తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసులో.. నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఏ2 సుభాష్ శర్మకు మరణశిక్ష విధిస్తూ.. నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పునిచ్చింది. మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ హత్య జరిగింది.
302 రెడ్ విత్ 34 ప్రకారం.. ఆరుగురికి జీవిత ఖైదు విధించింది. ఏ2కు సుభాష్ శర్మకు మాత్రం మరణశిక్ష విధించింది. 2020 మార్చిలో మొదటి ముద్దాయి మారుతీ రావు హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. దాదాపు 6 సంవత్సరాల ఐదు నెలల పాటు విచారణ జరిగింది. జీవిత ఖైదు పడిన వారిలో ఏ3 మహ్మద్ ఆష్ఘర్ అలీ, ఏ 4 మహ్మద్ అబ్దుల్ బారీ, ఏ 5 మహ్మద్ అబ్దుల్ కీరం, ఏ6 శ్రావణ్ (మారుతీ రావు తమ్ముడు), ఏ7 సముద్రాల శివ (మారుతీ రావు డ్రైవర్), ఏ 8నజీమ్ (నిందితుల్ని ఆటోలో తీసుకెళ్లిన వ్యక్తి) ఉన్నారు.
అయితే.. శిక్ష తగ్గించాలని నేరస్తులు న్యాయమూర్తిని వేడుకున్నారు. హార్ట్ పెషేంట్, కుటుంబ సభ్యుల ఆరోగ్యం, చిన్న పిల్లలు ఉన్నారని చెప్పారు. కానీ వారి అభ్యర్థనను కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. తన కుమార్తె అమృత.. కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతోనే ఆమె తండ్రి మారుతీ రావు సుపారీ గ్యాంగ్‌తో 2018లో ప్రణయ్‌ను హత్య చేయించారని.. పోలీసులు నిర్ధారించారు. దర్యాప్తులో ఇందుకు సంబంధించిన ఆధారాలను సేకరించి.. కోర్టు ముందు ఉంచారు.
న్యాయ వ్యవస్థలో ఇది చరిత్రాత్మక తీర్పుగా నిలిచిపోతుందని.. కీలకమైన తీర్పుగా పేర్కొనవచ్చని ప్రణయ్ కేసు స్పెషల్ పీపీ వ్యాఖ్యానించారు. అన్ని సెక్షన్లను విజయవంతంగా నిరూపించినట్టు చెప్పారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ శ్రీనివాసరావు ఛార్జిషీట్ పక్కాగా ఫైల్ చేశారని వివరించారు. అన్ని సాక్ష్యాధారాలను కోర్టు ముందు ప్రవేశపెట్టారని, సాక్ష్యులను ప్రవేశపెట్టడం, నిందితుల్ని గుర్తించడం, ఏ2 రిలీజ్ కాకుండా చూడటంలో పోలీసులు కృషి ఉందన్నారు.
అప్పటి జిల్లా ఎస్పీ రంగనాథ్ ఛార్జిషీట్ ఫైల్ చేయడంలో నిజాయితీగా వ్యవహరించారని.. వివరించారు. 78మంది సాక్ష్యులను ప్రవేశపెట్టి విచారించినట్టు చెప్పారని, నిందితుల మొబైల్స్ అనలైజ్ చేసి ఒకరికొకరు ఎలా సంప్రదించుకున్నారో, వాటిని రిట్రైవ్ చేసి కోర్టుకు సమర్పించారని చెప్పారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ శ్రీనివాసరావు సమర్థవంతంగా వ్యవహరించారని, అమృత వర్షిణి, ప్రణయ్ తల్లి ప్రేమలత నిందితుడిని గుర్తించారని పీపీ చెప్పారు. నిందితులు బస చేసిన హోటళ్లలో సీసీ టీవీ ఫుటేజీలను కూడా గుర్తించారని వివరించారు.
ఆరున్నరేళ్ల పాటు న్యాయం కోసం ఎదురు చూసినట్టు ప్రణయ్ తండ్రి బాలస్వామి చెప్పారు. న్యాయస్థానం సరైన తీర్పునిచ్చిందన్నారు. దేశంలో న్యాయం ఉందని మరోసారి రుజువైందన్నారు. సుపారీలు తీసుకుని హత్యలు చేసేవారికి కనువిప్పు కావాలని వ్యాఖ్యానించారు. కుల హత్యలు ఆగిపోవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు.
సంబంధిత కథనం