Teenmar Mallanna : బీసీల కోసం మాట్లాడితే షోకాజ్ నోటీసులు ఇస్తారా.. తీన్మార్ మల్లన్న ఫైర్!-mlc teenmaar mallanna responds to congress party show cause notices ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Teenmar Mallanna : బీసీల కోసం మాట్లాడితే షోకాజ్ నోటీసులు ఇస్తారా.. తీన్మార్ మల్లన్న ఫైర్!

Teenmar Mallanna : బీసీల కోసం మాట్లాడితే షోకాజ్ నోటీసులు ఇస్తారా.. తీన్మార్ మల్లన్న ఫైర్!

Basani Shiva Kumar HT Telugu
Published Feb 07, 2025 11:24 AM IST

Teenmar Mallanna : టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ.. తీన్మార్ మల్లన్నకు షోకాజ్‌నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై ఆయన స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల కోసం మాట్లాడితే షోకాజ్ నోటీసులు ఇస్తారా అని ప్రశ్నించారు. బీసీ సమాజంతో మాట్లాడి నోటీసులపై సమాధానం ఇస్తానని స్పష్టం చేశారు తీన్మార్ మల్లన్న.

తీన్మార్ మల్లన్న
తీన్మార్ మల్లన్న

తెలంగాణ కాంగ్రెస్‌లో.. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. కులగణనపై ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇవ్వాలని.. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్‌నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై తాజాగా ఆయన ఘాటుగా స్పందించారు. కులగణనపై మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్లన్న చేసిన కామెంట్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది కాంగ్రెస్‌గా మారాయి.

సర్కార్ క్లియర్‌గా లేదు..

'బీసీల కోసం మాట్లాడితే షోకాజ్ నోటీసులు ఇస్తారా.. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించడం తప్పు అంటున్నారు.. యూపీఏ ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు చేశారు. కులగణనలో ఉన్న వ్యక్తులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలి. కాంగ్రెస్ క్లియర్‌గా ఉంది. కానీ.. సర్కార్ క్లియర్‌గా లేదు. నివేదికను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. కొందరు నేతలు బీసీలను పార్టీకి దూరం చేస్తున్నారు. బీసీలను అణచివేయాలని చూస్తున్నారు. షోకాజ్‌ నోటీసులపై ఈనెల 12లోగా ఆలోచిస్తా. బీసీ సమాజంతో మాట్లాడి నోటీసులపై సమాధానం ఇస్తా' అని మల్లన్న స్పష్టం చేశారు.

పార్టీ నిబంధనల మేరకు..

కులగణనపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి.. ఫిబ్రవరి 12వ తేదీలోపు వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ స్పష్టం చేసింది. షోకాజ్ నోటీసులకు స్పందించకపోతే.. కాంగ్రెస్ పార్టీ నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ఆయన నోటీసులపై స్పందించారు. ఇటీవలే వరంగల్ వేదికగా బీసీల సభను నిర్వహించారు. ఇందులో మాట్లాడిన తీన్మార్ మల్లన్న ఓ కులాన్ని ఉద్దేశిస్తూ.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

బీసీలను మోసం చేసేలా..

కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా కులగణనను చేపట్టింది. దీనికి సంబంధించి నివేదికను ఇటీవలే విడుదల చేసింది. దీనిపై అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించింది. ఈ నివేదికలో పేర్కొన్న వివరాలపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన కామెంట్స్ చేశారు. బీసీలను మోసం చేసేలా కుల గణన లెక్కలు ఉన్నాయని ఆరోపించారు. కుల గణన పూర్తిగా బోగస్ అని విమర్శించారు. ఇది జానారెడ్డి సర్వే అంటూ.. హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ చేసిన సర్వేనే 100 శాతం కరెక్ట్ అని వ్యాఖ్యానించారు. బీసీ కులగణన రిపోర్టును తగలబెట్టాలని పిలుపునిచ్చారు.

బీఆర్ఎస్‌కు ఆయుధంగా..

మల్లన్న చేసిన ఈ కామెంట్స్.. బీఆర్ఎస్‌కు ఆయుధంగా మారాయి. కలగణన నివేదికపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మల్లన్న వ్యాఖ్యలను గుర్తుచేశారు. సొంత పార్టీ వారే ఈ సర్వేను తప్పుబడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో చేసిన సర్వేనే ప్రజలు, కాంగ్రెస్ నాయకులు కూడా నమ్ముతున్నారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. మల్లన్నకు నోటీసులు ఇచ్చింది.

Whats_app_banner