హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీనికితోడు జంట జలాశయాలకు భారీగా వరద రావటంతో గేట్లు ఎత్తారు. వర్షం నీళ్లకు తోడు… జలాశయాల నుంచి వరద నీటితో మూసీ ఉప్పొంగిపోయింది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు వచ్చే చేరింది. నది ఒడ్డునే ఉండే ఎంజీబీఎస్ బస్ స్డాండును కూడా వరద నీరు ముంచెత్తింది.
వరద ఉద్ధృతికి ఎంజీబీఎస్‌లోకి వెళ్లే రెండు బ్రిడ్జిలు నీట మునిగాయి. బస్టాండ్ లోకి నీరు చేరటంతో…. వేల మంది ప్రయాణికులు బస్డాండ్‌లో చిక్కుకుపోయారు. ప్రయాణికులను సురక్షితంగా బయటికి తరలిస్తున్నారు.
మరోవైపు నగరంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. మూసీ ఉధృతిపై స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎంజీబీఎస్ బస్ స్టాండులోని ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకురావాలని ఆదేశించారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని… ముంపు ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.
ఇక నగరంలోని పురానాపూల్ బ్రిడ్జి వద్ద 13 ఫీట్ల ఎత్తులో మూసీ నది పారుతోంది. మూసారంబాగ్ బ్రిడ్జి వద్ద కూడా భారీగా మూసీ ప్రవహిస్తోంది. మూసీ వరద తాకిడికి నది తీరంలో ఉన్న పలు ఆలయాలు మునిగాయి.
పురానాపూల్‌లో ఉన్న శివాలంయ నీట మునిగగా.. ఆలయంలోనే పూజారి కుటుంబం చిక్కుకుపోయింది. ఆలయంపైకి ఎక్కిన ఆ కుటుంబం… సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. వారిని బయటికి తీసుకొచ్చేందుకు హైడ్రాతో పాటు ఇతర సిబ్బంది ప్రయత్నాలు చేస్తోంది.
మూసీ నదికి భారీ వరద నేపథ్యంలో ఎంబీజీఎస్ ప్రాంగణంలోకి వరద నీరు చేరటంతో టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి బస్సుల రాకపోకలను టీజీఎస్ఆర్టీసీ తాత్కాలికంగా నిలిపివేసిందన్నారు. ఎంబీజీఎస్ నుంచి బయలుదేరే బస్సులను హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి సంస్థ నడుపుతోందని వివరించారు.
మూసీ వరదనీరు చేరిన నేపథ్యంలో ఎంజీబీఎస్ కు ప్రయాణికులు ఎవరూ రావొద్దని టీజీఎస్ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది. ఎంబీజీఎస్ నుంచి నడిచే బస్సులను ఇతర ప్రాంతాల నుంచి తిప్పుతున్నామని… ఆయా మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని పేర్కొంది. వివరాలకు టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాలని సూచించింది.
సంబంధిత కథనం