, రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల విషయం, మిల్లర్లతో పేచీ వల్ల ఎక్కడికక్కడ కల్లాల్లో ధాన్యం రాశులు వానకు తడుస్తూ.. ఎండకు ఎండుతూ వారాల తరబడి రైతులు ధాన్యం కేంద్రాల్లోనే పడిగాపులు గాస్తూ ప్రభుత్వానికి శాపనార్ధాలు పెడుతున్నారు. ఒక విధంగా ఈ అంశాలన్నింటితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సొంత పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే కొత్త తలనొప్పిగా తయారైనట్లు కనిపిస్తోంది. ఆదివారం రాత్రి మిర్యాలగూడలో జరిగిన బీసీ గర్జన బహిరంగ సభ వేదిక నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.

బీసీ నినాదం - రెడ్డి నేతలపై మాటల దాడి

ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చివరి ఓసీ సీఎం కావాలని తీన్మార్ మల్లన్న బీసీ గర్జన బహిరంగ సభలో పిలుపు ఇచ్చారు. తనను ఓడించేందుకు రెడ్డి వర్గానికి చెందిన నల్గొండ నాయకులు ప్రయత్నించారని, కానీ, బీసీ ఓట్లతోనే తాను గెలిచానని ప్రకటించారు. అంతే కాకుండా బీసీ గర్జన బహిరంగ సభను అడ్డుకునేందుకు మిర్యాలగూడెం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్ని రకాల కుట్రలు, ప్రయత్నాలు చేశారని, ఆయన మిర్యాలగూడకు చివరి ఓసీ ఎమ్మెల్యే కావాలని పిలుపు ఇచ్చారు. దామచర్లలోని యాదాద్రి పవర్ స్టేషన్ కు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల కార్యక్రమాన్ని కావాలనే ఏర్పాటు చేశారని విమర్శించారు. తాను ఎమ్మెల్సీగా పోటీ చేస్తే ఓసీ నాయకులంతా కలిసి ఓడగొట్టాలని చూశారని ఆరోపించారు.

‘నల్గొండ జిల్లాలో కుందూరు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబాలే రాజకీయాలు చేయాలా..? 56 శాతం ఉన్న బీసీలకు ఏ పదవులు వద్దా..’? అని ప్రశ్నించారు. గత కొద్ది నెలలుగా.. ఎమ్మెల్సీ తీనార్ మల్లన్న ప్రభుత్వంపై, ప్రభుత్వంలోని ఓసీ వర్గానికి ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన మంత్రులపై ఎక్కడో ఒక చోట ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తనకు ఓసీల ఓట్లు అక్కర్లేదని, బీసీ బిడ్డల ఓట్లు చాలని, అదే ఓసీలు తమకు బీసీల ఓట్లు అక్కర్లేదని ప్రకటించగలుగుతారా అని కూడా సవాల్ చేశారు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన బీసీ నాయకులు పాల్గొన్న ఈ బహిరంగ సభ ప్రధానంగా రెడ్డి నేతలు టార్గెట్ గానే సాగింది. దీనిపై కాంగ్రెస్ పార్టీకే చెందిన నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి కూడా స్పందించారు.

కాంగ్రెస్ పార్టీ బీ ఫారం పై గెలిచి పార్టీ నేతలపైనే విమర్శలా?

మిర్యాలగూడెంలో జరిగిన బీసీ గర్జన బహిరంగ సభలో ఎమ్మెల్సీ మల్లన్న, ఇతర నాయకులు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి సోమవారం స్పందిస్తూ... ‘కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పై గెలిచి, పార్టీలో ఉంటూ, పార్టీ నేతలపై కామెంట్ చేయడం సమంజసం కాదు. అందరూ కలిసి ఓట్లు వేస్తేనే అభ్యర్థులు గెలుస్తారు. ఆయన గెలుపు కోసం మేమంతా కృషి చేశాం. పార్టీలో ఉంటూ కామెంట్ చేయడం మంచి పరిణామం కాదు. తీన్మార్ మల్లన్న విషయాన్ని అధిష్టానం, పీసీసీ చూసుకుంటుంది..’ అని వ్యాఖ్యానించారు. గతంలో కూడా ఓ సభలో ఎమ్మెల్సీ మల్లన్న జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంట్రాక్టులు, సంపాదనపైనా విమర్శలు చేశారు. బీసీ నినాదాన్ని భుజానికి ఎత్తుకున్న ఎమ్మెల్సీ మల్లన్న తీరు కాంగ్రెస్ నాయకులకు మింగుడు పడడం లేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

( రిపోర్టింగ్ : క్రాంతిపద్మ, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ కరస్పాండెంట్ )

Whats_app_banner

సంబంధిత కథనం