Nagoba Jatara 2023: మెస్రం వంశీయుల మహాపూజలు.. నాగోబా జాతర షురూ-nagoba jatara begins at keslapur in adilabad district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Nagoba Jatara Begins At Keslapur In Adilabad District

Nagoba Jatara 2023: మెస్రం వంశీయుల మహాపూజలు.. నాగోబా జాతర షురూ

HT Telugu Desk HT Telugu
Jan 22, 2023 08:06 AM IST

Nagoba jatara begins at Keslapur:ఆదిలాబాద్‌ జిల్లా కేస్లాపూర్‌ గ్రామంలో అడవిబిడ్డల ఆరాధ్య దైవమైన నాగోబా జాతర ఘనంగా ప్రారంభమైంది. శనివారం అర్ధరాత్రి మెస్రం వంశీయులు చేపట్టిన మహాపూజలతో వేడుక మొదలైంది.

నాగోబా జాతర షురూ
నాగోబా జాతర షురూ (facebook)

Nagoba Jatara in Adilabad district: అడవి బిడ్డల నాగోబా జాతర శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఆదివాసీ గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబం ఈ నాగోబా జాతర. మెస్రం వంశీయులు నాగోబా మహాపూజలకు ఉదయం 11 గంటల నుంచి శ్రీకారం చుట్టగా శనివారం అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగించారు. ఈ నెల 17న ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఇంద్రాయి దేవతకు పూజలు చేసి కేస్లాపూర్‌లోని మర్రి చెట్ల వద్దకు చేరిన మెస్రం వంశస్థులు.. ఆ చెట్ల నీడలో గంగాజలంతో మూడురోజుల పాటు వివిధ సంప్రదాయ పూజలు చేశారు. శనివారం ఉదయం అక్కడి నుంచి వెండి విగ్రహం, పూజా సామగ్రిని తీసుకొని డోలు, కాలికోమ్‌ వాయిద్యాలతో ప్రదర్శనగా ఆలయానికి చేరుకున్నారు. గంగాజలంతో ఆలయాన్ని శుభ్రపరిచి, నాగోబాకు అభిషేకం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

ప్రత్యేక పూజలు..

గోవాడ్‌లో మహిళలు 22 ప్రత్యేక పొయ్యిలను ఏర్పాటు చేసుకొని మహాపూజలకు అవసరమైన నైవేద్యాన్ని సామూహికంగా తయారు చేశారు. మెస్రం వంశ సంప్రదాయం ప్రకారం మహాపూజలకు అరగంట ముందు నాగోబా ఆలయాన్ని గంగాజలంతో శుద్ధి చేశారు. రాత్రి 10 గంటల తర్వాత మెస్రం వంశీయులు గోవాడ్‌ నుంచి వెలిగించిన కాగడాలను చేతిలో పట్టుకొని సంప్రదాయ వాయిద్యాలు వాయిస్తూ ఆలయానికి చేరుకున్నారు. రాత్రి 12 గంటల వరకు మెస్రం వంశీయులే నాగోబాకు మహాపూజలు చేశారు. ఈ సమయంలో ఇతరులను లోనికి రానివ్వకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. పూజల అనంతరం వచ్చిన అతిథులతోపాటు ఇతరులను నాగోబాకు పూజలు చేసే అవకాశం కల్పించారు. ఈ నెల 28 వరకూ జాతర కొనసాగనుంది.

ఆదివాసీల అతిపెద్ద జాతర కేస్లా పూర్ నాగోబా జాతర వైభవంగా సాగుతోంది. జాతర కోసం వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. ఇవాళ పలువురు కేంద్రమంత్రులు నాగోబాను దర్శించుకోనున్నారు. ఈ జాతరకు ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగానే కాకుండా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు.

IPL_Entry_Point