TG Aarogyasri Scheme : మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందా.. అయితే ఈ సమాచారం మీకోసమే.. 8 ముఖ్యమైన అంశాలు
TG Aarogyasri Scheme : తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీపై మరింత ఫోకస్ పెట్టింది. ఆరోగ్యశ్రీ విషయంలో త్వరలోనే కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ముఖ్యంగా.. ఈ పథకం కింద చికిత్స అందించే ఆసుపత్రుల సంఖ్యను పెంచే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి 8 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఎంతో ఉపయోగపడుతోంది. దీంతో ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిధిని పెంచడానికి చర్యలు తీసుకుంటోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక.. రూ. 5 లక్షలు ఉండే చికిత్స పరిమితిని.. రూ. 10 లక్షలకు పెంచారు. తాజాగా.. మరింత బలోపేతం చేసేందుకు అడుగులు వేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరిన్ని ఆస్పత్రులను తీసుకొచ్చే దీశగా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి 8 ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి.
1.త్వరలో తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆరోగ్యశ్రీ కింద చికిత్సకు గతేడాది వరకు రూ.5 లక్షల వరకు పరిమితి ఉండేది. రేవంత్ సీఎం అయిన తర్వాత దీన్ని రూ.10 లక్షల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
2.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి బడ్జెట్‌ను 50 శాతం అదనంగా పెంచారు. దీంతో మొత్తంగా రూ.1433.73 కోట్లకు చేరింది.
3.2024 ఏడాది జులైలో 1375 వైద్య చికిత్సల ధరలను 20 శాతం పెంచారు. అంతేకాకుండా మరో 163 రకాల చికిత్సలను కలిపారు. దీంతో ఈ పథకం కింద అందించే చికిత్సల సంఖ్య 1835 వరకు పెరిగింది.
4.తెలంగాణలో త్వరలో ఆరోగ్యశ్రీ కింద ఉన్న ఆసుపత్రుల సంఖ్యను వంద నుంచి 150 వరకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం పథకం కింద ఉన్న ఆసుపత్రుల సంఖ్య 371 ఉందని అధికారులు చెబుతున్నారు. పెండితే.. 500 కు పైగా ఆస్పత్రులు అవుతాయి.
5.ఆస్పత్రుల సంఖ్యను పెంచితే.. పేదలకు చికిత్స మరింత సులభంగా అందనుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పుడు ఎంపానెల్ట్ ఆసుపత్రులన్నింటిలో సత్వర చికిత్స అందించడమే కాకుండా చిన్న చిన్న పట్టణాల్లో ఉన్న 30 నుంచి 50 పడకల ప్రైవేటు ఆసుపత్రులను అనుసంధానం చేయాలని భావిస్తోంది.
6.నెట్‌వర్క్ ఆసుపత్రుల పెంపుతోపాటు ప్రొసీజర్లను కూడా పెంచేందుకు రేవంత్ రెడ్డి సర్కారు కసరత్తు చేస్తోంది. ఒక రోగికి స్టెంట్ వేస్తే ఒకే ప్రొసీజర్ కింద కాకుండా.. అందులో భాగంగా చేసే రక్త పరీక్షలు, ఇతర కీలక పరీక్షలను కూడా చేర్చాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.
7.ఒక జబ్బుకు చికిత్స అందిస్తే దానికి సంబంధించిన అన్ని రకాల పరీక్షలు, మందులు కూడా ఈ పథకం కింద వచ్చేలా చేయడానికి రేవంత్ సర్కారు అడుగులు వేస్తోంది.
8.ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ కింద అందించే చికిత్సల్లో ఎక్కువ ప్రొసీజర్లు పాటిస్తున్నారు. దీంతో అక్కడ అధ్యయనం చేసి తెలంగాణలో అమలు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగిదే.. పేదలకు మరింత లాభం జరగనుంది.