Telangana Police : ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసిన కానిస్టేబుళ్లు.. సస్పెండ్ చేసిన ఎస్పీ
Telangana Police : ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసిన ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు పడింది. ఫొటోలు చూపించి డబ్బులు డిమాండ్ చేసిన కానిస్టేబుళ్లను నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు. పోలీస్ శాఖలో ఎవరు తప్పు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. విధుల్లో నిజాయతీగా వ్యవహరించాలని సూచించారు.
ఫొటోలు తీసి డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేసిన ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెండ్ వేటు పడింది. ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ.. నాగర్‌కర్నూల్ ఎస్పీ ఆదేశాలు ఇచ్చారు. నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న రామ్ చందర్, చిన్నయ్య అనే కానిస్టేబుళ్లు ఫొటోలు తీసి డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేసినట్లు నిర్ధారణ కావడంతో.. వారిని ఎస్పీ గైక్వాయిడ్ వైభవ్ రఘునాథ్ సస్పెండ్ చేశారు.
ఏం జరిగిందంటే..
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలానికి చెందిన ఓ వ్యక్తి.. నాలుగు నెలల కిందట తన స్నేహితురాలితో కలిసి జర్నీ చేస్తున్నారు. ఈ క్రమంలో నాగర్ కర్నూల్‌లోని మెయిన్ రోడ్డు పక్కన కారు ఆపి.. దాంట్లో భోజనం చేస్తున్నారు. ఈ సమయంలో ఓ కానిస్టేబుల్ అటుగా వచ్చారు. కారులో ఉన్నవారి ఫొటోలు తీశారు. ఇక్కడ ఏం చేస్తున్నారని ప్రశ్నించి.. భయభ్రాంతులకు గురిచేశాడు.
రూ.10 వేలు డిమాండ్..
అంతటితో ఆగకుండా.. తన దగ్గర ఉన్న ట్యాబ్‌లో నుంచి ఫొటో తొలగించాలంటే రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే కేసు నమోదు చేస్తానని బెదిరించారు. దీంతో భయపడిన ఆ వ్యక్తి రూ.2 వేలు ఇచ్చేందుకు ఓకే చెప్పారు. వెంటనే తన స్నేహితుడి ఫోన్‌పేకి ఆ కానిస్టేబుల్ రూ.2 వేలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. అక్కడితో ఆగలేదు.
మరో కానిస్టేబుల్‌కు ఫొటోలు..
కానిస్టేబుల్ తీసిన ఆ ఫొటోను తొలగించలేదు. కొన్ని రోజుల తర్వాత ఆ ఫొటోను బిజినేపల్లి పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న మరో కానిస్టేబుల్‌కు పంపించారు. అతను కూడా ఫొటోతో బ్లాక్ మెయిల్ చేశాడు. డబ్బులు ఇవ్వాలని బాధితుడిని బెదిరించాడు. దీంతో చిరాకు వచ్చి.. బాధితుడు డబ్బులు ఇవ్వబోనని స్పష్టం చేశారు. దీంతో కానిస్టేబుల్ ఆ ఫొటోను బాధితుడి భార్యకు చూపించాడు.
సోషల్ మీడియాలో వైరల్..
కానిస్టేబుల్ చేసిన ఈ పనితో.. భార్యాభర్తల మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. వీరి గొడవను పెద్దలు కూర్చొని సెట్ చేశారు. ఈ వ్యవహారం.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటన గురించి నాగర్ కర్నూల్ సీఐ కనకయ్యకు తెలిసింది. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. డబ్బులు వసూలు చేసినట్లు నిర్ధారణ అయితే.. ఆ ఇద్దరి కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకుంటామని సీఐ కనకయ్య స్పష్టం చేశారు. తాజాగా.. వారిని సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.