Sircilla District : తప్పుడు పత్రాలు సృష్టించి...! భూమి అక్రమ రిజిస్ట్రేషన్ - తహసీల్దార్ అరెస్ట్
సిరిసిల్ల జిల్లాలో భూమి అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన తహశిల్దార్ బాగోతం వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదుతో విచారణ జరిపిన చందుర్తి పోలీసులు… తహశిల్దార్ నరేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఒకరి భూమిని మరొకరికి తప్పుడు సమాచారంతో రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో తహశిల్దార్ పాపం పండింది. అక్రమంగా భూమి రిజిస్ట్రేషన్ చేసిన చందుర్తి తహశిల్దార్ గా పనిచేసిన ధర్పల్లి నరేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. భూమి అక్రమ రిజిస్ట్రేషన్ లో కీలక పాత్ర పోషించిన గుర్తించారు. తహశిల్దార్ నరేష్ ను కటకటాల వెనక్కి పంపించారు.
చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం…. చందుర్తి మండలం అనంతపల్లి గ్రామానికి చెందిన సలేంద్ర మల్లేశంకు సర్వే నెంబర్ 104, 105/అ, 105/అ/అ, 105/ఉ/అ, 105/ఊ నందు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మల్లేశం కు తెలియకుండా అదే గ్రామానికి చెందిన సలేంద్ర లక్ష్మి w/o గంగయ్య, సలేంద్ర వేణు s/o గంగయ్యకు తహశీల్దార్ ధర్పల్లి నరేష్ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశాడు.
గుట్టుచప్పుడు కాకుండా బోయినపల్లి మండలం అనంతపల్లికి సంబందించిన రిజిస్టర్ డాక్యుమెంట్ ద్వారా చందుర్తి మండలంలోని ఆనంతపల్లి భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశాడు. ధరణి పోర్టల్ లో తప్పుడు డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి బాధితుని పేరు మీద ఉన్న వ్యవసాయ భూమిని నిందితుల సలేంద్ర వేణు మరో ఐదుగురి ప్రోద్బలంతో దురుద్దేశంగా పట్టా మార్పిడి చేశాడు. బాధితుడు మల్లేశం పోలీసులను ఆశ్రయించగా తహశిల్దార్ బండారం బయటపడింది.
బాధితుడు మల్లేశం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకునే విచారణ చేపట్టగా విస్తు పోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఊరు పేరు సేమ్ ఉండడంతో చందుర్తి మండలానికి చెందిన తహసిల్దార్ నరేష్ మరో మండలానికి చెందిన రిజిస్టర్ డాక్యుమెంట్ ను సృష్టించి అక్రమంగా భూమి రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు నకిలీ డాక్యుమెంట్లు ధరణి ఫోటో అప్లోడ్ చేశాడు.
నకిలీ డాక్యుమెంట్స్ తో గత జులై 25న పంట రుణం సైతం పొందారు. బాధితుడు మల్లేశం ఫిర్యాదుతో ధరణి పోర్టల్ నుండి బ్యాక్ అండ్ డాటా తీసుకొని చూడగా ఎమ్మార్వో నరేష్ ఫేక్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశాడని, అక్రమంగా భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి సంపూర్ణంగా సహకరించాలని తేలినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
ఐదుగురిపై కేసు నమోదు..
ఒకరు భూమిని మరొకరి పేరు మీద మార్చేందుక నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన తహసిల్దార్ నరేష్ తో పాటు ఐదుగురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం తహసిల్దార్ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లో పని చేస్తుండగా అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. వేములవాడ కోర్టులో హాజరపర్చగా మెజిస్ట్రేట్ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. తహసిల్దార్ నరేష్ బాధితులు ఎవరైనా ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేయాలని సిఐ వెంకటేశ్వర్లు కోరారు.