ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్...! ములుగు జిల్లాలో 20 మంది మావోయిస్టులు అరెస్ట్-mulugu police arrested 20 cpi maoists of various cadres and seized weapons ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్...! ములుగు జిల్లాలో 20 మంది మావోయిస్టులు అరెస్ట్

ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్...! ములుగు జిల్లాలో 20 మంది మావోయిస్టులు అరెస్ట్

ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ తో మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ములుగు జిల్లాలో 20 మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. వారి వద్ద నుంచి భారీ స్థాయిలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

మావోయిస్టులు అరెస్ట్

ములుగు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిషేధిత సీపీఐ(మావోయిస్టు)కి చెందిన 20 మంది సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

మే 16 నుంచి 17 వరకు వెంకటాపురం, వాజేడు, కన్నాయిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు పెట్రోలింగ్ తో పాటు వాహనాల తనిఖీలు చేపట్టారు. పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో…. ఒక డివిజన్ కమిటీ సభ్యుడితో పాటు ఐదుగురు ఏరియా కమిటీ సభ్యులతో సహా పలువురు మావోయిస్టులను అరెస్టు చేసినట్లు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు.

ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్…!

నక్సల్స్ ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ పేరుతో భద్రతా బలగాలు ముందుకెళ్తున్నాయి. ఛత్తీస్ గఢ్-తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్ట కొండల్లో సీఆర్పీఎఫ్, ఛత్తీస్ గఢ్ పోలీసులు ఇటీవల పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే కర్రెగుట్టలో ఆశ్రయం పొందుతున్న మావోయిస్టు సభ్యులు అక్కడి నుంచి చిన్న చిన్న బృందాలుగా విడిపోయి… వేరే ప్రాంతాలకు పారిపోతున్నట్లు ములుగు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన ములుగు జిల్లా పోలీసులు… జిల్లాలోకి మావోయిస్టుల ప్రవేశాన్ని అడ్డుకునేందుకు లు నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. విస్తృత తనిఖీలు చేపట్టగా… మావోయిస్టులను పట్టుకున్నారు.

అరెస్ట్ అయిన 20 మంది మావోయిస్టులపై పలు కేసులు ఉన్నట్లు ములుగు ఎస్పీ వెల్లడించారు. తెలంగాణ, చత్తీస్ గఢ్ లలో పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లను హతమార్చడం, భద్రతా సిబ్బందిపై దాడి చేయడం వంటి కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా పోలీస్ ఇన్ ఫార్మర్లుగా ముద్రవేసి పలువురిని హతమార్చిన నేర చరిత్ర ఉందని వివరించారు.

అరెస్టైన మావోయిస్టుల నుంచి మూడు 5.56 ఎంఎం ఇన్సాస్ రైఫిల్స్, నాలుగు 7.62 ఎంఎం ఎస్ఎల్ఆర్ రైఫిల్స్, ఒక 303 రైఫిల్స్, నాలుగు 8 ఎంఎం రైఫిల్స్, రెండు లైవ్ గ్రెనేడ్లతో పాటు మ్యాగజైన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

కర్రెగుట్ట అటవీ ప్రాంతంలోకి ఆదివాసీలు, ఇతరులు ప్రవేశించవద్దని మావోయిస్టులు ఏప్రిల్ 8న ఒక ప్రకటన ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. దీంతో అప్పట్నుంచి భద్రతా బలగాలు… కర్రెగుట్టలను స్వాధీనం చేసుకునే దిశగా ముందుకెళ్తారు. ఇందులో భాగంగా మావోయిస్టులకు అడ్డాగా ఉన్న కీలక స్థావరాలను గుర్తించారు.

ఈ వ్యాసం టెక్స్ట్ లో మార్పులు లేకుండా ఆటోమేటెడ్ న్యూస్ ఏజెన్సీ ఫీడ్ నుండి జనరేట్ చేయబడింది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.