Fake Journalists : నల్గొండ జిల్లాలో నకిలీ విలేకరుల హల్ చల్, నెగిటివ్ వార్తలు రాస్తామని సీఐకి బెదిరింపులు
Fake Journalists : నల్గొండ జిల్లాలో నకిలీ విలేకరుల ముఠా రెచ్చిపోయింది. సోషల్ మీడియాలో నెటిగివ్ వార్తలు రాస్తామని సీఐని బెదిరించారు. వేధింపులు ఎక్కువవ్వడంతో సీఐ తన స్నేహితుడి ద్వారా రూ. 1.10 లక్షలు ఇచ్చారు. అప్పటికీ వేధింపులు ఆగకపోవడంతో సీఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Fake Journalists : నల్గొండ జిల్లాలో నకిలీ విలేకరులు హల్చల్ చేశారు. గత కొంతకాలంగా ఓ ముఠా పోలీసులను లక్ష్యంగా చేసుకుని అక్రమ వసూళ్లకు తెగబడుతున్నారు. సోషల్ మీడియాలో నెగిటివ్ వార్తలు రాస్తామని బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారు. సీఐని బెదిరించి రూ.5 లక్షలు డిమాండ్ చేసి రూ 1.10 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. ఈ ముఠా గత నెల రోజులుగా డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తూ పోలీసు అధికారులను ముప్పు తిప్పలు పెడుతోంది.

సీఐ కుటుంబానికి వేధింపులు
నకిలీ విలేకరుల ఆగడాలు తట్టుకోలేక సీఐ తన స్నేహితుడి ద్వారా రూ.1.10 లక్షలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయినా మరో రూ.4 లక్షలు ఇవ్వాలంటూ నకిలీ విలేకరులు సీఐ కుటుంబాన్ని వేధించారు. ముఠా ఆగడాలు మితిమీరడంతో బాధిత పోలీసు అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు నకిలీ విలేఖరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో మరికొందరు సభ్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ముఠాపై గతంలో పలు కేసులున్నట్టు పోలీసుల గుర్తించారు. వారి నేరచరిత్ర పరిశీలిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. బ్లాక్ మెయిల్ చేసిన నకిలీ విలేకరులపై విచారణ అనంతరం పీడీ యాక్ట్ పెట్టే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
జగిత్యాలలో ఫేక్ రిపోర్టర్ అరెస్ట్
జగిత్యాల జిల్లాలో ప్రముఖ మీడియా సంస్థ పేరిట అధికారులను బెదిరించి రూ. లక్షల్లో వసూలు చేసిన కేసులో ఫేక్ రిపోర్టర్ ను పోలీసులు అరెస్టు చేశారు. రాయికల్ మండలం లోక్య నాయక్ తండాకు చెందిన భూక్యా సంతోష్ నాయక్ ఓ మీడియా సంస్థ పేరిట జగిత్యాల జిల్లా ఇండ్రస్ట్రీయల్ డిపార్ట్మెంట్ మేనేజర్ యాదగిరితో పరిచయం పెంచుకున్నాడు. ప్లాన్ ప్రకారం తనకు తెలిసిన మహిళకు కారు లోన్ కు సబ్సిడీ కావాలని చెప్పి కవర్ లో రూ. 5 వేలు డబ్బులు పెట్టి ఆఫీసర్ కు ఇప్పించి సీక్రెట్ గా వీడియో తీశారు. ఈ వీడియోను న్యూస్ ఛానల్ లో అప్ లోడ్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు.
గత నెలలో ఇద్దరు వ్యక్తులు మేనేజర్ ను కారులో తీసుకెళ్లి మరోసారి బెదిరించారు. దీంతో భయపడిన మేనేజర్ పలు దఫాలుగా రూ.8.50 లక్షలు ఇచ్చాడు. ఇంటెలిజెన్స్ అధికారి అని చెప్పి రూ. 7 లక్షలు డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు భూక్య సంతోష్ నాయక్ తో పాటు అతడికి సహకరించిన కలెక్టరేట్ డీపీఆర్వో ఆఫీస్ అటెండర్ బాలే జగన్, పాలకుర్తి రాకేశ్, మాలోత్ తిరుపతి, భూక్య గంగాధర్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.