కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు - ఈటల రాజేందర్ చెప్పిన విషయాలివే-mp etela rajender appears before kaleshwaram commission ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు - ఈటల రాజేందర్ చెప్పిన విషయాలివే

కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు - ఈటల రాజేందర్ చెప్పిన విషయాలివే

కాళేశ్వరం కమిషన్ విచారణకు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. కమిషన్ ప్రస్తావించిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. విచారణ ముగిసిన తర్వాత ఈటల మీడియాతో మాట్లాడారు. అన్నీ కేబినెట్‌ నిర్ణయం మేరకే జరిగాయని చెప్పారు. డిజైన్లు, సాంకేతిక సమస్యలతో ఆర్థికశాఖకు సంబంధం లేదని చెప్పినట్లు తెలిపారు.

కాళేశ్వరం కమిషన్ విచారణకు ఈటల హాజరు

కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇవాళ మాజీ మంత్రి, ప్రస్తుతం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విచారణకు హాజరయ్యారు. దాదాపు 20 నిమిషాలకుపైగా ఆయన్ను కమిషన్ విచారించింది. ప్రాజెక్ట్ కు సంబంధించిన పలు అంశాలపై ప్రశ్నలను సంధించింది. కమిషన్ అడిగిన ప్రశ్నలకు ఈటల సమాధానాలు ఇచ్చారు.

కేబినెట్‌ నిర్ణయం మేరకే…

విచారణ ముగిసిన తర్వాత ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర జల సంఘం, మహారాష్ట్ర అభ్యంతరాలతో ప్రాజెక్టును తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చినట్లు కమిషన్ కు చెప్పానని వెల్లడించారు. అంతేకాకుండా కమిషన్ ఎదుట చెప్పిన విషయాలను ఈటల వివరించారు.

కాళేశ్వరం విషయంలో అన్నీ కేబినెట్‌ నిర్ణయం మేరకే జరిగాయని ఈటల రాజేందర్ అన్నారు. బ్యారేజీల నిర్మాణ ప్రదేశాలు ఎందుకు మార్చారని కమిషన్ అడిగిన ప్రశ్నకు… ఆ సాంకేతిక అంశాలపై తమకు అవగాహన ఉండదని చెప్పినట్లు తెలిపారు. కాళేశ్వరం మొదట రూ.63 వేల కోట్లతో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని.. ఆ తర్వాత రూ.83 వేల కోట్లకు పెరిగిందని చెప్పారు. ఇప్పుడు ఎంత ఖర్చైందో తనకు తెలియదని… కేబినెట్‌ నిర్ణయాల మేరకే నిధులు ఇచ్చామని వివరించారు.

డిజైన్లు, సాంకేతిక సమస్యలతో ఆర్థిక శాఖకు సంబంధం ఉండదని ఈటల చెప్పుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిధుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటైందని… వారే నేరుగా బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకున్నారని చెప్పారు. ఆ విషయంలో ఆర్థిక శాఖకు సంబంధం లేదన్నారు. ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ కు ఆర్థిక ఖాతా ఉంటుందని… వాళ్లే అవన్నీ చూసుకుంటారని చెప్పారు. అకౌంట్, అడిట్ సెకన్లు ప్రతి అంశాన్ని చూసుకుంటాయని వివరించారు. ఆర్థిక శాఖ నుంచి బడ్దెట్ కేటాయింపులు మాత్రమే ఉంటాయన్నారు.

నిజమే చెబుతాను - ఈటల రాజేందర్

“ నా కణిత మీద తుపాకీ పెట్టిన నిజమే చెబుతాను. కొందరి మాటలు చూస్తుంటే బాధ అనిపిస్తోంది. తప్పు చేసిన వాళ్లను విచారించాలి. బట్టకాల్చి మీద వేస్తానంటే సహించేది లేదు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులకు సంబంధించిన విచారణ రిపోర్టలన్నీ బయటపెట్టాలి. ఆలస్యం చేస్తూ… రాజకీయ పబ్బం గడపవద్దు. కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే ఏడాదిన్నర సమయం దాటింది. తక్షణమే రిపోర్ట్ బయటపెట్టి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను” అని ఈటల చెప్పారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.