ఈటల రాజేందర్ వ్యాఖ్యలు దురదృష్టకరం, ఆ నోటీసులతో హైడ్రాకు సంబంధం లేదు- ఏవీ రంగనాథ్-mp etela rajender remarks unfortunate bachupally mro notices unrelated to hydra says av ranganath ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ఈటల రాజేందర్ వ్యాఖ్యలు దురదృష్టకరం, ఆ నోటీసులతో హైడ్రాకు సంబంధం లేదు- ఏవీ రంగనాథ్

ఈటల రాజేందర్ వ్యాఖ్యలు దురదృష్టకరం, ఆ నోటీసులతో హైడ్రాకు సంబంధం లేదు- ఏవీ రంగనాథ్

బాచుపల్లి అపార్ట్మెంట్ వ్యవహారంలో హైడ్రాకు సంబంధంలేదని కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఎమ్మార్వో ఇచ్చిన నోటీసుల సంగతి హైడ్రాకు తెలియదన్నారు. జులై, 2024 ముందు నిర్మించిన భవనాల జోలికి హైడ్రా వెళ్లదని స్పష్టం చేశారు. బడా కబ్జాదారులపైనే హైడ్రా చర్యలు తీసుకుంటుందన్నారు.

ఈటల రాజేందర్ వ్యాఖ్యలు దురదృష్టకరం, ఆ నోటీసులతో హైడ్రాకు సంబంధం లేదు- ఏవీ రంగనాథ్

మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా బాచుపల్లి ఎమ్మార్వో ఇచ్చిన నోటీసులతో హైడ్రాకు సంబంధం లేదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అసలు ఈ విషయం గురించి తనకు కానీ హైడ్రా అధికారులకు గానీ తెలియదని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని మేడ్చల్ - మల్కాజ్ గిరి కలెక్టర్ తో కూడా మాట్లాడానని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు.

ప్రతీ కూల్చివేత హైడ్రా ఆపాదించడం సరికాదు

ఆ నోటీసులు ఎందుకు ఇచ్చారో ఎమ్మార్వోను అడగాలని కలెక్టర్ కోరినట్టు కమిషనర్ తెలిపారు. ప్రతీ నోటీస్ ను, ప్రతీ కూల్చివేతను హైడ్రాకు ఆపాదించి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేయడం దురదృష్టం అన్నారు. బడా భూ కబ్జాదారుల మీద హైడ్రా కఠినంగా ఉంటూ, సామాన్యులకు అండగా ఉంటుందన్నారు.

ఈటల రాజేందర్ మాటలు తప్పుదోవపట్టించేలా

కలెక్టర్ కి కూడా తెలియకుండానే బాచుపల్లి ఎమ్మార్వో నోటీసులు ఇచ్చారని మల్కాజిరి ఎంపీ ఈటల రాజేందర్ ఒకవైపు చెబుతూనే ఎంతో నిబద్ధతో పని చేస్తున్న హైడ్రాను దోషిగా నిలబెట్టాలని ప్రయత్నించడం దురదృష్టకరం అన్నారు. ఈటల రాజేందర్ మాటలు ప్రజలను తప్పుదోవ పట్టించేవిగానూ , అయోమయానికి గురిచేసేవిగా ఉన్నాయన్నారు.

హైడ్రా పనితీరుపై ప్రజల్లో అవగాహన

"హైడ్రా పనితీరుపై ప్రజల్లో స్పష్టమైన అవగాహన ఉన్న తరుణంలో ఈటల రాజేందర్ లాంటి వారు హైడ్రాపై ఆరోపణలు చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేయడం సబబు కాదు. సచివాలయంలో ఈటల రాజేందర్ కలిసినప్పుడు కూడా హైడ్రా కార్యకలాపాలపై చర్చ వస్తే స్పష్టంగా వివరించాను.

జులై, 2024 కంటే ముందు కట్టిన నివాసాల జోలికి హైడ్రా వెళ్ళదని స్పష్టం చేశాను. అనుమతులు తీసుకున్న వాణిజ్య సముదాయాలను కూడా హైడ్రా తొలగించదు. పేదలు, సామాన్యులను హైడ్రా ఇబ్బంది పెట్టదు" -ఏవీ రంగనాథ్

హైడ్రా పని తీరుపైన ప్రజలు ఎంతో స్పష్టతతో ఉన్నారని... అనవసరమైన ఆరోపణలు చేసి అయోమయానికి ఎవరినీ గురి చేయ వద్దని హైడ్రా కమిషనర్ కోరారు.

పూజిత అపార్ట్మెంట్ కు నోటీసులు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని పూజిత అపార్ట్‌మెంట్ కూల్చివేతకు ఎమ్మార్వో నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పూజిత అపార్ట్‌మెంట్ వ‌ద్దకు చేరుకున్న ఆయన... బాధితుల‌కు భ‌రోసా క‌ల్పించారు. అపార్ట్‌మెంట్‌ను కూల్చివేస్తామని నోటీసులు ఇవ్వడంపై మండిపడ్డారు.

ఈటల రాజేందర్ తీవ్రవ్యాఖ్యలు

"ఈ ప్రభుత్వం ఇంకా ఎన్నో రోజులు ఉండ‌దు. ఇది తుగ్లక్ ప్రభుత్వం. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడితే ఖబడ్దార్. నా కొడకా...రేవంత్ శాడిస్ట్, సైకో కాబ‌ట్టే ప్రజ‌ల్ని ఏడిపిస్తున్నాడు. నువ్వు సైకో కాబ‌ట్టే ఎవరు చెప్పినా అస్సలు వినడం లేదు. సీఎం ప్రజల కష్టాలు తెలుసుకోవాలి. ఇలాంటి పిచ్చి వేషాలు మానుకో రేవంత్ రెడ్డి"- ఎంపీ ఈటల రాజేందర్

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం