Pilli Ramaraju Yadav : బీఆర్ఎస్ రెబల్ ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ, సస్పెండ్ అయిన రెండు రోజులకే నిర్ణయం!-nalgonda brs rebel leader pilli ramaraju yadav joins aifb contest in assembly election ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Pilli Ramaraju Yadav : బీఆర్ఎస్ రెబల్ ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ, సస్పెండ్ అయిన రెండు రోజులకే నిర్ణయం!

Pilli Ramaraju Yadav : బీఆర్ఎస్ రెబల్ ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ, సస్పెండ్ అయిన రెండు రోజులకే నిర్ణయం!

HT Telugu Desk HT Telugu
Oct 16, 2023 06:41 PM IST

Pilli Ramaraju Yadav : బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన పిల్లి రామరాజు యాదవ్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరారు. ఈ పార్టీ నుంచి నల్గొండ స్థానానికి పోటీ చేయనున్నట్లు తెలిపారు.

పిల్లి రామరాజు యాదవ్
పిల్లి రామరాజు యాదవ్

Pilli Ramaraju Yadav : ఎన్నికల గుర్తు అవసరమైన ప్రతీ ఎన్నికల్లో సొంత పార్టీలను వీడి రెబెల్స్ గా, స్వతంత్రంగా బరిలోకి దిగాలనుకునే రాజకీయ పార్టీల నాయకులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏ.ఐ.ఎఫ్.బి) పార్టీ అక్కరకు వస్తోంది. ఇప్పుడు కూడా ఆయా పార్టీల నుంచి టికెట్ దక్కని వారు.. అసమ్మతి నాయకులుగా ముద్రపడి సస్పెన్షన్ వేటు పడిన వారు ఫార్వర్డ్ బ్లాక్ నుంచి తెలంగాణ శాసనసభకు జరుగనున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నల్గొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డిపై తిరుగుబాటు చేసిన బీఆర్ఎస్ నల్లగొండ పట్టణ మాజీ అధ్యక్షుడు, మున్సిపల్ కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్ పై రెండు రోజుల కిందటనే బీఆర్ఎస్ నాయకత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఈ మేరకు జిల్లా పరిషత్ ఛైర్మన్ బండా నరేందర్ రెడ్డి, పిల్లి రామరాజు యాదవ్ ను సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. వాస్తవానికి బీఆర్ఎస్ నుంచి పిల్లి రామరాజు యాదవ్ దూరం కాగానే.. బీజేపీ, బీఎస్పీ తమ పార్టీల్లోకి ఆహ్వానించాయి. కానీ, ఆయన ఇప్పటి దాకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఒక దశలో బీఎస్పీ నుంచి పోటీలో ఉంటారని కూడా ప్రచారం జరిగింది.

ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ

ఇప్పటికే నియోజకవర్గం పరిధిలోని మూడు మండలాలు, నల్లగొండ పట్టణంలో పర్యటించిన ప్రచారం చేసుకున్న పిల్లి రామరాజు యాదవ్ ఇక, వెనక్కి తిరిగి వెళ్లే పరిస్థితి లేకుండా అయ్యింది. పార్టీ హైకమాండ్ పిలిపించి రాజీ కుదిర్చే ప్రయత్నం కూడా చేయకపోవడం, ఆయన సొంత మార్గం ఎంచుకున్నారు. ఇన్నాళ్లు ఇండిపెండెంటుగానే బరిలోకి దిగుతానని సన్నిహితులకు చెప్పినా.. ఇప్పుడు ఆకస్మికంగా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీలో ఉంటానని సోమవారం ప్రకటించారు. ఇండిపెండెంటుగా పోటీకి దిగితే.. ఎన్నికల గుర్తు సమస్య వస్తుందన్న కారణంతో ఒక జాతీయ పార్టీని ఎంచుకున్నట్లు అభిప్రాయపడుతున్నారు. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పులి గుర్తుపై ఎన్నికల గోదాలోకి దిగనున్నారు. గతంలో కూడా శాసనసభ, మున్సిపల్ ఎన్నికల్లో కొందరు నాయకులు ఫార్వర్డ్ బ్లాక్ పులి గుర్తుపై పోటీ చేశారు. ఎమ్మెల్యే స్థాయిలో ఎవరూ విజయం సాధించకున్నా.. మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా గెలిచినవారు ఉన్నారు. ఎన్నికల గుర్తుతో ఉన్న సౌలభ్యం వల్లే పిల్లి రామరాజు యాదవ్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు- పిల్లి రామరాజు యాదవ్

బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ గురైన పిల్లి రామరాజు యాదవ్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి సింహం గుర్తుపై నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నట్లు సోమవారం ప్రకటించారు. ‘‘ 2017లో బి.ఆర్.ఎస్ పార్టీ లో చేరాను. పార్టీ ఏ పిలుపు ఇచ్చినా నిర్వర్తించా... ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి నన్ను ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు సృష్టించినా పార్టీ కోసం నిలబడాలనుకున్నాను. కానీ నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. నా ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి , ఏడాది కాలంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నా. ప్రజాశీస్సులతో నేను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పులి గుర్తుపై పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. స్వాతంత్రోద్యమ నాయకులు సుభాష్ చంద్రబోస్ ఆశయ సాధన కోసం ముందుకు సాగుతా. డబ్బుతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భూపాల్ రెడ్డి రాజకీయాలను ఏలాగైనా శాసించవచ్చని కలలుగంటున్నారు. ప్రజాసేవకే అంకితం అవ్వడానికి నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతా’’ అని పిల్లి రామరాజు యాదవ్ హెచ్.టి. తెలుగుతో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్గొండ )

Whats_app_banner