MLC Jeevan Reddy : మీలాగా స్కామ్‍లలో అప్డేట్ కావటం మాకు సాధ్యం కాదు - ఎమ్మెల్సీ కవితపై జీవన్ రెడ్డి ఫైర్
MLC Jeevan Reddy News : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు.
MLC Jeevan Reddy On Kavitha: మద్యం కుంభకోణంలో కూరుకుపోయిన ఎమ్మెల్సీ కవితకు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కనబడడం లేదని,ప్రతిపక్షమైన కాంగ్రెస్ పైన మాత్రమే విమర్శలు చేస్తుండడం విడ్డూరంగా ఉందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన… జగిత్యాలకు జీవన్ రెడ్డి ఏం చేశాడనేది ప్రజలకు తెలుసన్నారు.
ట్రెండింగ్ వార్తలు
ఇటీవలే జగిత్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె…. జగిత్యాలకు జీవన్ రెడ్డి ఏం చేశారని కవిత ప్రశ్నించారు. దీనిపై స్పందించిన జీవన్ రెడ్డి… కవిత వ్యాఖ్యాలను తప్పుబట్టారు. ఎమ్మెల్సీ కవిత వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని, జగిత్యాల జిల్లాలోని అన్ని గ్రామాలకు రోడ్లు వేయడంతో పాటు సాగు తాగునీరు, విద్యుత్ సరఫరా సౌకర్యం కల్పించి, మౌలిక వసతులకు పెద్దపీట వేశామన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్న మామిడి మార్కెట్ ను రైతుల కోసం 25 ఎకరాల్లో తన హయాంలోనే నిర్మించామని గుర్తు చేశారు.
నియంతృత్వపోకడతో, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడ్డుకునేందుకు అనుభవజ్ఞులైన నాయకులు అవసరమని ప్రజలు భావిస్తున్నారని జీవన్ రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి దళితుడిని సీఎంగా చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. దళితుల్లో ముఖ్యమంత్రి అయ్యే అర్హతలున్న నాయకులు ఎవ్వరూ మీకు కనిపించడం లేదా అని నిలదీశారు. తాను స్వయంకృషితో ఎదిగిన నాయకుడినని.. కుటుంబ పాలన గురించి మీరు మాకు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని మండిపడ్డారు. ప్రజాభిమానం ఎదుట మీ డబ్బు సంచులు, మద్యం పనిచేయవని అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ఆది నుంచి కేవలం హరీశ్ రావు మాత్రమే ఉన్నారని, 2004లో కేసీఆర్ మంత్రి అయిన తర్వాత మాత్రమే కవిత, కేటీఆర్ అమెరికా నుంచి వచ్చారని గుర్తు చేశారు. పోడు భూముల పట్టాల పంపిణీపై రాహుల్ గాంధీ అప్డేట్ కావాలనే వ్యాఖ్యలను కూడా జీవన్ రెడ్డి ఖండించారు. మీలాగా స్కాంలలో అప్డేట్ కావడం మాకు సాధ్యంకాని పని అని ఎద్దేవా చేశారు. ఇకనైనా వాస్తవాలు తెలుసుకొని, మాట్లాడాలని, అవాకులు.. చెవాకులు పేల్చడం మానుకోవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హితవు పలికారు.
రిపోర్టింగ్ : గోపికృష్ణ, కరీంనగర్
సంబంధిత కథనం