ప్రేమ వ్యవహారంలో తల్లీకొడుకులపై కత్తులు, గొడ్డళ్లతో హత్యాయత్నం.. వరంగల్ నగరంలో ఘోరం-mother and son targeted in violent assault with knives and axes amid love affair tragedy in warangal city ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ప్రేమ వ్యవహారంలో తల్లీకొడుకులపై కత్తులు, గొడ్డళ్లతో హత్యాయత్నం.. వరంగల్ నగరంలో ఘోరం

ప్రేమ వ్యవహారంలో తల్లీకొడుకులపై కత్తులు, గొడ్డళ్లతో హత్యాయత్నం.. వరంగల్ నగరంలో ఘోరం

HT Telugu Desk HT Telugu
Jun 17, 2024 07:04 PM IST

వరంగల్ నగరంలో ఘోరం జరిగింది. ఓ యువకుడు తమ సమీపంలో ఉండే ఓ యువతిని కొంతకాలంగా ప్రేమిస్తుండగా, అది నచ్చని యువతి కుటుంబ సభ్యులు యువకుడితో పాటు అతని తల్లిపై కత్తులు, గొడ్డళ్లతో హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో యువకుడు త్రుటిలో తప్పించుకోగా, అతడి తల్లి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైంది.

వరంగల్లులో తల్లీకొడుకులపై హత్యాయత్నం
వరంగల్లులో తల్లీకొడుకులపై హత్యాయత్నం (HT_PRINT)

వరంగల్ కీర్తినగర్ లో జరిగిన హత్యాయత్నం స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ నగరంలోని కీర్తి నగర్‌కు చెందిన అద్వాన్ అలీ ఎంబీఏ చదువుతున్నాడు. అతని తండ్రి ఎజాత్ అలీ మూడు సంవత్సరాల కిందటే మృతి చెందగా, తల్లి సమీనా స్థానికంగా టైలరింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తోంది. ఇదిలా ఉంటే వరంగల్ లో ఓ కాలేజీలో ఎంబీఏ చదువుతున్న అద్వాన్ అలీ, అదే కాలనీకి చెందిన యువతి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం స్థానికంగా ప్రచారం జరగడంతో యువతి తండ్రి యూసెఫ్ షరీఫ్ కొంతకాలం కిందటే హనుమకొండకు వచ్చి నివాసం ఉంటున్నారు.

కత్తులు, గొడ్డళ్లతో దాడి

అద్వాన్ అలీ ప్రేమ వ్యవహారం నచ్చక యువతి తల్లిదండ్రులు పలుమార్లు అతడిని మందలించారు. అయినా అద్వాన్ అలీ తీరు మార్చుకోవడం లేదనే ఉద్దేశంతో అతడిపై కోపం పెంచుకున్నారు. ఈ క్రమంలోనే ఎలాగైనా అతడిని హతమర్చాలని నిర్ణయించుకున్నారు. తమ ప్లాన్ లో భాగంగానే ఆదివారం రాత్రి యువతి తండ్రి యూసెఫ్ షరీఫ్, తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ ఆటోలో వరంగల్ కీర్తి నగర్ కు వచ్చాడు.

అద్వాన్ అలీ కోసం అతడి ఇంటి సమీపంలో కాపు కాశారు. కొద్ది సేపటికి అతడు బైక్ పై ఇంటికి రావడాన్ని గమనించిన యూసెఫ్ షరీఫ్, అతడి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా అద్వాన్ అలీపై దాడికి దిగారు. కత్తులు, గొడ్డళ్లతో అతడిని హత మార్చేందుకు దాడికి పాల్పడ్డారు. దీంతో అద్వాన్ అలీ కేకలు వేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేయగా, గమనించిన అతని తల్లి సమీనా దాడికి పాల్పడుతున్న వారిని అడ్డుకునే ప్రయత్నం చేసింది.

అప్పటికే ఆవేశంలో ఉన్న యూసెఫ్ షరీఫ్, అతడి కుటుంబ సభ్యులు మారణాయుధాలతో ఆమెపైనా దాడికి దిగారు. ఆమె చేతిపై కత్తులు, గొడ్డళ్లతో నరకడంతో చేతి భాగంలో తీవ్ర గాయాలై రక్త స్రావం జరిగింది. అప్పటికే చుట్టుపక్కల ఉన్న వాళ్లంతా గుమిగూడటం, స్థానికులు తిరగబడే ప్రయత్నం చేయడంతో యువతి కుటుంబ సభ్యులు అక్కడి నుంచి పరారయ్యారు.

పోలీసుల అదుపులో నిందితులు!

యువతి కుటుంబ సభ్యుల దాడిలో సమీనా తీవ్రంగా గాయపడగా, అద్వాన్ అలీ త్రుటిలో చావు నుంచి తప్పించుకున్నారు. ఆయన ఛాతి భాగంలో కత్తి గాటు పడగా, స్థానికులు వెంటనే 108 కు సమాచారం అందించారు. అనంతరం అంబులెన్స్ లో అద్వాన్ అలీతో పాటు అతని తల్లి సమీనాను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

కాగా స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అద్వాన్ అలీ మేనమామ నయీం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలాఉంటే దాడికి పాల్పడిన యువతి కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. యువతి తండ్రితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. కాగా అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న కీర్తి నగర్ లో ఒక్కసారిగా కత్తులు, గొడ్డళ్లతో హత్యాయత్నం జరగగా, స్థానికంగా తీవ్ర కలకలం మొదలైంది.

(రిపోర్టింగ్: హిందూస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

WhatsApp channel