Komatireddy Rajgopal Reddy : బీజేపీ తొలి జాబితాలో రాజగోపాల్ రెడ్డి పేరు ఎందుకు లేదు? ఏదీ తేల్చుకోలేకపోతున్నారా?-nalgonda komatireddy rajgopal reddy not announced in bjp first list reason ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Komatireddy Rajgopal Reddy : బీజేపీ తొలి జాబితాలో రాజగోపాల్ రెడ్డి పేరు ఎందుకు లేదు? ఏదీ తేల్చుకోలేకపోతున్నారా?

Komatireddy Rajgopal Reddy : బీజేపీ తొలి జాబితాలో రాజగోపాల్ రెడ్డి పేరు ఎందుకు లేదు? ఏదీ తేల్చుకోలేకపోతున్నారా?

HT Telugu Desk HT Telugu
Oct 22, 2023 10:02 PM IST

Komatireddy Rajgopal Reddy : బీజేపీ తొలి జాబితాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు లేకపోవడంతో చర్చనీయాంశం అయింది. కాంగ్రెస్ మునుగోడు సీటు కేటాయింపు తర్వాత రాజగోపాల్ రెడ్డి పోటీపై స్పష్టం వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Komatireddy Rajgopal Reddy : తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న తమ అభ్యర్థుల తొలి జాబితాను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రకటించింది. ఈ జాబితా ఒక విధంగా చర్చనీయాంశం అవుతోంది. ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు తొలి జాబితాలో చోటు చేసుకోకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపిన మునుగోడు ఉపఎన్నికతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నాయకునిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. కానీ, ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన బీజేపీ సంస్థాగత రాజకీయాలకు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. దీంతో ఆయన తన మనసు మార్చుకుని బీజేపీ నుంచి తిరిగి కాంగ్రెస్ గూటికి వెళ్లిపోతారని జోరుగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారాలు, అనుమానాలను పటాపంచలు చేస్తూ తాను బీజేపీ నుంచే పోటీ చేయనున్నానని, మునుగోడు నుంచే బరిలోకి దిగుతానని ఇటీవల మునుగోడులో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల భేటీలో స్పష్టత ఇచ్చారు.

yearly horoscope entry point

అయిదేళ్లలో ఎన్నో ట్విస్టులు

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి 2009లో భువనగిరి ఎంపీగా విజయం సాధించి రాజకీయ అరంగేట్రం చేశారు. 2014 ఎన్నికల్లో ఆయన భువనగిరి ఎంపీ స్థానం నుంచి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత శాసన మండలి నల్గొండ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసి విజయం సాధించారు. ఎమ్మెల్సీగా పదవీ కాలం పూర్తికాక ముందే వచ్చిన 2018 శాసన సభ ఎన్నికల్లో మునుగోడు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఖాళీ అయిన ఆ స్థానంలో తన భార్య లక్ష్మిని పోటీకి పెట్టినా ఆమె ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగారు. చివరకు కాంగ్రెస్ కు , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. రాజీనామాతో ఖాళీ అయిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం కాగా, ఆ ఉప ఎన్నికల్లో తిరిగి ఆయన బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి పార్టీతో అంత దగ్గరగా ఏమీ లేరు.

తొలిజాబితాలో చోటెందుకు దక్కలేదు?

మునుగోడు ఉపఎన్నికల తర్వాత పార్టీకి దూరంగా ఉంటూ వచ్చినా ఆయన, ఇటీవల కొద్ది రోజులుగా మళ్లీ యాక్టివ్ అయ్యారు. మునుగోడు నుంచే పోటీ చేస్తానని కూడా ప్రకటించారు. కానీ, మారిన రాజకీయ పరిణామాల రీత్యా ఎల్.బి.నగర్ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాలన్న ఆలోచనలు చేస్తున్నారు. ఈ రెండు ఆలోచనలను ఆయన పార్టీ నాయకత్వం ముందు పెట్టారని అంటున్నారు. మరో వైపు కాంగ్రెస్, వామపక్షాల పొత్తులో భాగంగా మునుగోడు స్థానాన్ని సీపీఐకి కేటాయిస్తే.. ఇక్కడి నుంచి బీజేపీ తరపున పోటీ చేయాలన్న వ్యూహంతో ఉన్నట్లు చెబుతున్నారు. ఒక వేళ నిజంగానే కాంగ్రెస్ ఈ సీటును సీపీఐకి వదిలేసుకుంటే కాంగ్రెస్ శ్రేణులు తనకు పనిచేస్తాయన్న అంచనాలో రాజగోపాల్ రెడ్డి ఉన్నట్లు చెబుతున్నారు. కానీ, ఇప్పటికీ ఈ సీటు విషయంలో సీపీఐ, కాంగ్రెస్ ల మధ్య ఎలాంటి అంగీకారం కుదరకపోవడం, నిర్ణయం ఇంకా పెండింగులోనే ఉండడంతో రాజగోపాల్ రెడ్డి కూడా డైలమాలో పడ్డారని చెబుతున్నారు. ఒక వేళ మునుగోడు నుంచి కాంగ్రెస్ పోటీచేసే పక్షంలో ఎల్.బి.నగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలన్న వ్యూహంతో ఉన్నారని అంటున్నారు. తన ఈ ఆలోచనలు హైకమాండ్ ముందు పెట్టడం వల్లే తొలి జాబితాలో ఆయన పేరును ప్రకటించలేదని, కాంగ్రెస్, వామపక్షాల పొత్తు, పంచుకునే స్థానాలను బట్టి నిర్ణయం తీసుకోనున్నారని చెబుతున్నారు.

భిన్నాభిప్రాయాలు

అయితే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు తొలి జాబితాలో లేకపోవడంపై రాజకీయా వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మునుగోడులో తన భార్య లక్ష్మికి టికెట్ కావాలని రాజగోపాల్ రెడ్డి కోరారని అంటున్నారు. తాను కుదిరితే ఎల్.బి.నగర్ నుంచి లేదంటే పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి లోక్ సభ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగే ఆలోచన కూడా చేశారని పేర్కొటున్నారు. ఈ కారణం చేత కూడా అభ్యర్థిత్వ ప్రకటనలో జాప్యం జరుగుతోందని మరో అభిప్రాయం కూడా ఉంది. కాంగ్రెస్ నాయకత్వానికి ఇంకా ఆయన టచ్ లోనే ఉన్నారని, చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చినా ఆశ్చర్యం లేదన్న వాదనా లేకపోలేదు. మొత్తంగా బీజేపీ మొదటి జాబితాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు లేకపోవడంతో రాజకీయ విశ్లేషకులకు పని పెట్టినట్టయ్యింది.

( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్గొండ )

Whats_app_banner