Nagoba Jatara 2025 : గోండుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక నాగోబా జాతర.. ప్రత్యేకలు ఇవే
Nagoba Jatara 2025 : నాగోబా జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ (మంగళవారం) రాత్రి నాగోబాకు మహాపూజ చేయనున్నారు మెస్రం వంశీయులు. ఫిబ్రవరి 4 వరకు కేస్లాపూర్‌లో నాగోబా జాతర జరగనుంది. ఈ జాతరకు భారీ ఏర్పాట్లు చేసింది తెలంగాణ ప్రభుత్వం. 600 మంది పోలీసులు, 100 సీసీ కెమెరాలతో భద్రత ఏర్పాటు చేశారు.
గోండుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక నాగోబా జాతర. ఆదివాసీ, గిరిజనులు ఈ జాతరను ఘనంగా జరుపుకుంటారు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ వేదికగా జరిగే నాగోబా జాతర ఇవాళ (జనవరి 28, మంగళవారం నాడు) ప్రారంభం కానుంది. ఏటా వైభవంగా నిర్వహించే ఈ జాతరకు తెలంగాణ తోపాటు.. ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివస్తారు.

నెలవంకతో శ్రీకారం..
ఏటా పుష్య మాసం అమావాస్య రోజున అర్ధరాత్రి మహా పూజలతో మెస్రం వంశస్థులు ఈ జాతరను ప్రారంభిస్తారు. ఈనెల 2వ తేదీన నాగోబా మహా పూజలకు నెలవంకతో శ్రీకారంచుట్టారు. 10వ తేదీన నాగోబా మహా పూజలకు అవసరమయ్యే పవిత్ర గంగాజలం కోసం పాదయాత్ర చేపట్టారు. ఈనెల 17వ తేదీన మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం కలమడుగు శివారుకు చేరుకున్నారు. అక్కడ గోదావరిలోని హస్తిన మడుగు నుంచి పవిత్ర గంగాజలం సేకరించారు.
మండ గాజిలతో..
మహా పూజలకు నాలుగు రోజుల ముందు ఆలయ పరిసరాల్లోని మర్రిచెట్టు వద్దకు చేరారు. నాగోబా దేవుడికి మహా పూజలు నిర్వహించే మెస్రం వంశస్థులు.. మండ గాజిలతో పూజలు ముగిస్తారు. ఉట్నూరు మండలంలోని శ్యాంపూర్‌లో బుడుందేవ్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించి.. అక్కడ జాతరను ప్రారంభిస్తారు. నాగోబా జాతర ఫిబ్రవరి 4వ తేదీ వరకు కొనసాగనుంది.
సర్పాలకు పూజలు..
నాగోబాను సర్పదైవంగా భావిస్తారు. ఈ జాతరలో సర్పాలను పూజించడం ప్రధాన ఆచారం. ఈ జాతరలో గిరిజనుల సంప్రదాయ నృత్యాలు, సంగీతం, వేషధారణలు ఆకట్టుకుంటాయి. జాతర చివరి రోజు జరిగే దర్బార్‌లో.. గిరిజనులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తారు. వివిధ తెగలకు చెందిన గిరిజనులు ఈ జాతరలో ఒకచోట కలుసుకుని సామరస్యంగా జీవించాలనే సందేశాన్ని ఇస్తారు.
వైవిధ్యానికి నిదర్శనం..
ప్రకృతిని దేవుడిగా భావించే గిరిజనులు.. ఈ జాతరలో ప్రకృతిని పూజిస్తారు. గోదావరి నది నుండి తీసుకొచ్చిన పవిత్ర గంగాజలంతో.. నాగోబాను అభిషేకిస్తారు. నాగ దైవానికి వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. గిరిజనులు తమ ఎడ్ల బండ్లను అందంగా అలంకరించి.. పోటీలు నిర్వహిస్తారు. ఈ జాతర భారతీయ సంస్కృతిలోని వైవిధ్యానికి నిదర్శనం. నాగోబా జాతర కేవలం ఒక పండుగ మాత్రమే కాదు.. గిరిజన సంస్కృతి, ఆచారాలు, విశ్వాసాలకు అద్దం పట్టే వేడుక. ఈ జాతరను సంరక్షించడం అంటే మన సంస్కృతిని సంరక్షించడమే.