Nominated Posts : టీఎస్ఆర్టీసీ ఛైర్మన్‌గా ముత్తిరెడ్డి, రైతు బంధు ఛైర్మన్‌గా రాజయ్య - మరో ఇద్దరికి నామినేటెడ్ పదవులు
Telangana Govt News: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని ఆర్టీసీ ఛైర్మన్ గా నియమించారు సీఎం కేసీఆర్. మరో ముగ్గురికి నామినేటెడ్ పదవులను ఇవ్వగా… ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Telangana Govt : తెలంగాణ ఆర్టీసీ చైర్మన్‌గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్యను తెలంగాణ రైతు బంధు సమితి చైర్మన్‌గా, రాష్ట్ర ఎంబీసీ చైర్మన్‌గా నందికంటి శ్రీధర్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్‌గా ఉప్పల వెంకటేశ్ నియమితులయ్యారు.
- మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా ఉప్పల వెంకటేష్
- టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
- తెలంగాణ రైతు బంధు సమితి ఛైర్మన్ గా తాటికొండ రాజయ్య
- ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ గా నందికంటి శ్రీధర్
తాజాగా నామినేటెడ్ పదవులు పొందిన వారిలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇటీవలే బీఆర్ఎస్ ప్రకటించిన జాబితాలో ఘన్ పూర్ నుంచి రాజయ్య పేరు లేకపోగా… జనగామకు సంబంధించి మాత్రం పెండింగ్ లో ఉంచారు. ఈ టికెట్ కోసం MLC పల్లా ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు ఆయనకే టికెట్ ఖరారయ్యే అవకాశం ఉంది. ఇక ఘన్ పూర్ టికెట్ విషయంలో… రాజయ్య, శ్రీహరి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే… రాజయ్యకు రైతు బంధు సమితి, ముత్తిరెడ్డికి ఆర్టీసీ కార్పొరేషన్ ఛైర్మన్లగా నియమించినట్లు తెలుస్తోంది. ఇక కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన ఉప్పల వెంకటేశ్ ప్రస్తుతం తలకొండపల్లి జెడ్పీటీసీగా ఉన్నారు. స్వతంత్రంగా గెలిచిన ఆయన… ఇటీవలే బీఆర్ఎస్ లో చేరారు. మరోనేత నందికంటి శ్రీధర్… ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడి గులాబీ గూటికి చేరారు.