అంతర్గత ప్రజాస్వామ్యం కాస్త ఎక్కువగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో పార్టీ ఫిరాయింపులు కాంగ్రెస్ శ్రేణులను ఆందోళన గురిచేస్తున్నాయి. పాత, కొత్త కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధానికి దారి తీస్తున్నాయి. పార్టీ పరువును బజారున పడేసే పరిస్థితి కనిపిస్తుంది. పార్టీ ఫిరాయింపులను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఓ అడుగు ముందుకేసి పార్టీలోని కొందరి నాయకుల వైఖరిని తప్పుపడుతూ అధిష్టానానికి మూడు పేజీల లేఖ రాశారు.
గత నాలుగు మాసాలుగా ఆవేదనతో ఆందోళన చెందుతున్న జీవన్ రెడ్డి తన ముఖ్య అనుచరుడు జగిత్యాల జిల్లా జాబితాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ గంగారెడ్డి దారుణ హత్యకు గురి కావడం ఆయనను మరింత ఆగ్రహానికి గురి చేసింది. తాడోపెడో తేల్చుకునేందుకు సిద్ధమై పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సుదీర్ఘ లేఖ రాసి పార్టీని, కార్యకర్తలను బతికించుకోవాలంటే తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జీవన్ రెడ్డి డిమాండ్ సమర్థిస్తూ ఒక్కొక్కరు పార్టీలో జరుగుతున్న పరిణామాలు, పార్టీ ఫిరాయింపులపై అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. జీవన్ రెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు. బిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పాత కొత్త నాయకుల మధ్య సమన్వయ లోపం అంతర్గత విభేదాలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.
పార్టీ ఫిరాయింపులపై అసంతృప్తితో రగిలిపోతున్న కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బహాటంగా కాంగ్రెస్ నేతల తీరును తప్పుపట్టగా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమర్థించారు. ఆయన డిమాండ్ సరైందేనని, ఆవేదనకు ఆందోళనకు అర్థం ఉందన్నారు. ఇక మాజీ ఎంపీ ఏఐసీసీ ప్రచార కన్వీనర్ మధు యాష్కీ గౌడ్ జగిత్యాలలో జీవన్ రెడ్డిని కలిసి సంఘీభావం తెలిపారు. నాలుగు రోజుల క్రితం హత్య గురైన గంగారెడ్డి కుటుంబాన్ని పరామర్శించి జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి పార్టీ ఫిరాయింపులపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులు మంచి పద్ధతి కాదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పై ప్రేమతో పార్టీ మారలేదన్నారు మధుయాష్కీ. కేవలం అక్రమ ఆస్తులు కాపాడుకోవడానికి, రాజకీయ భవిష్యత్తు కోసం మాత్రమే కాంగ్రెస్ లో చేరారని స్పష్టం చేశారు. పాత కాంగ్రెస్ నాయకులను నిర్వీర్యం చేసేలా, అవమానపరిచేలా చేరికలు జరగడం మంచిది కాదన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలుస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బిఆర్ఎస్ నేత కేటీఆర్ పదేపదే అనడంతో కొందరు కాంగ్రెస్ లో చేరారని అనివార్య కారణాలతోనే ఎమ్మెల్యేలు చేర్చుకున్నామని పార్టీ పెద్దలు చెబుతున్నారని తెలిపారు. పార్టీ ఫిరాయింపులకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అంటూనే ప్రస్తుత పరిస్థితుల్లో చట్టంలోని లొసుగుల కారణంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే అవకాశం లేదన్నారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి, పాత కాంగ్రెస్ నాయకులు అవమానాలకు గురికాకుండా అసలు సిసలైన కాంగ్రెస్ కార్యకర్తలకే నామినేటెడ్ పదవులు ఇవ్వాలని కోరామని తెలిపారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు చెప్పినట్టు పార్టీ పదవులు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని లేదన్నారు. అధినాయకత్వం జగిత్యాల ఘటనను తీవ్రంగా పరిగణిస్తుందని… త్వరలోనే పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు.
పార్టీ ఫిరాయింపులతో పాత కాంగ్రెస్ నాయకులు నిర్విర్యమై, ప్రత్యర్ధులు రెచ్చిపోయారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరో సారి ఆక్రోశాన్ని వెల్లగక్కారు. పార్టీ ఫిరాయింపులతో తాము నిస్సాహయులమై కాంగ్రెస్ కార్యకర్త సోదరుడులాంటి గంగారెడ్డి ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
గంగారెడ్డి హత్యతో అసలైన కాంగ్రెస్ నాయకులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయారని తెలిపారు. పాత కాంగ్రెస్ నాయకులను నిర్వీర్యం చేసేలా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్న పార్టీ ఫిరాయింపులపై అధిష్టానం దృష్టి సారించాలని కోరారు. పార్టీ ఫిరాయింపులపై జీవన్ రెడ్డి లేవనెత్తిన అంశాలపై కాంగ్రెస్ నేతల నుంచి మద్దతు లభించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
సంబంధిత కథనం