TS Assembly Elections : మారనున్న ‘మెదక్’ రాజకీయం... మరోసారి మైనంపల్లి వర్సెస్ పద్మాదేవేందర్ రెడ్డి!-mynampally hanumantha rao vs padma devender reddy in medak assembly seat ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Mynampally Hanumantha Rao Vs Padma Devender Reddy In Medak Assembly Seat

TS Assembly Elections : మారనున్న ‘మెదక్’ రాజకీయం... మరోసారి మైనంపల్లి వర్సెస్ పద్మాదేవేందర్ రెడ్డి!

HT Telugu Desk HT Telugu
Sep 23, 2023 09:40 AM IST

Medak Assembly Seat: మెదక్ కేంద్రంగా సరికొత్త రాజకీయం మొదలైంది. మైనంపల్లి రాజీనామాతో ఆయన కుమారుడు ఈ సీటు నుంచి బరిలో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. ఫలితంగా ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవెందర్ రెడ్డి వర్సెస్ మైనంపల్లి అన్నట్లు మారింది.

మెదక్ ఫైట్
మెదక్ ఫైట్

Medak Assembly Seat: తెలంగాణలో రాజకీయ వేడి మొదలైంది. ఎన్నికల ఏడాది కావటంతో ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలు, ప్రతివ్యూహాలతో పాటు పక్కా ప్లాన్ తో అడుగులు వేసే పనిలో పడ్డాయి. ఇక అధికార బీఆర్ఎస్ ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. ఇప్పటికే అభ్యర్థులను కూడా ప్రకటించింది. అయితే పార్టీకి చెందిన మైనంపల్లి రెండు టికెట్లు కోరటంతో… అందుకు నిరాకరించింది బీఆర్ఎస్. కేవలం మైనంపల్లికి మల్కాజ్ గిరి టికెట్ ను కేటాయించగా… మెదక్ టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికే ఇచ్చింది. దీంతో అసంతృప్తి చెందిన మైనంపల్లి శుక్రవారం…. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఆయన కుమారుడు మెదక్ లో పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో మెదక్ రాజకీయంలో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు అయింది.

ట్రెండింగ్ వార్తలు

మైనంపల్లి వర్సెస్ పద్మాదేవేందర్ రెడ్డి….

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు కాంగ్రెస్ పార్టీ లో చేరటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఆయన కుమారుడితో కలిసి ఢిల్లీకి బయల్దేరారు. ఆయన కాంగ్రెస్ లో చేరితే… ఇక్కడ ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్ బరిలో ఉండే అవకాశం ఉంది. దీంతో పద్మాదేవేందర్ రెడ్డి, మైనంపల్లి మధ్య మరో ఎన్నికల యుద్దానికి మెదక్ నియోజకవర్గం సిద్ధమవుతుంది. మెదక్ జిల్లా నుండి రెండు సార్లు ఎమ్మెల్యే గా ఎన్నికైన మైనంపల్లి, తన కుమారుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ కు రాజకీయ భవిష్యత్తుకు పునాదులు వేయాలని చాలా రోజులుగా భావిస్తున్నారు. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి రోహిత్ కి 2023 ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని అభ్యర్ధించారు. కానీ అక్కడినుండి, సీనియర్ నాయకురాలు, వరుసగా ఇక్కడి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పద్మాదేవేందర్ రెడ్డి ఉండటంతో టికెట్ ఇవ్వలేదు. పార్టీ ఆదినాయకత్వం మరోసారి పద్మాదేవేందర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో… ఈ విషయంలో పార్టీ నాయకత్వంతో తీవ్రంగా విభేదించిన మైనంపల్లి… ఆర్థిక మంత్రి హరీష్ రావుతో పాటు పద్మాదేవేందర్ రెడ్డి పైన ఘాటైన విమర్శలు చేశారు.

మైనంపల్లి 2008లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి… ఉపఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి పైన గెలిచారు. 2009 జనరల్ ఎన్నికలకు ముందు నియోజకవర్గాల పునర్విభజన లో భాగంగా రామాయంపేట నియోజవర్గాన్ని తీసివేయటంతో, మైనంపల్లి , పద్మాదేవేందర్ రెడ్డి ఇద్దరు మెదక్ నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యాలని నిర్ణయించుకున్నారు. 2009 సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్, టిడిపితో పాటు వామపక్షాలు పొత్తుపెట్టుకొని మహాకూటమిగా ఏర్పాడటంతో… ఈ సీటుని టిడిపికి ఇచ్చారు. ఈ సీటు నుంచి మైనంపల్లిని మరోసారి బరిలోకి దించింది, బీఆర్ఎస్ నాయకత్వంతో విభేదించిన పద్మాదేవేందర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో 20,000 భారీమెజార్టీ తో గెలిచారు మైనంపల్లి. అయితే పద్మాదేవేందర్ రెడ్డి కి సుమారుగా 23,000 ఓట్లు పోలయ్యాయి. అప్పట్నుంచే వీరి మధ్య దూరం మరింత పెరిగింది. 2010లో పద్మాదేవేందర్ రెడ్డి మళ్ళీ బీఆర్ఎస్ గూటికి చేరారు.

ఇదిలా ఉంటే 2014, 2018 లో మెదక్ నుంచి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి అలవోకగా గెలిచారు పద్మా దేవేందర్ రెడ్డి. మైనంపల్లి కూడా 2014 ఎన్నికలకు ముందే బిఆర్ఎస్ లో చేరగా… ఆయనకు మల్కాజిగిరి ఎంపీ సీటు ఇచ్చి సర్దుబాటు చేసింది పార్టీ నాయకత్వం. ఆ ఎన్నికల్లో తాను ఓడిపోవటంతో, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేసింది. ఎమ్మెల్యే కావటం తన లక్ష్యంగా పావులు కదిపిన మైనంపల్లి 2018 ఎన్నికల్లో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి 74,000 ఓట్ల భారీ మెజారిటీ తో గెలిచారు.

మెదక్ నియోజవర్గంలో పద్మాదేవేందర్ రెడ్డి కి తనకు ఎదురులేదు అని అనుకునే పరిస్థితుల్లో… మైనంపల్లి తన కుమారుడు రోహిత్ ని ఇక్కడి నుంచే అభ్యర్థిగా పోటీకి దింపుతానని ప్రకటించటం ఆసక్తికరంగా మారింది. నియోజకవర్గంలో ఎన్నికల హడావుడి ముందే వచ్చినట్టు అయ్యింది. గత సంవత్సరంలో మైనంపల్లి రోహిత్ వందలాది సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం, గతంలో మైనంపల్లి కి కూడా నియోజకవర్గంలో మంచి పట్టు ఉండటంతో… రోహిత్ కి పర్యటనల్లో మంచి స్పందన వచ్చింది . మొత్తంగా ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ... మెదక్ పాలిటిక్స్ మాత్రం హీట్ ను పెంచేస్తున్నాయి. అయితే ఈసారి ప్రజల ఆశీర్వాదం ఎవరు పొందుతారనేది ఆసక్తిని రేపుతోంది.

రిపోర్టింగ్: ఉమ్మడి మెదక్ జిల్లా

WhatsApp channel