Nagarjuna Sagar Project : నాగార్జున సాగర్ లో విద్యుత్ ఉత్పత్తికి బ్రేక్, కేఆర్ఎంబీ జోక్యంతో జెన్ కో కీలక నిర్ణయం
Nagarjuna Sagar Project : నాగార్జున సాగర్ ప్రాజెక్టు జల విద్యు్త్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తికి బ్రేక్ పడింది. ఈ ఏడాది భారీ వర్షాలతో సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి. దీంతో రికార్డు స్థాయిల్లో విద్యుత్ ఉత్పత్తి జరిగింది.
నాగార్జున సాగర్ జల విద్యుత్ కేంద్రం ఉత్పత్తిని నిలిపివేసింది. ఈసారి వర్షాకాలం సీజన్ లో ఎగువ కృష్ణా నుంచి ఎక్కువ ఇన్ ఫ్లో ఉండడంతో సాగర్ జలాశయం గడిచిన మూడు నెలలకుపైగా నిండు కుండలా ఉంది. నాగార్జున సాగర్ ఎగువన ఉన్న శ్రీశైలం కూడా పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుని దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో అటు శ్రీశైలం, ఇటు నాగార్జున సాగర్ జలాశయాల వద్ద ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో రికార్డు స్థాయిలో కరెంటు తయారైంది. అయితే, జల విద్యుత్ కోసం జలాశయాలను ఖాళీ చేస్తున్నారంటూ కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్ మెంట్ (కేఆర్ఎంబీ) హెచ్చరించడంతో, తక్షణం ఉత్పత్తిని నిలిపివేయాలని సూచించడంతో నాగార్జున సాగర్ ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో ఆదివారం నుంచి విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశామని జెన్ కో సీఈ మంగేష్ కుమార్ ప్రకటించారు. ఈ ఏడాది జులై 24వ తేదీ నుంచి ఈ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని మొదలు పెట్టారు.
లక్ష్యాన్ని మించి విద్యుత్ ఉత్పత్తి
నాగార్జున సాగర్ ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో 8 టర్బైన్లు ఉన్నాయి. ఒక్కో టర్బైన్ సామర్థ్యం 110 మిలియన్ యూనిట్లు. దాదాపు ఏడాది కిందటే రిపేర్ గురైన రెండో నంబర్ టర్బైన్ ఈసారి ఉత్పత్తిలో పాల్గొనలేదు. కేవలం ఏడు టర్బైన్ల ద్వారానే ఈ ఏడాది జులై 24వ తేదీ నుంచి ఈ నెల 16వ తేదీ వరకు విద్యుత్ ఉత్పత్తి జరిగింది. ఈ ఏడాది లక్ష్యం 1400 మిలియన్ యూనిట్లు కాగా, విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసిన 16వ తేదీ నాటికి (అంటే, కేవలం నాలుగు నెలల లోపే) 1657 మిలియన్ యూనిట్ల పైచిలుకు విద్యుత్ ఉత్పత్తి చేశారు. గత నెలలోనే లక్ష్యాన్ని చేరుకున్నట్లు జెన్ కో వర్గాలు తెలిపాయి. గత ఏడాది తీవ్ర వర్షాభావం వల్ల సాగర్ జలాశయం దాదాపు ఖాళీ అయ్యింది.
వరద లేని కారణంగా గత సంవత్సరం కేవలం 540 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేయగలిగారు. వాస్తవానికి గత సంవత్సరం 1530 మిలియన్ యూనిట్ల లక్ష్యాన్ని నిర్ధేశించినా కేవలం 540 మిలియన్ యూనిట్లు మాత్రమే చేయగలిగారు. కానీ, ఈ ఏడాది జలాశయానికి జులై నుంచి వరదలు మొదలయ్యాయి. దీంతో ఈసారి లక్ష్యాన్ని అధిగమించారు. మరో వైపు ఎగువున ఉన్న శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో కూడా రికార్డు స్థాయిలో 1646 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేశారు. కాగా, సాగర్ జలశయానికి ఉన్న ప్రధాన జలవిద్యుత్ కేంద్రంతో పాటు, కుడి ఎడమ కాల్వలపైనా విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి ఎడమ కాల్వపై 60 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరుగుతోంది.
(రిపోర్టింగ్ : క్రాంతిపద్మ, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ కరస్పాండెంట్ )
సంబంధిత కథనం