Medak tragedy: కోడలి మరణంతో ఊరంతా దూరం.. ఒంటరితనం భరించలేక తల్లీకూతుర్లు ఆత్మహత్య
Medak tragedy: మెదక్ జిల్లాలో విషాదం జరిగింది. కోడలి మరణం తర్వాత ఊరంతా దూరం పెట్టడంతో.. ఒంటరితనం భరించలేక తల్లీకూతుళ్లు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా చేగుంట మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన తలారి ఎల్లవ్వ(70) కు కూతురు పోచమ్మ(50), కుమారుడు ముత్యం ఉన్నారు. ఎల్లవ్వ కుమారుడు ముత్యంకి మక్కరాజుపల్లి గ్రామానికి చెందిన లావణ్యతో వివాహం జరిపించారు. కూతురు పోచమ్మ భర్తతో విడిపోయి తల్లిగారింట్లోనే ఉంటుంది. ఈ క్రమంలో ఆరు నెలల కిందట కోడలు లావణ్య.. బావిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
అయితే లావణ్య మృతికి అత్త ఎల్లవ్వ, ఆడపడచు పోచమ్మ, భర్త ముత్యం కారణం అంటూ.. లావణ్య తల్లితండ్రులు, బంధువులు పోలీసులకు పిర్యాదు చేశారు. ఎల్లవ్వ, ముత్యంతో పాటు ఆడపడచు పోచవ్వపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముత్యం జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. ఆ తర్వాత ముత్యం తన పిల్లలతో కలిసి బతుకుదెరువు కోసం హైదరాబాద్ నగరానికి వెళ్లాడు.
ఒంటరితనం భరించలేక..
తల్లీకూతుర్లు ఎల్లవ్వ, పోచమ్మ ఇద్దరే రెడ్డిపల్లి గ్రామంలో నివసిస్తున్నారు. లావణ్య కేసులో ముత్యం జైలుకు వెళ్లి వచ్చినప్పటి నుంచి వీరితో ఇరుగుపొరుగు వారు మాట్లాడటం లేదు. ఎవ్వరూ మాట్లాడకపోవడంతో.. బాధపడేవారు. ఆ ఒంటరితనం భరించలేక.. మంగళవారం రాత్రి ఇద్దరు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం తెల్లవారినా తలుపులు తీయకపోవడంతో గమనించిన చుట్టుపక్కల వారు.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుమారుడు ముత్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మెదక్‌లో మరో ఘటన..
భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలతో మనస్తాపం చెందిన మహిళ.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాల గ్రామంలో జరిగింది. బోనాల గ్రామానికి చెందిన బండారి బుచ్చమ్మ (65) భర్త మల్లేశం వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం భర్త మల్లేశానికి, బుచ్చమ్మకు పొలం పనుల విషయంలో గొడవ జరిగింది. మనస్తాపం చెందిన బుచ్చమ్మ మంగళవారం రాత్రి పురుగుల మందు తాగింది. ఇది గమనించిన భర్త వెంటనే ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుచ్చవ్వ బుధవారం మృతి చెందింది.
రిపోర్టింగ్ - ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు