Komatireddy Rajagopal Reddy : కాంగ్రెస్ వైపు రాజగోపాల్ రెడ్డి మొగ్గు, సంకేతాలు ఇస్తున్నారా?-nalgonda bjp leader komatireddy rajagopal reddy showing internet back to congress ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Nalgonda Bjp Leader Komatireddy Rajagopal Reddy Showing Internet Back To Congress

Komatireddy Rajagopal Reddy : కాంగ్రెస్ వైపు రాజగోపాల్ రెడ్డి మొగ్గు, సంకేతాలు ఇస్తున్నారా?

HT Telugu Desk HT Telugu
Sep 03, 2023 10:15 PM IST

Komatireddy Rajagopal Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆ వ్యాఖ్యలు ఈ ప్రచారాన్ని బలపరుస్తున్నాయి.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Komatireddy Rajagopal Reddy : 14 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా పదవులు అనుభవించిన బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తనకు xరాజకీయ బిక్ష పెట్టిన కాంగ్రెస్ పై ప్రేమ చావడం లేదా? గడిచిన కొద్ది రోజులుగా రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరతారన్న ప్రచారంలో ఎంతో కొంత నిజం ఉందా? నిజంగానే ఇంకా ఆయన మనిషక్కడ ఉన్నా.. మనసంతా గాంధీ భవన్ చుట్టే పరిభ్రమిస్తోందా? రాజగోపాల్ రెడ్డి అభిప్రాయాలు, ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నాయి. అంటే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారన్న మాటలను కొట్టిపారేయలేమంటున్నారు విశ్లేషకులు.

ట్రెండింగ్ వార్తలు

ప్రయోగాల మీద ప్రయోగాలు

కాంట్రాక్టర్ అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2009 ఎన్నికల సమయంలోనే రాజకీయ అరంగేట్రం చేశారు. తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అప్పటికే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలోనే రాజగోపాల్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం వేదికగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. కొన్నాళ్లకే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంతో రాష్ట్రంలో రాజకీయం పూర్తిగా మారిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. ఆ సమయంలో కాంగ్రెస్ ఎంపీగా ఉన్న రాజగోపాల్ రెడ్డి సహా కాంగ్రెస్ ఎంపీలంతా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన 2014 పార్లమెంటు ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి తిరిగి భువనగిరి నుంచే కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కానీ కొన్నాళ్లకే జరిగిన ఉమ్మడి నల్లగొండ జిల్లా శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. 2018 శాసనసభ ఎన్నికల్లో మునుగోడు నుంచి కాంగ్రెస్ టికెట్ పై ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత పదవి కోసం కూడా లాబీయింగ్ చేసినా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్ రెడ్డి అభ్యర్థనను పక్కన పెట్టి భట్టి విక్రమార్కను ఆ పదవికి ఎంపిక చేశారు.

బీజేపీ కార్యక్రమాలకు దూరంగా?

ఇక, తాను ఖాళీ చేసిన ఎమ్మెల్సీ స్థానం నుంచి తన భార్య కోమటిరెడ్డి లక్ష్మీని పోటీకి పెట్టి చేతులు కాల్చుకున్నారు రాజగోపాల్ రెడ్డి. టీపీసీసీ చీఫ్ గా ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవీకాలం ముగియడంతో పీసీసీ అధ్యక్ష పదవి కోసం రాజగోపాల్ రెడ్డి ప్రయత్నించి విఫలమయ్యారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఎంపికైన నాటి నుంచి పార్టీకి అంటీముట్టనట్లు వ్యవహరించారు రాజగోపాల్ రెడ్డి. మరో వైపు తన నియోజవకర్గంలో ఎలాంటి డెవలప్ మెంట్ పనులు చేయలేకపోతున్నాని, సీఎం కేసీఆర్ మీద కారాలు మిరియాలు నూరి, బీజేపీకి దగ్గరయ్యారు. కాంగ్రెస్ నాయకత్వ తప్పులను ఎత్తి చూపుతూ సీఎం కేసీఆర్ ను కంట్రోల్ చేయగలిగేది కేంద్రంలో ఉన్న బీజేపీ ఒక్కటే అని కాంగ్రెస్ కు రాజీనామా చేసి, బీజేపీ కండువా కప్పుకున్నారు. మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నికకు కారణమయ్యారు. ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటికి దిగి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన బీజేపీ కార్యక్రమాలకూ దాదాపుగా దూరంగానే ఉంటున్నారు.

కర్ణాటక ఫలితాలతో డైలమా?

పొరుగునే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారం కోల్పోయి కాంగ్రెస్ కు అప్పజెప్పాల్సి వచ్చింది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ నింపింది. తెలంగాణలో బీజేపీ ఇక పుంజుకోలేదేమోన్న అభిప్రాయం బలపడిన నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారతారని, బీజేపీని వీడి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతారని ప్రచారం ఊపందుకుంది. ఈలోగా రాష్ట్ర బీజేపీ సారథి కూడా మారి బండి సంజయ్ స్థానంలో కేంద్ర మంత్రిగా ఉన్న జి.కిషన్ రెడ్డి రావడం చకచకా జరిగిపోయిన పరిణామాలు. పార్టీలో గుర్తింపు లేకుండా పోయిందన్న అభిప్రాయంలో ఉన్న కోమటిరెడ్డికి బీజేపీ జాతీయ కార్యవర్గంలో స్థానం కల్పించినా ఆయన పెద్దగా కార్యక్రమాల్లో పాల్గొనలేదు. కానీ రెండు రోజుల కిందట నల్లగొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో జరిగిన నియోజవర్గస్థాయి సమావేశాలకు హాజరయ్యారు. కేసీఆర్ పై నిప్పులు కురిపించారు.

కాంగ్రెస్ బాట పడతారా?

ఇంత చేసినా.. రాజగోపాల్ రెడ్డి మనసంతా కాంగ్రెస్ పైనే ఉందన్న సంకేతాలు ఇవ్వకనే ఇచ్చారు. తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పై వ్యతిరేకలేదని, ఇప్పటికీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంటే తనకు ప్రేమ, అభిమానం ఉన్నాయని కుండ బద్దలు కొట్టారు. కాంగ్రెస్ కు వెళుతున్నారన్న వార్తలను ఖండిచకపోగా, భవిష్యత్ లో ఏం జరుగుతుందో చూద్దామని సమాధానం ఇచ్చారు. ఇప్పటికీ తన అభిమానుల నుంచి, పాత సహచరుల నుంచి తనను కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానాలు అందుతున్నాయని చెప్పుకుంటున్నారు. మరి, రాజగోపాల్ రెడ్డి చివరికంటా బీజేపీలోనే కొనసాగుతారా? ఏదో నిమిషయంలో కాంగ్రెస్ బాట పడతారా? అన్న అంశాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విషయంలో మాత్రమే ప్రతికూలంగా మాట్లాడుతున్న రాజగోపాల్ రెడ్డి భవిష్యత్ లో ఏం జరుగుతుందో చూద్దామంటున్నారంటే ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశాలు కొట్టిపారేయలేమన్న అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.

రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్లగొండ

IPL_Entry_Point