Munugode Bypoll Counting : ఓట్ల లెక్కింపు ఎలా చేస్తారు-munugode bypoll how to count votes in election ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Munugode Bypoll How To Count Votes In Election

Munugode Bypoll Counting : ఓట్ల లెక్కింపు ఎలా చేస్తారు

Anand Sai HT Telugu
Nov 06, 2022 02:38 PM IST

Munugode Bypoll Results : మునుగోడు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు సమయంలో కౌంటింగ్ లో జాప్యంపై బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. దీనిపై ఎన్నికల అధికారి సైతం వివరణ ఇచ్చారు. ఇంతకీ ఓట్ల లెక్కింపు ఎలా చేస్తారు?

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

మునుగోడు ఉపఎన్నిక(Munugode Bypoll) పోరు ముగిసింది. అయితే ఓట్ల లెక్కింపు సమయంలో టీఆర్ఎస్ పార్టీ(TRS Party), బీజేపీ(BJP) కామెంట్స్ చేశాయి. అయితే ఇంతకీ ఓట్లు లెక్కింపు ఎలా చేస్తారు. పోలింగ్ ముగిసిన తర్వాత.. స్ట్రాంగ్ రూమ్‌లలో ఈవీఎంలు(EVMs), వీవీప్యాట్‌లు భద్రంగా ఉంచుతారు. ఐదు అంచెల భద్రతను ఏర్పాటు చేస్తారు. ఓట్ల లెక్కింపులో ప్రతీ అంశాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు అధికారులు. ఎన్నికల సంఘం(Election Commission) నిబంధన మేరకు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు షురూ అవుతుంది. కానీ దీనికోసం ముందునుంచే కసరత్తు జరుగుతుంది. లెక్కింపునకు 4 గంటలకు ముందు అధికారులు తమ పనుల్లో నిమగ్నమవుతారు.

ట్రెండింగ్ వార్తలు

సిబ్బంది తమకు కేటాయించిన లెక్కింపు కేంద్రాలకు ఉదయం 4 గంటలకు వెళ్లాలి. 5 గంటలకు వారికి లెక్కింపు చేయాల్సిన టేబుల్స్(Tables) చూపిస్తారు. సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సిబ్బందితో ప్రమాణం కూడా చేయిస్తారు. లెక్కింపులో గోప్యత పాటిస్తామని చెబుతారు. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్(postal ballot) లెక్కింపు మెుదలవుతుంది. 8.30 వరకూ ఇది కంటిన్యూ అవుతుంది. పోస్టల్ ఓట్లు ఎక్కువ ఉండి సమయం పడితే ఆ లెక్కింపు కొనసాగిస్తూనే ఈవీఎంల ఓట్ల లెక్కింపు కూడా చేస్తారు. ఒక నిమిషానికి 3 పోస్టల్ బ్యాలెట్‌లు లెక్కిస్తారని అంచనాగా ఉంది.

ఇక తర్వాత నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలను, వాటి పరిధిలో పోలైన ఓట్లు ప్రాతిపాదికన ఎన్ని రౌండ్‌లు కావాలో నిర్ణయం తీసుకుంటారు. ఒక్కో రౌండ్‌కు 30 నిమిషాల సమయం వరకూ పడుతుంది. 14-15 టేబుళ్లపై లెక్కింపు చేస్తారు. ఒకసారి మొత్తం టేబుళ్లపై ఉన్న ఈవీఎం(EVM)ల లెక్కింపు పూర్తయితే ఒక రౌండ్ పూర్తయినట్టుగా నిర్ధారిస్తారు. ఈవీఎంల లెక్కింపు పూర్తయిన అనంతరం వీవీప్యాట్‌ల స్లిప్పుల లెక్కింపు చేస్తారు. నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల(polling Centres) నెంబర్స్ ను చీటీలపై రాసి లాటరీ తీస్తారు. ఏయే వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలో లాటరీ ద్వారా నిర్ణయం తీసుకుంటారు.

ఈ లెక్కింపులో ఈవీఎంల లెక్కింపులో వచ్చిన ఒట్లు వీవీప్యాట్‌(VVPAT)ల స్లిప్‌ల ఓట్లను చూస్తారు. ఏదైనా వ్యత్యాసం ఉంటే మళ్లీ స్లిప్పులను రెండోసారి లెక్కపెడతారు. ఇలా మూడు సార్లు చేస్తారు. అప్పటికీ తేడా వస్తే స్లిప్పుల‌లోని లెక్కనే పరిగణనలోకి వెళ్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. ఈవీఎంల లెక్కింపుతో అనధికారికంగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో అర్థమవుతుంది. కానీ వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు పూర్తయ్యే దాకా అధికారికంగా ప్రకటించడం అనేది ఉండదు.

ఎన్నికల్లో ఒక రౌండ్ ఫలితాలు ఈసీ అధికారికంగా ప్రకటించాలంటే 30 నుంచి 45 నిమిషాల సమయం పడుతుంది. రౌండ్ పూర్తి అయిన తర్వాత అన్ని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలి. మైక్రో అబ్జార్వర్, కేంద్ర ఎన్నికల(Election Commission) పరిశీలకుల సంతకాలు చేయాలి. ఆ తర్వాత ఏవైనా ఈవీఎంలలోని ఓట్లను ఎన్నికల పరిశీలకుడు ఫలితాల రికార్డులతో పరిశీలిస్తారు. ఈవీఎంలలో వచ్చిన ఓట్లు, వీవీ ప్యాట్లలో వచ్చిన ఓట్లు సరిపోవాలి. ఆ తర్వాత ఏజెంట్లు ఎవరికి అభ్యంతరం లేదని చెప్పిన తర్వాత ఆర్వో రౌండ్ ఫలితాలు అధికారికంగా ప్రకటిస్తారు. ఈ ప్రక్రియలో ఏదైనా అభ్యంతరం ఉంటే ఓట్ల లెక్కింపు చాలా ఆలస్యం అవుతుంది.

WhatsApp channel