KMC Politics: మునిసిపల్ రాజకీయం రచ్చ రచ్చ... నిరసనలు, ఆందోళనలతో ముగిసిన కరీంనగర్ కార్పొరేషన్ పాలకవర్గం గడువు
KMC Politics: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయాలు రక్తీకట్టిస్తున్నాయి. పాలకవర్గం ఐదేళ్ళ పదవి కాలం ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్పొరేటర్ల సన్మాన సమావేశం నిరసనలు ఆందోళనలకు వేదికగా మారింది. సరికొత్త సాంప్రదాయానికి తెరలేపి రాజకీయంగా దుమారం సృష్టించారు.
KMC Politics: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం గడువు ముగిసింది. ముగింపు సందర్భంగా కార్పొరేటర్లకు కమీషనర్ చాహత్ బాజ్ పాయ్ సన్మానం ఏర్పాటు చేయగా బిఆర్ఎస్ కార్పొరేటర్ నిరసన ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. ఐదేళ్ళ పాలనలో విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం సహజమే అయినా చివరి సమావేశం రోజున ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని పదవి కాలం ముగిసిన రోజున కలిసిపోతుంటారు.

రాజకీయంగా నొప్పించే విధంగా మాట్లాడినట్టయితే క్షమపణలు చెప్పుకుని తమ పదవి కాలంలో జరిగిన అనుభవాలను నెమరువేసుకోవడం సహజం. కానీ కరీంనగర్ కార్పోరేషన్ చివరి సమావేశం రచ్చరచ్చగా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
మేయర్ కు వ్యతిరేకంగా నిరసన...
మేయర్ వై.సునీల్ రావు నాలుగు రోజుల క్రితం బీఆర్ఎస్ ను వీడి బిజెపిలో చేరడంతో బిఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన ఆందోళన వ్యక్తం చేశారు. మేయర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళా కార్పొరేటర్ భర్తలను సమావేశంలోకి అనుమతించకుండా గేటు వద్దనే పోలీసులు అడ్డుకోవడం పై నిరసన తెలిపారు. నిరసన ఆందోళనతో మహిళా కార్పొరేటర్ ల భర్తలను సమావేశంలోకి అనుమతించారు.
కాషాయ కండువా వేసుకుని మేయర్.. కార్పోరేటర్‌లను సన్మానించడాన్ని వ్యతిరేకించారు. సాంప్రదాయ పద్దతిలో మేయర్ గౌను వేసుకోకుండా కాషాయ కండువా కప్పుకుని సన్మానం చేయడం అవమానకరంగా భావిస్తు సమావేశం నుండి బిఆర్ఎస్ కార్పోరేటర్ లు వాకౌట్ చేశారు.
కార్పొరేషన్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. సాంప్రదాయాన్ని మేయర్ కాలరాస్తున్నాడని కాషాయ కండువా వేసుకొని సన్మానించడాన్ని వ్యతిరేకించామని మాజీ మేయర్ రవీందర్ సింగ్ తెలిపారు.
అట్టుడికిన సన్మాన సమావేశం...
మేయర్ వై.సునీల్ రావు బిఆర్ఎస్ ను వీడి బిజెపిలో చేరడంతో బిఆర్ఎస్ కార్పోరేటర్ లు నిరసన మద్య కౌన్సిల్ చివరి సమావేశం అట్టుడికింది. పదవి కాలం ముగింపు సందర్భంగా కార్పొరేటర్ ల సన్మానానికి సమావేశాన్ని పరిమితం చేయగా మేయర్ తీరును నిరసిస్తూ బిఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన ఆందోళన వ్యక్తం చేసి సన్మానాన్ని బహిష్కరించారు.
బిఆర్ఎస్ తీరు నచ్చక అభివృద్ధి బిజేపి ద్వారానే సాధ్యమని బిజేపి లో చేరితే ఎమ్మెల్యే మెప్పు కోసం కొందరు అలజడి సృష్టించారని మేయర్ విమర్శించారు. ఎవరు ఏమనుకున్నా, గడిచినా ఐదేళ్ళలో మునుపెన్నడు లేనంతగా అభివృద్ధి చేశామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో మెజార్టీ డివిజన్ లను బిజేపి కైవసం చేసుకుని కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగరవేస్తామని మేయర్ స్పష్టం చేశారు.
అటు కాంగ్రెస్ ఇటు ఎంఐఎం...
బిఆర్ఎస్ బిజెపి మధ్య పార్టీ ఫిరాయింపు వార్ జరుగుతుండగా కాంగ్రెస్ ఎంఐఎం కార్పొరేటర్ లు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. రాబోయే ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలిచి కార్పొరేషన్ కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ కార్పొరేటర్లు అంటే, తమ మద్దతుతోనే ఎవరైనా మేయర్ అవ్వడం లేదా తామే మేయర్ కావడం జరుగుతుందని ఎంఐఎం కార్పొరేటర్ లు అన్నారు.
పోలీస్ రక్షణ మద్య సన్మానం..
ఏనాడూ లేని విధంగా కరీంనగర్ కార్పోరేషన్ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున మోహరించిన పోలీసు బలగాల నడుమ చివరి సమావేశం, సన్మానాన్ని మున్సిపల్ అధికారులు నిర్వహించారు. పోలీసుల తీరు, మున్సిపల్ అధికారుల వైఖరిపై బిఆర్ఎస్ కార్పోరేటర్ లు ఆందోళన వ్యక్తం చేశారు.
కొత్త సాంప్రదాయానికి ఈ కౌన్సిల్ సమావేశం తెరలేపిందని అభిప్రాయపడ్డారు. కౌన్సిల్ పాలకవర్గం గడువు ముగుస్తున్న తరుణంలో మేయర్ పార్టీ మారడం, చివరిది సమావేశం సాంప్రదాయానికి విరుద్ధంగా నిర్వహించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)