Mlc Nominaions: ఉత్తర తెలంగాణలో జోరుగా ఎమ్మెల్సీ నామినేషన్లు, 4 రోజుల్లో 28 మంది నామినేషన్లు…
Mlc Nominaions: ఉత్తర తెలంగాణలో పట్టభద్రుల, టీచర్స్ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జోరుగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. నాలుగు రోజుల్లో 28 మంది నామినేషన్ లు దాఖలు చేశారు. కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల స్థానానికి 21 మంది, టీచర్ల స్థానానికి ఏడుగురు నామినేషన్లు దాఖలు చేశారు.

Mlc Nominaions: ఉత్తర తెలంగాణలో కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల, టీచర్ల రెండు ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం 15 మంది నామినేషన్ లు దాఖలు చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ లో నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ పమేలా సత్పతికి అందజేశారు.
పట్టభద్రుల స్థానానికి 12 మంది, టీచర్ల ఎమ్మెల్సీ స్థానానికి ముగ్గురు నామినేషన్ లు దాఖలు చేశారు. టీచర్ల ఎమ్మెల్సీ స్థానానికి బిజెపి అభ్యర్థి మల్క కొమరయ్య నామినేషన్ దాఖలు చేశారు. బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి తపస్ ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులతో కలిసి కొమరయ్య నామినేషన్ దాఖలు చేశారు.
అభ్యర్థుల నుంచి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి నామినేషన్లు స్వీకరించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి మెదక్ జిల్లా టేకుమల్ మండలం ఎల్లుపేట గ్రామానికి చెందిన మామిడి సుధాకర్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం న్యూ మల్కాపూర్ కు చెందిన వై. అశోక్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు.
పట్టభద్రుల స్థానానికి...
పట్టభద్రుల స్థానానికి సంగారెడ్డి జిల్లా కంది మండలానికి చెందిన లంటు చంద్రశేఖర్, కరీంనగర్ లోని విద్యానగర్ కు చెందిన యాదగిరి శేఖర్ రావు తరఫున పచ్చునూరి సురేందర్, మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన మేకల అక్షయ్ కుమార్, నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం చిట్టాపూర్ కు చెందిన అబ్బగోని అశోక్ గౌడ్, నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన దేవతి శ్రీనివాస్, నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పెరుందేవి గూడానికి చెందిన రైకల సైదులు నామినేషన్లు వేశారు.
గిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం గుండంపల్లికి చెందిన గుయ్యసాయి కృష్ణమూర్తి, కరీంనగర్ చెందిన ఎడ్ల సాయి కృష్ణప్రియ, సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన దొడ్ల వెంకటేశం, మంచిర్యాల జిల్లా తిరుమలగిరి కాలనీకి చెందిన కొమిరెడ్డి మహేష్, నిజామాబాద్ కు చెందిన గడ్డం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కొసునూరు పల్లికి చెందిన వేముల విక్రమ్ రెడ్డి నామినేషన్ వేశారు. ఇదివరకే నామినేషన్ వేసిన ఆదిలాబాద్ జిల్లా యాపల్ గూడాకు చెందిన మంచికట్ల ఆశమ్మ మరో రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. అదే విధంగా మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడేనికి చెందిన కంటే సాయన్న మరో సెట్ నామినేషన్ సమర్పించారు.
కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా ఆశమ్మ నామినేషన్...
కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా అదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసిన ఆశమ్మ, గురువారం కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు.
నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ పమేలా సత్పతి అప్పగించారు. 30 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నానని ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నానని ఆశమ్మ తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిగా అధిష్టానం ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పేరును ప్రకటించింది.
బీ ఫామ్ సీఎం చేతుల మీదుగా నరేందర్ రెడ్డి అందుకున్నారు. శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. నలుగురు మంత్రులతో కలిసి 10న భారీ ర్యాలీతో మరో సెట్ నామినేషన్ వేయనున్నట్లు నరేందర్ రెడ్డి ప్రకటించారు. తాజాగా కాంగ్రెస్ రెబల్గా ఆశమ్మ నామినేషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
విద్యాసంస్థల అధినేతగా సమస్యల పరిష్కరిస్తా...
విద్యాసంస్థల అధినేతగా టీచర్స్ సమస్యలపై అవగాహన ఉందని తెలిపారు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ బిజెపి అభ్యర్థి గా నామినేషన్ దాఖలు చేసిన మల్క కొమురయ్య. సిపిఎస్ రద్దుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హెల్త్ కార్డుల సమస్య తీవ్రంగా ఉందని, పెండింగ్ లో ఉన్న పిఆర్సీ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు. టీచర్స్ సమస్యల తోపాటు విద్యా సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గం చూపుతానని తెలిపారు.
శుక్రవారం భారీగా నామినేషన్లు...
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు. శుక్రవారం మంచి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, బిజెపి పట్టభద్రుల అభ్యర్థి అంజిరెడ్డి నామినేషన్ వేయనున్నారు.
అదేవిధంగా కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ ప్రసన్న హరికృష్ణ స్వతంత్ర అభ్యర్థిగా భారీ ర్యాలీతో నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ వేయడానికి ఇక రెండు రోజులు మాత్రమే గడువు ఉండడంతో శుక్రవారం, సోమవారం పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)
సంబంధిత కథనం