Chalpaka Encounter : చల్పాక ఎన్ కౌంటర్, అదే స్పాట్ 33 ఏళ్ల తరువాత రివేంజ్-అప్పుడు, ఇప్పుడు ఏడుగురే-mulugu chalpaka encounter seven maoists died 33 years back seven police died in maoist attack ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Chalpaka Encounter : చల్పాక ఎన్ కౌంటర్, అదే స్పాట్ 33 ఏళ్ల తరువాత రివేంజ్-అప్పుడు, ఇప్పుడు ఏడుగురే

Chalpaka Encounter : చల్పాక ఎన్ కౌంటర్, అదే స్పాట్ 33 ఏళ్ల తరువాత రివేంజ్-అప్పుడు, ఇప్పుడు ఏడుగురే

HT Telugu Desk HT Telugu
Dec 01, 2024 09:19 PM IST

Chalpaka Encounter : ములుగు జిల్లా చల్పాక ఫారెస్ట్ ఏరియాలో జరిగిన ఎన్ కౌంటర్ లో 7గురు మావోయిస్టులు హతమయ్యారు. 33 ఏళ్ల క్రితం మావోయిస్టుల దాడిలో ఈ ప్రాంతంలోనే 7గురు పోలీసులు మరణించారు. సరిగ్గా ఇప్పుడు ఏడుగురు మావోలు ఎన్ కౌంటర్ లో మరణించడంతో.... పోలీసులు రివేంజ్ తీసుకున్నారనే చర్చ జరుగుతోంది.

చల్పాక ఎన్ కౌంటర్, అదే స్పాట్ 33 ఏళ్ల తరువాత రివేంజ్-అప్పుడు, ఇప్పుడు ఏడుగురే
చల్పాక ఎన్ కౌంటర్, అదే స్పాట్ 33 ఏళ్ల తరువాత రివేంజ్-అప్పుడు, ఇప్పుడు ఏడుగురే

ములుగు జిల్లా చల్పాక ఎన్ కౌంటర్ తో పోలీసులు మావోయిస్టులపై రివేంజ్ తీర్చుకున్నారా? అంటే అవుననే చర్చ జరుగుతోంది. 33 ఏళ్ల కిందట మావోయిస్టులు మందు పాతర పేల్చడం.. అందులో ఏడుగురు పోలీస్ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం.. ఇప్పుడు సేమ్ అదే తీరుగా పోలీసులు ఏడుగురు మావోయిస్టులను ఎన్ కౌంటర్ చేయడం.. ఈ రెండు ఘటనల స్పాట్ కూడా చల్పాక ఫారెస్ట్ ఏరియానే కావడంతో ప్రతీకార దాడుల చర్చ నడుస్తోంది. మందు పాతర పెట్టి పోలీస్ జీపును పేల్చేసిన ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపగా.. ఇప్పుడు అదే ప్రాంతంలో ఏడుగురు మావోలు ఎన్ కౌంటర్ కావడం ఉమ్మడి వరంగల్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల కూడా ములుగు జిల్లా వాజేడు మండలంలో ఇద్దరు యువకులను ఇన్ ఫార్మర్ నెపంతో మావోయిస్టులు నరికి చంపగా, కొంతకాలంగా ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న పోలీసులు రివేంజ్ దాడులు మొదలు పెట్టారనే ప్రచారం జరుగుతోంది.

1991 జూన్ 12న మందు పాతర

ములుగు జిల్లా చల్పాక ఫారెస్ట్ ఏరియా సమీపంలో 1991, జూన్ 12వ తేదీన దారుణ ఘటన చోటుచేసుకుంది. రాజీవ్ గాంధీ హత్య అనంతరం జరిగిన లోక్ సభ ఎన్నికల సమయంలోనే ఈ ఘటన జరిగింది. లోక్ సభ ఎన్నికల కోసం చల్పాక వద్ద పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయగా.. జూన్ 12న ఇక్కడ పోలింగ్ జరగాల్సి ఉంది. కాగా అప్పటికే రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండగా, చల్పాక పోలింగ్ కేంద్రంలోని బ్యాలెట్ బాక్స్ లో మావోయిస్టులు సిరా పోశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందేలా చేసి, వారిని గ్రామానికి రప్పించే ప్రయత్నం చేశారు. దీంతో అప్పటి ఏటూరు నాగారం సీఐ సంతోష్ కుమార్, ఎస్సై కిషోర్ కుమార్, మరో ఐదుగురు సీఆర్పీఎఫ్ సిబ్బంది జీపులో చల్పాక గ్రామానికి బయలు దేరారు. అప్పటికే తమ పథకంలో భాగంగా పోలీసులు వచ్చే మార్గంలో మావోయిస్టులు భారీ మందు పాతర అమర్చారు. అనంతరం పోలీసు జీపు ఆ మార్గంలో స్పాట్ కు చేరుకోగానే మావోయిస్టులు మందు పాతర పేల్చేశారు. దీంతో ఏటూరు నాగారం సీఐ సంతోష్ కుమార్, ఎస్సై కిషోర్ కుమార్, ఐదుగురు సీఆర్పీఎఫ్ పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా ఏడుగురు పోలీస్ సిబ్బంది ప్రాణాలు కోల్పోగా.. ఈ ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది.

33 ఏళ్లు.. ఇప్పుడు అదే స్పాట్

1991 జూన్ 12న మందు పాతర పేలి ఏడుగురు పోలీసులు మృత్యువాత పడిన ఘటన జరిగి.. 33 ఏళ్లు పూర్తయ్యింది. ఇప్పుడు అదే చల్పాక సమీపంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎన్ కౌంటర్ జరగగా.. ఈసారి ఏడుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అందులో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కుర్సం మంగు అలియాస్ భద్రు అలియాస్ పాపన్న, జిల్లా కమిటీ సభ్యుడు ఏగోలపు మల్లయ్య అలియాస్ మధు అలియాస్ కోటి, ఏరియా కమిటీ సభ్యులు ముస్సాకి కరుణాకర్ అలియాస్ దేవల్, జమున, జైసింగ్, కిషోర్, కామేష్ హతమైన విషయం తెలిసిందే. దీంతో అప్పుడు ఏడుగురు పోలీసులు, ఇప్పుడు ఏడుగురు మావోయిస్టులు హతమవడం.. రెండు ఘటనల స్పాట్ కూడా చల్పాక ఫారెస్ట్ ఏరియానే కావడంతో పోలీసులు నాటి ఘటనకు రివేంజ్ తీర్చుకున్నారనే చర్చ జరుగుతోంది.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

Whats_app_banner

సంబంధిత కథనం