TSRTC Buses to Odisha : టిఎస్‌ఆర్టీసి నుంచి ఒడిశాకు బస్సులు
TSRTC Buses to Odisha విశ్వనగరంగా మారిన హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో ఒడిశా వాసులు నివసిస్తుండటంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థతో తెలంగాణ ఆర్టీసీ ఒప్పందం చేసుకుంది. రెండు రాష్ట్రాల మధ్య రవాణా సదుపాయాలను మెరుగు పరిచేందుకు కొత్త సర్వీసుల్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాయి.
TSRTC Buses to Odisha తెలంగాణ, ఒడిశాల మధ్య ఆర్టీసీ బస్సులు పరుగులు తీయనున్నాయి. హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో ఒడిశా ప్రజలు నివసిస్తుండటంతో వారి కోసం ఆర్టీసి ప్రత్యేక సర్వీసుల్ని ప్రవేశపెట్టాలని రెండు రాష్ట్రాలు నిర్ణయించాయి.
ఇకపై తెలంగాణ బస్సులు ఒడిశాకు రాకపోకలు సాగించనున్నాయి. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, భద్రాచలం నుంచి ఒడిశాలోని వివిధ ప్రాంతాలకు బస్సులు నడిపేలా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, ఒడిశా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల మధ్య బుధవారం ఒప్పందం జరిగింది.
టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో సంస్థ తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఓఎస్‌ఆర్టీసీ ఎండీ దిప్తేష్‌కుమార్ పట్నాయక్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. హైదరాబాద్ బస్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఒప్పంద పత్రాలపై ఇరు రాష్ట్రాల తరపున సంతకాలు చేశారు.
తాజా ఒప్పందం ప్రకారం.. తెలంగాణ ఆర్టీసీ 10 బస్సులను ఒడిశాకు నడుపుతుంది. ఒడిశా ఆర్టీసీ 13 సర్వీస్‌లను తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు నడపనుంది. రెండు రాష్ట్రాల మధ్య నడిచే బస్సు సర్వీసుల్లో హైదరాబాద్-జయపుర మధ్య రెండు బస్సులు ఉంటాయి. ఖమ్మం-రాయగడ రెండు సర్వీసులు, భవానీపట్న-విజయవాడ వయా భద్రాచలం మధ్య రెండు సర్వీసులు, భద్రాచలం-జయపుర మధ్య నాలుగు సర్వీసులను టీఎస్‌ఆర్టీసీ నడపుతుంది.
నవ రంగ్‌పూర్ - హైదరాబాద్ మధ్య నాలుగు సర్వీసులు, జయపుర-హైదరాబాద్ రెండు సర్వీసులు, భవానిపట్న-విజయవాడ వయా భద్రాచలం రెండు సర్వీసులు, రాయగడ - కరీంనగర్ రెండు సర్వీసులు, జయపుర-భద్రాచలం మధ్య మూడు సర్వీసులను ఓఎస్‌ఆర్టీసీ నడపనుంది. తెలంగాణ - ఒడిశా మధ్యలో ప్రయాణికులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారని విద్యా ఉపాధి కోసం పెద్ద సంఖ్యలో రాకపోకలు జరుగుతున్నాయని అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో ఓఎస్‌ఆర్టీసీతో అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకున్నామని ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు.
టాపిక్