BRS vs Congress : ఖాళీ అవుతున్న కారు... నల్గొండ కాంగ్రెస్​లో చేరికల జోరు-nalgonda brs leaders join the congress party ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Nalgonda Brs Leaders Join The Congress Party

BRS vs Congress : ఖాళీ అవుతున్న కారు... నల్గొండ కాంగ్రెస్​లో చేరికల జోరు

HT Telugu Desk HT Telugu
Oct 25, 2023 01:02 PM IST

BRS vs Congress in Nalgonda: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ నల్గొండ జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. అధికార బీఆర్ఎస్ కు చెందిన నేతలు వరుసపెట్టి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు.

నల్గొండలో .. ఖాళీ అవుతున్న కారు
నల్గొండలో .. ఖాళీ అవుతున్న కారు

Telangana Assembly Elections 2023: ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పుడు రెండు నియోజకవర్గాలకు ప్రధానంగా చర్చనీయాంశం అవుతున్నాయి. కనీసం మూడు నాలుగు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నాయకులు గులాబీ కండువాలు పక్కన పడేస్తున్నా.. ముందు వరసలో నాగార్జున సాగర్, నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటితో పాటు నకిరేకల్, కోదాడ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ లోకి వలసలు బాగా పెరిగాయి. తాజాగా నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయ వ్యూహాలకు బీఆర్ఎస్ కుదేలు అవుతోంది. నిన్నా మొన్నటి వరకు నల్లగొండ మున్సిపాలిటీలో పదిమంది మున్సిపల్ కౌన్సిలర్లు కట్ట కట్టుకుని బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. నియోజకవర్గం మొత్తం 2.38లక్షల మంది ఓటర్లలో యాభై శాతం మున్సిపాలిటీ పరిధిలోనే ఉంటాయి. దీంతో టౌన్ లో ప్రభావం పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

నేడు తిప్పర్తి వంతు

నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కీలకమైన మండలం తిప్పర్తి. ఈ మండలంలో బీఆర్ఎస్ పూర్తిగా ఖాళీ అయినట్లే కనిపిస్తోంది. జిల్లా పరిషత్ లో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్, తిప్పర్తి జెడ్పీటీసీ సభ్యుడు పాశం రాంరెడ్డి, తిప్పర్తి ఎంపీపీ విజయలక్ష్మీ లింగారావు, డీసీసీబీ డైరెకర్ట్ పాశం సంపత్ రెడ్డి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, తిప్పర్తి సర్పంచి రొట్టెల రమేష్, మరో పది మంది సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు ఇలా.. అంతా ఈ రోజు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. హైదరాబాద్ లో నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. వీరిలో పాశం రాంరెడ్డి గతంలో తిప్పర్తి ఎంపీపీగా కూడా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర శాసన మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి పాశం రాంరెడ్డి అత్యంత దగ్గరి అనుచరుడు కావడం గమనార్హం. వీరంతా.. తాము స్థానిక ఎమ్మెల్యే , బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి విధానాలతో, వ్యవహారశైలితో విసిగిపోయామని, గుర్తింపు లేని చోట, ఆత్మాభిమానం చంపుకుని ఉండలేకనే కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించడం గమనార్హం. చానాళ్లుగా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, జిల్లా పరిషత్ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ పాశం రాంరెడ్డి మధ్య సంబంధాలు సరిగా లేవు. ఇపుడు ఎన్నికల సమయం కావడం, గతంలో వీరంతా కాంగ్రెస్ లోనే పనిచేసి ఉండడం, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సత్సంబంధాల్లో ఉన్న వారు కావడంతో కారుదిగిపోయారు.

ప్రభావం చూపనున్న చేరికలు

బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తర్వాత కోదాడ, నాగార్జన సాగర్, దేవరకొండ నియోజకవర్గాల్లో మాదిరిగా నల్గొండలో వ్యతిరేకత ఏమీ వ్యక్తం కాలేదు. కానీ, కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు తొలి జాబితాలో ప్రకటించకాగానే, నల్గొండ నియోజకర్గంలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నిండడమే కాకుండా గతంలో పార్టీని వీడి వెళ్లిన స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులంతా తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఒక్క రోజే అందరు కాకుండా.. నిత్యం వలసలు కొనసాగుతున్నాయనిపించేలా ఒక షెడ్యూలు ప్రకారం చేరికల తేదీలను ఖరారు చేసుకున్నారు. ముందు నల్గొండ మున్సిపాలిటీలో, తర్వాత నల్గొండ మండలంలో ఇపుడు తిప్పర్తి మండలంలో చేరికలను పెంచారు. ఎన్నికల సమయంలో క్షేత్ర స్థాయిలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులే కీలకం. ఇపుడు అంతా కట్ట కట్టుకుని కారు దిగుతుండడం వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ప్రభావం చూపిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్గొండ )

IPL_Entry_Point