TS Congress Candidates List : కాంగ్రెస్ తొలి జాబితాపై నల్గొండ నేతల్లో ఉత్కంఠ, ఎవరికి ఛాన్స్ దక్కుతుందో?
TS Congress Candidates List : వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అనే ప్రచారం మొదలవ్వడంతో కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారుకు స్పీడ్ పెంచింది. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీట్ల కేటాయింపుపై ఉత్కంఠ నెలకొంది.
TS Congress Candidates List : కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల జాబితా వడపోతలో బిజీగా ఉంది. వరసగా రెండు రోజుల పాటు సమావేశమైన కమిటీ తెలంగాణ జిల్లాల్లో సుమారు నలభై దాకా సీట్లపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఈ వారాంతంలో తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉందన్న సమాచారంతో ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఏకాభిప్రాయం, ఒకటే దరఖాస్తు దాఖలైన నియోజకవర్గాల అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటిస్తారని పార్టీ హై కమాండ్ నుంచి వస్తున్న వార్తల నేపథ్యంలో జిల్లాలో ఏఏ స్థానాలు ఉంటాయి? వడపోత జాబితాలో రెండు పేర్లున్న నియోజకవర్గాలు.. వారిలో ఎవరికి అవకాశం దక్కుతుందన్న చర్చ జోరుగా సాగుతోంది.
అంతా సీనియర్లే
ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో ఈ సారి బరిలోకి దిగే వారిలో అంతా సీనియర్లే కనిపిస్తున్నారు. వీరు ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఎలాంటి అనుమానాలకు తావు లేకున్నా.. వరసగా ఓడిపోతున్న నాయకులు, వయోభారం మీద పడుతున్నవారు, సర్వేల ఆధారంగా జనాభిప్రాయం బలంగా ఉన్న వారు ఇలా కేటగిరీలుగా విభజించుకొని ఎవరికి టికెట్ దక్కుతుందో అన్న అంశంపై అంచనాలు మొదలయ్యాయి. ఉమ్మడి నల్గొండ నుంచి కుందూరు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి సీనియర్లుగా ఉన్నారు. వీరి చేతుల్లో తాము పోటీ చేసే నియోజకవర్గాలకు అదనంగా మరో నియోజకవర్గం కూడా ఉంది. ఇక్కడా వారి అభిప్రాయం మేరకే అభ్యర్థుల ఎంపిక జరుగుతూ వచ్చింది. మరో వైపు ఈసారి జిల్లాలో బీసీ నినాదంతో పాటు, కొత్త వారు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తు చేసుకోవడంతో జిల్లాలో అభ్యర్థుల ఎంపిక ఒకింత కష్టంగా మారిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
తొలి జాబితాలో ఈ స్థానాలు పక్కా?
వచ్చే వారం రోజుల్లో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల చేసే పక్షంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే వీలుందని పార్టీ వర్గాల సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్, సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి నాగార్జున సాగర్ కు, నల్లగొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, హుజూర్ నగర్ నుంచి టీపీసీసీ మాజీ చీఫ్ ఎన్.ఉత్తమ్ కుమార్, కోదాడ నుంచి ఎన్.పద్మావతి రెడ్డి, అదే మాదిరిగా ఎలాంటి వివాదం లేని ఆలేరు నియోజకవర్గం నుంచి బీర్ల ఐలయ్య యాదవ్ లకు తొలి జాబితాలో చోటు దక్కే అవకాశం ఉందనని చెబుతున్నారు.
మూడు చోట్ల పోటా పోటీ
మరో మూడు నియోజకవర్గాల్లో టికెట్ కోసం కాంగ్రెస్ వర్గాల మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. సూర్యాపేట, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల్లో పరిస్థితి కొంత కఠినంగానే మారిందంటున్నారు. సూర్యాపేటలో సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, మరో నాయకుడు పటేల్ రమేష్ రెడ్డి మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ ఉంది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దామోదర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఆయనకు వయోభారం కూడా పెరిగిపోయిందన్న వాదనను తెరమీదకు తెస్తున్నారు. గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు పటేల్ రమేష్ రెడ్డికి ఈసారి అవకాశం ఇవ్వాల్సిందేనన్న డిమాండ్ ఉంది. రమేష్ రెడ్, టీడీపీ నుంచి రేవంత్ రెడ్డి వెంట వచ్చి కాంగ్రెస్ లో చేరారు. నకిరేకల్ లో కూడా టికెట్ గట్టిపోటీ కనిపిస్తోంది. కొత్తగా బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం చేరిక ఖాయం కావడంతో ఆశావహుల సంఖ్య పెరిగింది. తుంగతుర్తిలో కూడా అద్దంకి దయాకర్ వరసగా రెండు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఓడిపోయిన రోజు నుంచి ఒక విధంగా ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉన్నట్టే లెక్క. ఈ కారణంగానే ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తున్నారని అంటున్నారు. మిర్యాలగూడెం, దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో టికెట్ విషయంలో పీఠ ముడి ఉన్నా.. ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా.. మిగిలిన వారిని తేలిగ్గా బుజ్జగించే స్థాయిలోనే ఉన్నారని, ఇక్కడ పెద్దగా సమస్యలు తలెత్తకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు.
రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్లగొండ