Hyderabad ORR : అధ్వాన్నంగా హైదరాబాద్ ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్వహణ.. వాహనదారులు ఆగమాగం!-motorists face difficulties due to poor maintenance of hyderabad outer ring road ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Orr : అధ్వాన్నంగా హైదరాబాద్ ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్వహణ.. వాహనదారులు ఆగమాగం!

Hyderabad ORR : అధ్వాన్నంగా హైదరాబాద్ ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్వహణ.. వాహనదారులు ఆగమాగం!

Hyderabad ORR : ఔటర్ రింగ్ రోడ్డు.. హైదరాబాద్ నగరానికి మణిహారం. నగరంలో ట్రాఫిక్ తగ్గించి, సాఫీగా వెళ్లేందుకు దీన్ని నిర్మించారు. గతంలో హెచ్ఎండీఏ పర్యవేక్షణలో ఉన్నప్పుడు బాగుండేది. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. ఫలితంగా నిత్యం వేలాదిమంది వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

హైదరాబాద్ ఔటర్‌ రింగ్‌ రోడ్డు

హైదరాబాద్ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ప్రయాణం.. రోజురోజుకూ ప్రమాదకరంగా మారుతోంది. స్పీండ్ కంట్రోల్, ఇతర సమాచారం తెలిపే డిజిటల్‌ సైన్‌ బోర్డులు పని చేయడం లేదు. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ లైన్లలో ఏ వాహనాలు వెళ్లాలో తెలియక.. ప్రమాదాలకు గురవుతున్నారు. అయినా సంబంధింత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.

158 కిలో మీటర్ల మేర..

హైదరాబాద్ మహానగరం చుట్టూ.. 158 కిలో మీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్డు ఉంది. దీని పర్యవేక్షణ బాధ్యత గతంలో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఉండేది. ఆ తర్వాత ప్రైవేటు సంస్థకు 30 ఏళ్లపాటు బీఆర్ఎస్ ప్రభుత్వం లీజుకిచ్చింది. దీనిపై ప్రస్తుతం నిత్యం ఒకటిన్నర లక్షల వాహనాలు ప్రయాణిస్తున్నాయి. నెలకు దాదాపు రూ.70 కోట్ల వరకు టోల్‌ వసూలవుతోంది. అయినా నిర్వహణ సక్రమంగా లేదనే విమర్శలు ఉన్నాయి.

వాహనదారులకు తెలిసేలా..

8 వరుసలతో ఈ రోడ్డు ఉండగా.. మధ్య నుంచి తొలి 2 వరుసల్లో 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు వెళ్లాలి. తర్వాత రెండు లైన్లలో 80 కిలోమీటర్ల వరకే వేగ పరిమితి ఉంది. ఈ సమాచారాన్ని వాహనదారులకు తెలిసేలా గతంలో రోడ్డు మధ్యలో సైన్‌ బోర్డులు ఏర్పాటు చేశారు. అలాగే.. వచ్చే ఇంటర్‌ఛేంజ్‌ పేరు, ఎక్కడ దిగితే ఎటువైపు వెళ్లొచ్చు వంటి సమాచారం ఇందులో పొందుపర్చారు.

పనిచేయడం లేదు..

రాత్రి సమయంలో కనిపించేలా ఫ్లడ్‌లైట్లు అందుబాటులోకి తెచ్చారు. స్పీడ్ కంట్రోల్ కోసం పోలీసుల ఆధ్వర్యంలో పహారా ఉంది. కానీ.. చాలా ప్రాంతాల్లో సైన్‌ బోర్డులు పనిచేయడం లేదు. భారీ వాహనాలు తొలి రెండు లైన్లలోకి వచ్చేస్తున్నాయి. ఫలితంగా తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. స్పీడ్‌ గన్ల వ్యవస్థ నామ మాత్రంగానే ఉంది. ఎక్కడపడితే అక్కడ రోడ్డుపక్కన భారీ వాహనాలు నిలిపేస్తున్నారు. ఈ కారణంగా వెనుక నుంచి వేగంగా వస్తున్న వాహనాలు.. దగ్గరకు వచ్చే వరకు అవి కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి.

నిర్వహణపై పర్యవేక్షణ ఏది..

8 లైన్లతో ఈ రింగ్ రోడ్డు నిర్మించినా.. వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. అప్పుడప్పుడు ఫాస్టాగ్‌ పనిచేయక టోల్‌బూత్‌ల వద్ద వాహనాలు నిలిచిపోతున్నాయి. 3 సెకన్లలోపే స్కానింగ్‌ ప్రక్రియ పూర్తి కావడం లేదు. దీంతో వెనక వచ్చే వాహనాలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా దీని నిర్వహణపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని వాహనదారులు కోరుతున్నారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఉన్నప్పుడే నిర్వహణ బాగుండేదని చెబుతున్నారు.

Basani Shiva Kumar

TwittereMail
బాసాని శివకుమార్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. గతంలో ఈనాడు, ఈటీవీ భారత్, టీవీ9 తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంలో పని చేశారు. 2025లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.