Manda Jagannadham : నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం ఆదివారం అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన..ఇవాళ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. నాగర్ కర్నూల్ జిల్లా ఇటిక్యాలలో 1951 మే 22న జన్మించిన మందా జగన్నాథం.. నాలుగుసార్లు ఎంపీగా గెలిచారు. జగన్నాథం 1996, 1999, 2004, 2009లో ఎంపీగా ఎన్నికయ్యారు. 3 సార్లు టీడీపీ, ఒకసారి కాంగ్రెస్ తరఫున ఎంపీగా గెలిచారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆయన బీఎస్పీలో చేరారు.
జగన్నాథం 2014లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీచేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో ఆయనకు అవకాశం దక్కలేదు. ఈ నేపథ్యంలో 2022, జులైలో దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా...అప్పటి సీఎం కేసీఆర్ మందా జగన్నాథంను నియమించారు. 2023 నవంబర్ 17న బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. అయితే నాగర్ కర్నూల్ టికెట్ దక్కకపోవడంతో... బీఎస్పీ పార్టీలో చేరారు.
నాగర్ కర్నూల్ లోక్‌సభ మాజీ సభ్యుడు మందా జగన్నాథం మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. లోక్‌సభ సభ్యుడిగా, సామాజిక, తెలంగాణ ఉద్యమకారుడిగా జగన్నాథం పోషించిన పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు. వారి మరణం తెలంగాణకు తీరని లోటు అని అన్నారు. జగన్నాథం పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
"నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం మృతి తీవ్ర ద్రిగ్బాంతికి గురి చేసింది. 15వ లోక్ సభ లో తనతో పాటు మందా జగన్నాథం పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. ఉద్యమ సమయంలో కూడా తనతో కలిసి పనిచేశారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రణబ్ ముఖర్జీ ఆగ్రహానికి గురై గుండెపోటుకి గురైన మందా జగన్నాథం ఉద్యమాన్ని ఆపలేదు. మందా జగన్నాథం మృతి పట్ల నా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి"- మంత్రి పొన్నం ప్రభాకర్
నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం మృతికి ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. నాలుగు సార్లు లోక్ సభకు ఎన్నికైన మందా జగన్నాథం రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని అన్నారు. పేద కుటుంబం నుంచి వచ్చి ఉన్నత చదవులు చదివిన జగన్నాథం... తెలుగుదేశం పార్టీ నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచి ప్రజాసేవ చేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.