దళితుల బట్టలు విప్పి అరెస్టు చేసేంత ధైర్యం పోలీసులకు ఎవరిచ్చారు? ఎవరి దన్ను చూసుకొని పోలీసులు విర్రవీగుతున్నారు? అని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ జయంతి రోజున దళితులపై ఇంతటి కర్కశత్వమా.. అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అమలవుతున్నది అంబేద్కర్ రాజ్యాంగమా.. అనుముల రేవంత్ రెడ్డి రాజ్యాంగమా? అని కవిత ప్రశ్నించారు. దళితులను అవమానించడమే ప్రజా పాలనా.. అని నిలదీశారు.
'కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో.. దళితులపై పోలీసుల దమనకాండను తీవ్రంగా ఖండిస్తున్నాను. బట్టలు విప్పి మరి దళితులను అరెస్టు చేసిన పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయడంతో పాటు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. బాధ్యులైన పోలీసులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను' అని కవిత ట్వీట్ చేశారు.
'బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున కామారెడ్డిలో దళితుడి బట్టలూడదీసి పోలీసులు ఈడ్చుకుపోవడం దారుణం. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా బ్యానర్ కట్టడం నేరం ఎప్పుడు అయిందో చెప్పాలి. బ్యానర్ కట్టిన దళితుడిపై ఇంత క్రూరంగా దాడి చేయడం ఆటవికం. ప్రతీ రోజు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అరాచక పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ దాష్టికాలపై.. ఇప్పటికైనా రాహుల్ గాంధీ స్పందించాలి. రాహుల్ గాంధీ కోరుకుంటున్న మొహబ్బత్ కా దుకాణ్‌లో దళితుల పరిస్థితి ఇలానే ఉంటుందా.. దళితుడి బట్టలూడదీసిన సంఘటనకు సంబంధమున్న పోలీసులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. పోలీసుల దాడిలో గాయపడ్డ దళిత వ్యక్తికి పార్టీ పరంగా అండగా ఉంటాం' అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించడానికి వెళ్లిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను.. పోలీసులు అడ్డుకున్నారు. మొదటి అంతస్తులోకి వెళ్లడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. దీంతో జై భీమ్ అంటూ నినాదాలు చేస్తూ.. విగ్రహం ముందు బైఠాయించారు ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ కార్యకర్తలు. ఆ తర్వాత ఎమ్మెల్సీ కవితతో పాటు.. కొంతమందిని మొదటి అంతస్తుకు వెళ్లేందుకు అనుమతించారు.
భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఆ మహనీయుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయనతోపాటు.. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.
సంబంధిత కథనం